Skip to content
Opens in a new window

[1] అబ్రాహాము వయసు మళ్ళిన వృద్ధుడు. అన్ని విషయాల్లో యెహోవా అబ్రాహాముకు ఆశీస్సులు కుమ్మరించాడు.

[2] అబ్రాహాము తన ఆస్తినంతా చూచే తన ఇంటి పెద్ద సేవకుడితో ఇలా అన్నాడు: “నీ చెయ్యి నా తొడకింద పెట్టు.

[3] ఆకాశానికీ భూమికీ దేవుడైన యెహోవాతోడని నీచేత ఒక శపథం చేయించుకుంటాను. ఏమిటంటే నేను కాపురమున్న ఈ కనానుదేశ ప్రజల్లో నుంచి ఏ పిల్లనూ నా కొడుక్కు పెళ్ళి చేయకూడదు.

[4] కానీ నీవు నా స్వదేశానికీ, నా బంధువులదగ్గరికీ వెళ్ళి, అక్కడ నా కొడుకు ఇస్సాకు కోసం ఒకామెను తీసుకురావాలి.”

[5] అతనితో ఆ సేవకుడు “ఒకవేళ ఈ దేశానికి నా వెంట వచ్చెయ్యడానికి ఆమె ఇష్టపడదేమో. అలాంటప్పుడు నీవు బయలు దేరివచ్చిన ఆ దేశానికి నేను నీ కొడుకును తీసుకుపోవాలా?” అన్నాడు.

[6] అబ్రాహాము అతడితో అన్నాడు, “అక్కడికి నా కొడుకును తీసుకువెళ్ళకూడదు సుమా!

[7] పరలోక దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటినుంచీ నా స్వదేశంనుంచీ నన్ను రప్పించి, నాతో మాట్లాడి, ‘ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను’ అని వాగ్దానం చేశాడు. ఆ దేవుడే తన దూతను నీకు ముందుగా పంపుతాడు. ఈ విధంగానే నీవు నా కొడుకు పెళ్ళాడడానికి ఒకామెను అక్కడనుంచి తీసుకువస్తావు.

[8] “ఒకవేళ ఆమెకు నీ వెంట వచ్చెయ్యడం ఇష్టం కాకపోతే నీకు ఈ శపథంనుంచి విడుదల కలుగుతుంది. నా కొడుకును అక్కడికి ఏ మాత్రం తీసుకుపోకూడదు.”

[9] అప్పుడా సేవకుడు తన యజమాని అబ్రాహాము తొడక్రింద తన చెయ్యి పెట్టి ఆ విషయంలో అతనికి శపథం చేశాడు.

[10] అతడు తన యజమాని ఒంటెల్లో పది ఒంటెలను, తన యజమానికి ఉన్నదానిలో మేలురకమైనవి కొన్నిటిని తీసుకువెళ్ళాడు. అతడు ప్రయాణమై ఆరామ్నాహారయిమ్ దేశానికి వెళ్ళి నాహోరు నివసించే ఊరు చేరాడు.

[11] అది సాయంకాలం, స్త్రీలు నీళ్ళు చేదుకోవడానికి ఊరి బయట ఉన్న బావిదగ్గరకు వచ్చే సమయం. అతడా బావిదగ్గర తన ఒంటెలను మోకరించేలా చేసి ఇలా అన్నాడు:

[12] “యెహోవా! నా యజమానుడైన అబ్రాహాము దేవా! నాకు ఈ వేళ అంతా చక్కగా జరిగించి నా యజమాని అబ్రాహాము మీద అనుగ్రహం చూపు.

[13] ఇదిగో, నేను ఈ నీటిబుగ్గదగ్గర నిలబడి ఉన్నాను. ఈ ఊరివాళ్ళ పిల్లలు నీళ్ళు చేదుకొందామని వస్తున్నారు.

[14] నేను వాళ్ళలో ఒకామెతో ఇలా అంటాను: ‘నేను నీళ్ళు తాగడానికి దయచేసి నీ కడవ వంచు’. ఆమె ‘తాగండి. మీ ఒంటెలకు కూడా నీళ్ళు పోస్తాను’ అంటే, నీవు నీ సేవకుడైన ఇస్సాకు కోసం ఎన్నుకున్నది ఆ అమ్మాయే అయివుండాలి. ఈ విధంగా నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపించావని తెలుసుకుంటాను.”

