[1] అబ్రాము తనకున్నదంతా తీసుకొని తన భార్యతోపాటు ఈజిప్ట్‌దేశాన్ని విడిచి, నెగెవ్‌కు వెళ్ళిపోయాడు. లోత్ కూడా వారితో వచ్చాడు.
[2] అబ్రాము చాలా పశువులూ, వెండి బంగారాలు ఉన్నవాడు.
[3] తన ప్రయాణాల్లో అతడు దక్షిణంనుంచి బేతేల్ ప్రాంతానికి, బేతేల్‌కూ హాయీకీ మధ్య మొదట్లో తన గుడారం వేసుకొన్న స్థలానికి, అంటే మొదట్లో తాను బలిపీఠం కట్టిన చోటుకు వెళ్ళాడు.
[4] అక్కడ అబ్రాము యెహోవా పేర ప్రార్థన చేశాడు.
[5] అబ్రాముతో వచ్చిన లోత్‌కు కూడా గొర్రెల మందలూ, గొడ్డు, గోదలూ, గుడారాలు ఉన్నాయి.
[6] వారిద్దరూ కలిసి ఒక్కచోట కాపురం చేయడానికి చాలినంత భూమి లేకపోయింది. కలిసి నివసించ వీలులేనంత విస్తారమైన సంపద వారికి ఉండేదన్నమాట.
[7] అబ్రాము మందలు కాసేవాళ్ళకూ లోత్ మందలు కాసేవాళ్ళకూ మధ్య జగడం వచ్చింది. అప్పటికే కనానువాళ్ళూ పెరిజ్జివాళ్ళూ ఆ దేశంలో ఉన్నారు.
[8] అబ్రాము లోత్‌తో “నీకూ నాకూ మధ్య నీ కాపరులకూ, నా కాపరులకూ మధ్య జగడం ఉండకూడదు. సమీపబంధువులం గదా మనం.
[9] ఈ దేశమంతా నీ ఎదుట లేదా? ఇప్పుడు వేరైపోదాం. నీవు ఎడమవైపుకు వెళ్ళిపోతే నేను కుడివైపుకు వెళ్తాను. నీవు కుడివైపుకు వెళ్ళిపోతే ఎడమవైపుకు వెళ్తాను” అన్నాడు.
[10] లోత్ తన తలెత్తి యొర్దాను మైదానాల ప్రాంతాన్నంతా చూశాడు. అది నీళ్ళు పారే ప్రదేశం. యెహోవా సొదొమ గొమొర్రాలను నాశనం చేసే ముందు ఆ ప్రదేశం యెహోవా తోటలాగా ఉండేది. ఈజిప్ట్‌లో సోయరు దగ్గరకు వచ్చేటప్పుడు కనిపించే ప్రదేశంలాగా ఉండేది.
[11] ఇదంతా చూచి లోత్ ఆ యొర్దాను మైదానాల ప్రాంతాన్నంతా ఎన్నుకొని తూర్పుదిక్కుకు ప్రయాణమయ్యాడు. ఇలా వారు ఒకరినుంచి ఒకరు వేరైపోయారు.
[12] అబ్రాము కనానుదేశంలో కాపురమున్నాడు గానీ, లోత్ ఆ మైదానాల ప్రాంతం పట్టణాల మధ్యలో కాపురముంటూ తన గుడారం సొదొమ దగ్గరే వేసుకొన్నాడు.
[13] అయితే సొదొమ మనుషులు దుర్మార్గులూ, యెహోవాకు విరోధంగా ఘోరమైన పాపాలు చేస్తూ ఉండేవాళ్ళు.
[14] లోత్ అబ్రాము దగ్గరనుంచి వేరైపోయిన తరువాత యెహోవా అబ్రాముతో ఇలా అన్నాడు: “నీ తలెత్తి నీవున్న స్థలంనుంచి ఉత్తరంగానూ దక్షిణంగానూ తూర్పుగానూ పడమరగానూ చూడు.
[15] ఎందుకంటే, నీవు చూస్తున్న ఈ భూమినంతా ఎల్లకాలం నీకూ నీ సంతానానికీ ఇస్తాను.
[16] అంతేగాక, నీ సంతానాన్ని ధూళి రేణువులంత విస్తారంగా చేస్తాను. ఎవరైనా ధూళి రేణువులు లెక్కపెట్టగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్కపెట్టడం వీలవుతుంది.
[17] ఇప్పుడు ఈ దేశమంతటా సంచరించు. ఎందుకంటే దీన్ని నీకిస్తాను.”
[18] అప్పుడు అబ్రాము తన గుడారం తీసి హెబ్రోనులో మమ్రేలో ఉన్న సిందూర వృక్షాల దగ్గరకు వెళ్ళి కాపురమున్నాడు. అక్కడ అతడు యెహోవాకు బలిపీఠం కట్టాడు.