Skip to content
Opens in a new window

[1] ఆ తరువాత యోసేపుకు “మీ తండ్రిగారు అనారోగ్యంగా ఉన్నార”ని కబురు వచ్చింది. కనుక యోసేపు తన ఇద్దరు కొడుకులైన మనష్షేనూ ఎఫ్రాయింనూ వెంటబెట్టుకొని బయలుదేరాడు.

[2] ఎవరో ఒకరు యాకోబుతో “ఇదిగో మీ కొడుకు యోసేపు మీ దగ్గరికి వస్తున్నాడు” అన్నారు. అప్పుడు ఇస్రాయేల్ బలం పుంజుకొని పడకమీద కూర్చున్నాడు.

[3] యాకోబు యోసేపుతో ఇలా అన్నాడు: “అమిత శక్తిగల దేవుడు కనానుదేశంలో ఉన్న లూజులో నాకు ప్రత్యక్షమై నన్ను దీవించి నాతో చెప్పినదేమిటంటే

[4] ‘నిన్ను ఫలవంతంగా చేసి నీ సంతానాన్ని అధికం చేస్తాను. నీవు జనాల సమూహమయ్యేలా చేస్తాను. నీ తరువాత నీ సంతానానికి ఈ దేశాన్ని ఎప్పటికీ సొత్తుగా ఇస్తాను.’

[5] ఇప్పుడు విను. నేను ఈజిప్ట్ దేశానికి వచ్చేముందు ఈజిప్ట్‌లో నీకు పుట్టిన ఇద్దరు కొడుకులు నా సంతానమే. రూబేను, షిమ్యోనులాగే ఎఫ్రాయిం, మనష్షే నా కొడుకులే.

[6] వారి తరువాత నీకు పుట్టే సంతానం నీదే. అయితే వారి వారసత్వం వారి అన్నల పేర వ్రాసి ఉంటుంది.

[7] “నేను పద్దన్‌అరాం నుంచి వచ్చినప్పుడు ప్రయాణంలోనే కనానుదేశంలో ఎఫ్రాతాకు ఇంకా కాస్త దూరాన ఉన్నప్పుడు రాహేలు చనిపోయి నన్ను దుఃఖాక్రాంతుణ్ణి చేసింది. ఎఫ్రాతాకు వెళ్ళే తోవలో ఆమెను పాతిపెట్టాను. ఎఫ్రాతా అంటే బేత్లెహేం.”

[8] యోసేపు కొడుకులను ఇస్రాయేల్ చూచి “వీరెవరు?” అని అడిగాడు.

[9] అందుకు యోసేపు “దేవుడు ఈ దేశంలో నాకు ప్రసాదించిన కొడుకులు వీరు” అన్నాడు. అతడు “వారిని దగ్గరికి తీసుకువస్తే నేను వారిని దీవిస్తాను” అన్నాడు.

[10] ఇస్రాయేల్ వృద్ధాప్యం వల్ల చూడలేనంత మందదృష్టి గలవాడు. యోసేపు అతనిదగ్గరికి వారిని తీసుకువచ్చాడు. అతడు వారిని ముద్దు పెట్టుకొని కావలించుకొన్నాడు.

[11] ఇస్రాయేల్ యోసేపుతో, “నీ ముఖాన్ని మళ్ళీ చూస్తాననుకోలేదు. అయితే నీ సంతానాన్ని కూడా దేవుడు నన్ను చూడనిచ్చాడు” అన్నాడు.

[12] అప్పుడు యోసేపు వారిని అతని మోకాళ్ళ మధ్య నుంచి తీసుకొని, సాగిలపడ్డాడు.

[13] తరువాత ఇస్రాయేల్ యొక్క ఎడమ చేతివైపుకు యోసేపు తన కుడిచేత ఎఫ్రాయింనూ, ఇస్రాయేల్ కుడి చేతివైపుకు తన ఎడమచేత మనష్షేనూ తీసుకొని ఇద్దరినీ అతని దగ్గరికి జరిపాడు.

[14] మనష్షే పెద్దవాడయినప్పటికీ ఇస్రాయేల్ తన కుడి చెయ్యి చాపి, కనిష్ఠుడు ఎఫ్రాయిం తలమీదా, తన ఎడమ చెయ్యి మనష్షే తలమీదా ఉంచాడు. అతడిలా బుద్ధిపూర్వకంగానే చేశాడు.

[15] అతడు యోసేపును దీవిస్తూ ఇలా అన్నాడు: “నా పూర్వీకులు అబ్రాహామూ ఇస్సాకూ ఏ దేవుని సముఖంలో నడుచుకున్నారో ఆ దేవుడు నా జన్మదినం నుంచి ఈ రోజువరకు నేను బతికిన రోజులన్నిట్లో నాకు కాపరిగా ఉన్నాడు.

[16] ఆయన దూత అన్ని కీడులనుంచి నన్ను విడిపించాడు. ఆయన ఈ అబ్బాయిలను దీవిస్తాడు గాక! నా పేరు ప్రతిష్ఠలు, నా పూర్వీకులు అబ్రాహాము ఇస్సాకుల పేరు ప్రతిష్ఠలు వారికి ఉంటాయి గాక. లోకంలో వారు పెద్ద జనసమూహంగా అవుతారు గాక.”

[17] యోసేపు తన తండ్రి అతని కుడి చెయ్యి ఎఫ్రాయిం తలమీద ఉంచడం చూశాడు. అది అతనికి అయిష్టంగా ఉంది. తన తండ్రి చెయ్యి మనష్షే తలమీద పెట్టించాలని దాన్ని ఎఫ్రాయిం తలమీదనుంచి ఎత్తి ఇలా అన్నాడు:

[18] “అలా కాదు, నాన్నగారూ! పెద్దవాడు ఇతడే; ఇతడి తలమీదే నీ కుడిచెయ్యి ఉంచు.”

[19] అతని తండ్రి ఒప్పుకోలేదు. “నాకు తెలుసు, బాబూ, నాకు తెలుసు. ఇతడు కూడా గొప్పవాడై ఒక జనం అవుతాడు. అయితే ఇతడి తమ్ముడు ఇతడి కంటే గొప్పవాడవుతాడు. అతడి సంతానం జనాల సమూహాలు అవుతారు” అన్నాడు.

[20] ఆరోజు అతడు వారిని దీవిస్తూ “ఇస్రాయేల్ ప్రజలు ఆశీర్వచనం పలికేటప్పుడు వారు మీ పేరెత్తి ‘దేవుడు మిమ్మల్ని ఎఫ్రాయింలాగా మనష్షే లాగా చేస్తాడు గాక’ అని దీవిస్తారు” అని చెప్పి మనష్షే కంటే ఎఫ్రాయింను ముందుగా ఉంచాడు.

[21] ఇస్రాయేల్ యోసేపుతో “చూడు, నేను చనిపోతున్నాను. అయితే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీ పూర్వీకుల దేశానికి మిమ్మల్ని తిరిగి రప్పిస్తాడు.

[22] నేను నా కత్తితోనూ, నా వింటితోను అమోరీవాళ్ళ చేతిలో నుంచి తీసుకున్నదాంట్లో నీ అన్నదమ్ములకు ఇచ్చేకంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చాను.”

ఆదికాండం (ఆరంభాలు) — Chapters