[15] అతడీ మాటలు అంటూ ఉండగానే రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చింది. ఆమె బెతూయేలు కూతురు. (బెతూయేలు ఎవరంటే, అబ్రాహాము తోబుట్టువు నాహోరు యొక్క భార్య అయిన మిల్కా కొడుకు)

[16] ఆ అమ్మాయి చాలా చక్కనిది. ఆమె కన్య. పురుషస్పర్శ ఎరుగనిది. ఆమె బావిలోకి దిగిపోయి కడవ నీళ్ళతో నింపుకొని ఎక్కిరాగా,

[17] ఆ సేవకుడు ఆమెకు ఎదురు పరిగెత్తి వెళ్ళి “దయచేసి నీ కడవ నీళ్ళు కొంచెం నన్ను తాగనివ్వమ్మా” అని అడిగాడు.

[18] ఆమె “అయ్యగారూ, తాగండి” అని చెప్పి త్వరపడి తన కడవ చేతిమీదికి దించి అతడికి దాహమిచ్చింది.

[19] అతడికి దాహమిచ్చాక ఆమె “మీ ఒంటెలు కూడా తాగడానికి చాలినంత నీళ్ళు చేది పోస్తాను” అంది.

[20] ఆమె త్వరగా తన కడవ తొట్టిలో పోసి ఇంకా నీళ్ళు చేదడానికి బావికి పరుగెత్తి అతడి ఒంటెలన్నిటికీ నీళ్ళు చేది పోసింది.

[21] ఈ లోగా ఆ మనుషుడు తాను ప్రయాణం చేసిన ఉద్దేశాన్ని యెహోవా సఫలం చేశాడో లేదో తెలుసుకుందామని మౌనం వహించి ఆమెను చూస్తూ ఉన్నాడు.

[22] ఒంటెలు త్రాగిన తరువాత అతడు అరతులం బంగారు ముక్కు పుడక, ఆమె చేతులకు పది తులాల బంగారు గాజులు రెండు తీసి,

[23] “నువ్వు ఎవరి అమ్మాయివి? దయచేసి నాతో చెప్పమ్మా. మేము ఈ రాత్రి ఉండడానికి నీ తండ్రి ఇంట స్థలం ఉంటుందా?” అని అడిగాడు.

[24] ఆమె అతడితో “నేను బెతూయేలు కూతురిని. ఆయన నాహోరు మిల్కాల కుమారుడు” అంది.

[25] ఆమె ఇంకా “మీరుండడానికి మా ఇంట స్థలం ఉంది. మా దగ్గర చాలా గడ్డీ మేతా కూడా ఉన్నాయి” అంది.

[26] అప్పుడతడు తల వంచి యెహోవాను ఆరాధించి,

[27] “నా యజమాని అబ్రాహాము దేవుడైన యెహోవాకు స్తుతులు కలుగుతాయి గాక! ఆయన నా యజమానిపట్ల తన కృప విశ్వసనీయత చూపడం మానలేదు. నేను త్రోవలో ఉండగానే నా యజమాని బంధువుల ఇంటికి నేను సూటిగా వచ్చేలా యెహోవా చేశాడు” అన్నాడు.

[28] ఆ అమ్మాయి పరుగెత్తి వెళ్ళి, తన తల్లి ఇంటివాళ్ళకు ఈ సంగతులను తెలియజేసింది.

[29] రిబ్కాకు తోడబుట్టినవాడొకడు ఉన్నాడు. అతడి పేరు లాబాను. లాబాను బావిదగ్గర ఉన్న ఆ మనిషి దగ్గరకు పరుగెత్తుకొని వెళ్ళాడు.

[30] తాను చూచినట్టే తన తోబుట్టువు రిబ్కా దగ్గర ఉన్న ఆ ముక్కుపుడక, చేతుల గాజులు, “ఆ మనిషి నాతో ఇలా చెప్పాడు” అన్న ఆమె మాటలు తలపోస్తూ అతడు బయలుదేరి వచ్చి బావిదగ్గర ఆ మనిషి ఒంటెలవద్ద నిలబడి ఉండడం చూశాడు. అతణ్ణి సమీపించి ఇలా అన్నాడు:

[31] “యెహోవా దీవించినవారు మీరు, లోపలికి రండి, మీరు బయట నిలబడి ఉండడం దేనికి? నేను ఇల్లూ, ఒంటెలకు స్థలమూ సిద్ధం చేశాను.”

