[1] ఆదిలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృజించాడు.
[2] అప్పుడు భూతలం శూన్యంగా రూపం లేకుండా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్మి ఉంది. దేవుని ఆత్మ నీళ్ళపై చలిస్తూ ఉన్నాడు.
[3] అప్పుడు దేవుడు “వెలుగు ఉండాలి” అనగానే వెలుగు వచ్చింది.
[4] దేవుడు ఆ వెలుగు చూశాడు. అది బాగుంది. ఆయన ఆ వెలుగును చీకటినుంచి ప్రత్యేకించాడు.
[5] ఆ వెలుగును “పగలు”, ఆ చీకటిని “రాత్రి” అన్నాడు దేవుడు. సాయంకాలం అయింది, ఉదయం అయింది – ఒక రోజు.
[6] దేవుడు ఇలా అన్నాడు: “నీళ్ళ మధ్య విశాలం కలగాలి. ఆ విశాలం నీళ్ల నుంచి నీళ్ళను వేరు చేయాలి.”
[7] దేవుడు ఆ విశాలాన్ని చేశాడు. ఆ విశాలంక్రింద ఉన్న నీళ్ళనుంచి దానిపై ఉన్న నీళ్ళను వేరుపరచాడు. అలాగే జరిగింది.
[8] దేవుడు ఆ విశాలాన్ని “ఆకాశం” అన్నాడు. సాయంకాలం అయింది, ఉదయం అయింది – రెండో రోజు.
[9] దేవుడు “ఆకాశం క్రింద ఉన్న నీళ్ళు ఒకే స్థలంలో సమకూడాలి, ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది.
[10] దేవుడు ఆరిన నేలను “భూమి”, సమకూడిన నీళ్ళను “సముద్రాలు” అన్నాడు. దేవుడు అదంతా చూశాడు. అది బాగుంది.
[11] “భూమి మొక్కలను మొలిపించాలి. భూమిమీద విత్తనాలు ఇచ్చే చెట్లూ, వాటి వాటి జాతిప్రకారమే కాయలు కాసే వృక్షాలు ఉండాలి. ఆ పళ్ళలో వాటి వాటి విత్తనాలు ఉండాలి” అన్నాడు దేవుడు. అలాగే జరిగింది.
[12] భూమి మొక్కలనూ, వాటి వాటి జాతిప్రకారమే విత్తనాలిచ్చే చెట్లనూ వాటి వాటి జాతిప్రకారమే ఫలించే వృక్షాలనూ (ఆ పళ్ళలో వాటి వాటి విత్తనాలున్నవి) మొలిపించింది. దేవుడు అదంతా చూశాడు. అది బాగుంది.
[13] సాయంకాలం అయింది, ఉదయం అయింది – మూడో రోజు.
[14] దేవుడు “పగటిని రాత్రిని వేరుపరచడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. అవి సూచనలూ కాలాలూ దినాలూ సంవత్సరాలకోసం అలా ఉంటాయి.
[15] అవి భూలోకంమీద వెలుగివ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా ఉంటాయి” అన్నాడు. అప్పుడు అలాగే జరిగింది.
[16] దేవుడు రెండు గొప్ప జ్యోతులను చేశాడు. ఆ రెంటిలో పెద్దది పగటిని పాలించడానికీ, చిన్నది రాత్రిని పాలించడానికీ వాటిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు.
[17] భూలోకంమీద వెలుగివ్వడానికీ,
[18] పగటినీ రాత్రినీ పాలించడానికీ వెలుగును చీకటినుంచి వేరుపరచడానికీ దేవుడు వాటిని ఆకాశ విశాలంలో ఉంచాడు. దేవుడు అదంతా చూశాడు. అది బాగుంది.
[19] సాయంకాలం అయింది, ఉదయం అయింది – నాలుగో రోజు.
[20] దేవుడు ఇలా అన్నాడు: “ఆ నీళ్ళు జలచరాలతో నిండిపోవాలి. గాలిలో ఎగిరే పక్షులు భూమిపై ఆకాశ విశాలంలో ఉండాలి.”
[21] బ్రహ్మాండమైన చేపలనూ, ఆ నీళ్ళ నిండా చలిస్తున్న అన్ని విధాల జలచరాలనూ వాటి వాటి జాతిప్రకారమే దేవుడు సృజించాడు. అన్ని విధాల పక్షులను కూడా వాటి వాటి జాతిప్రకారమే దేవుడు సృజించాడు. దేవుడు అదంతా చూశాడు. అది బాగుంది.
[22] దేవుడు వాటిని ఇలా దీవించాడు: “ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి. సముద్రమంతా నింపండి. భూమిమీద పక్షులు అధికం కావాలి.”
[23] సాయంకాలం అయింది, ఉదయం అయింది – అయిదో రోజు.
[24] “భూమి ప్రాణులను వాటి వాటి జాతిప్రకారమే ఉత్పత్తి చేయాలి; పశువులనూ ప్రాకే ప్రాణులనూ అడవి మృగాలనూ వాటి వాటి జాతిప్రకారమే ఉత్పత్తి చేయాలి” అన్నాడు దేవుడు. అలాగే జరిగింది.
[25] దేవుడు అడవి మృగాలనూ పశువులనూ నేలమీద తిరిగే ప్రతి విధమైనదాన్నీ, అన్నిటినీ వాటి వాటి జాతిప్రకారమే చేశాడు. దేవుడు అదంతా చూశాడు. అది బాగుంది.
[26] దేవుడు ఇలా అన్నాడు, “మనం మన స్వరూపంలో మన పోలికలో మానవుణ్ణి చేద్దాం. వారికి సముద్రంలోని చేపలమీదా గాలిలో ఎగిరే పక్షులమీదా పశువులమీదా భూలోకమంతటిమీదా భూమిపై తిరిగే ప్రతిదానిమీదా అధికారం ఉంటుంది.”
[27] అప్పుడు దేవుడు తన స్వరూపంలో మానవుణ్ణి సృజించాడు. స్త్రీగా, పురుషుడుగా వారిని సృజించాడు.
[28] దేవుడు వారిని దీవించి వారితో ఇలా అన్నాడు: “మీరు ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి. భూలోకమంతటా విస్తరించండి. దాన్ని లోబరుచుకోండి. సముద్రంలోని చేపలమీదా గాలిలో ఎగిరే పక్షులమీదా భూమిపై తిరిగే ప్రతిదానిమీదా పరిపాలన చేయండి.”
[29] దేవుడు ఇంకా ఇలా అన్నాడు, “ఇదిగో వినండి. భూమి అంతటా ఉన్న విత్తనాలు గల ప్రతి మొక్కనూ విత్తనాలిచ్చే ఫలాలు గల ప్రతి చెట్టునూ మీకిచ్చాను. అవి మీకు ఆహారంగా ఉంటాయి.
[30] భూమిమీద ఉన్న అన్ని జంతువులకూ గాలిలో ఎగిరే అన్ని పక్షులకూ భూమిపై తిరిగే అన్ని ప్రాణులకూ పచ్చని చెట్లన్నీ ఆహారంగా ఇచ్చాను.” అలాగే జరిగింది.
[31] దేవుడు తాను చేసినదంతా చూశాడు; అది చాలా బాగుంది. సాయంకాలం అయింది, ఉదయం అయింది – ఆరో రోజు.