[32] అప్పుడా మనిషి ఆ ఇంటికి వచ్చాడు. లాబాను ఒంటెల జీనులు విప్పి, వాటికి గడ్డీ మేతా పెట్టాడు. ఆ మనిషికీ అతనితో వచ్చినవాళ్ళకూ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాడు.

[33] అతనికి భోజనం కూడా పెట్టాడు. గానీ అతడు “నేను వచ్చిన పని చెప్పకుండా భోజనం చేయను” అన్నాడు. లాబాను “చెప్పండి” అనగా అతడు ఇలా చెప్పాడు:

[34] “నేను అబ్రాహాము సేవకుణ్ణి.

[35] నా యజమానిని యెహోవా ఎంతో దీవించాడు. గనుక అతడు గొప్పవాడయ్యాడు. యెహోవా అతనికి గొర్రెల, మేకల మందల్నీ పశువుల మందల్నీ వెండి బంగారాలనూ దాస దాసీలనూ ఒంటెల్నీ గాడిదల్నీ ప్రసాదించాడు.

[36] నా యజమానుని భార్య శారా వృద్ధాప్యంలో నా యజమానికి ఓ కుమారుణ్ణి కన్నది. నా యజమాని తనకు కలిగినదంతా ఆ కుమారుడికిచ్చాడు.

[37] నా యజమాని నాచేత ఓ శపథం చేయించి ఇలా అన్నాడు: ‘నేను కాపురమున్న కనాను దేశంవారిలో నుంచి ఏ పిల్లనూ నా కొడుకుకు చేయకూడదు.

[38] కాని, నీవు నా తండ్రి ఇంటికి నా బంధువుల దగ్గరికి వెళ్ళి, నా కొడుకు కోసం ఒకామెను తీసుకురావాలి’.

[39] నేను నా యజమానితో ‘ఒకవేళ ఆమె నా వెంట రాదేమో’ అన్నాను.

[40] ఆయన నాతో అన్నాడు, ‘నేను ఎవరి సముఖంలో బ్రతుకుతున్నానో ఆ యెహోవా తన దూతను నీతోపాటు పంపించి నీ ప్రయాణం సఫలం చేస్తాడు. అలా నా బంధువుల్లో నా తండ్రి ఇంటినుంచి నా కొడుకుకోసం ఒకామెను తీసుకు వస్తావు.

[41] నీవు నా బంధువులదగ్గరికి చేరినప్పుడు ఈ శపథంనుంచి నీకు విడుదల అవుతుంది. వారు ఆమెనివ్వకపోతే నీ బాధ్యత తీరిపోతుంది’ అన్నాడు.

[42] “ఈనాడు నేను బావిదగ్గరికి వచ్చి దేవునితో, ‘యెహోవా, నా యజమాని అబ్రాహాము దేవా, నీవు నా ప్రయాణం సఫలం చేస్తుంటే ఇలా జరగనియ్యి:

[43] ఇదిగో, నేను ఈ నీటిబుగ్గ దగ్గర నిలుచున్నాను. ఒక అమ్మాయి నీళ్ళు చేదుకోవడానికి వచ్చినప్పుడు ఆమె కడవలో నీళ్ళు కొంచెం నన్ను త్రాగనివ్వమని అడుగుతాను’.

[44] ఆమె – ‘మీరు త్రాగండి. మీ ఒంటెలకు కూడా చేది పోస్తాన’ని చెపితే, ‘యెహోవా నా యజమాని కొడుకు కోసం ఎన్నుకొన్నది ఆ అమ్మాయే అయివుండాలి.’

[45] నేనిలా లోలోపల అనుకుంటూండగానే భుజంమీద తన కడవ పెట్టుకొని వస్తున్న రిబ్కా నాకు కనిపించింది. ఆమె బావిలోకి దిగిపోయి నీళ్ళు చేదుకొని వచ్చింది. ‘దయచేసి దాహానికియ్యమ్మా’ అని నేను ఆమె నడిగాను.

[46] ఆమె త్వరపడి భుజంమీది తన కడవ దించి ‘తాగండి. నేను మీ ఒంటెలకు కూడా నీళ్ళుపోస్తాను’ అంది. నేను తాగాను. ఆమె ఒంటెలకు నీళ్ళు పెట్టింది.

[47] అప్పుడు ‘నువ్వెవ్వరి పిల్లవి?’ అని నేను అడిగితే ఆమె ‘బెతూయేల్‌గారి పిల్లను. మా నాన్నగారు నాహోరుగారికి మిల్కా కన్న కుమారుడు’ అంది. కనుక నేనామె ముక్కుకు పుడక, ఆమె చేతులకు గాజులు పెట్టి,

[48] నా తల వంచి యెహోవాను ఆరాధించి నా యజమాని అబ్రాహాము యొక్క దేవుడైన యెహోవాను స్తుతించాను. ఎందుకంటే ఆయన నా యజమాని సోదరుడి పిల్లను ఆయన కుమారుడికోసం తీసుకుపోవడానికి నాకు చక్కగా దారి చూపాడు.

[49] ఇప్పుడు మీరు నా యజమానిపట్ల దయతో, నిజాయితీతో వ్యవహరించ గోరితే అది నాకు చెప్పండి. లేకపోతే అదీ చెప్పండి. అప్పుడు నేనింకా ఏం చెయ్యాలో తెలుస్తుంది.”

[50] అందుకు లాబాను, బెతూయేలు “ఇది యెహోవావల్లే అయింది. మంచిదని గానీ చెడ్డదని గానీ చెప్పడానికి మేమెవరిమి?

[51] ఇదిగో, రిబ్కా మీ ఎదుట ఉంది. ఆమెను తీసుకుపోవచ్చు. యెహోవా సెలవిచ్చినట్టే ఈమె మీ యజమాని కుమారుడికి భార్య అవుతుంది” అని జవాబిచ్చారు.

[52] వాళ్ళు చెప్పినది అబ్రాహాము సేవకుడు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారాలు చేశాడు.

[53] అప్పుడు ఆ సేవకుడు వెండి బంగారాల నగలూ, వస్త్రాలూ తీసి రిబ్కాకిచ్చాడు. ఆమె సోదరుడికీ తల్లికీ కూడా విలువ గల వస్తువులు ఇచ్చాడు.

[54] తరువాత అతడు, అతనితో పాటు వచ్చినవాళ్ళంతా ఆహారం, పానీయం పుచ్చుకొని ఆ రాత్రంతా అక్కడ గడిపారు. ప్రొద్దున అందరూ లేచాక అతడు “నా యజమానిదగ్గరకు నన్ను పంపించండి” అన్నాడు.

[55] రిబ్కా సోదరుడూ, తల్లీ, “ఈమెను కొన్ని రోజులు – కనీసం పది రోజులు – మాదగ్గర ఉండనియ్యి, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చు” అన్నారు.

[56] అందుకతడు “యెహోవా నా ప్రయాణం సఫలం చేశాడు, గనుక నాకు ఆలస్యం కాకుండా నా యజమానిదగ్గరికి వెళ్ళేట్టు నన్ను పంపివేయండి” అన్నాడు.

[57] వారు “అమ్మాయిని పిలిచి, ఆమె ఏమంటుందో చూద్దాం” అన్నారు.

[58] “ఈ మనిషితో పాటు వెళ్తావా”? అని వాళ్ళు రిబ్కాను అడిగినప్పుడు ఆమె “వెళ్తాను” అని జవాబిచ్చింది.

[59] అప్పుడు వాళ్ళు తమ సోదరి రిబ్కానూ ఆమె పరిచారికనూ అబ్రాహాము సేవకుణ్ణీ అతనితో వచ్చినవాళ్ళనూ సాగనంపారు.

[60] రిబ్కాను దీవిస్తూ “మా సోదరీ! నువ్వు వేలాది వేలమందికి తల్లివి అవుతావు గాక! నీ సంతానం తమ పగవాళ్ళ పట్టణాల్ని స్వాధీనం చేసుకుంటారు గాక!” అన్నారు.

[61] రిబ్కా, ఆమె పనికత్తెలు ఒంటెలనెక్కి బయలుదేరి ఆ మనిషి వెంట వెళ్ళారు. అలా ఆ సేవకుడు రిబ్కాను తీసుకొని తన దారి పట్టాడు.

[62] అప్పుడు ఇస్సాకు కనాను దక్షిణ ప్రదేశంలో కాపురముంటూ బేర్‌లహాయిరోయి నుంచి వస్తూ ఉన్నాడు.

[63] సాయంకాలం ఇస్సాకు ధ్యానం చేసుకోవడానికి మైదానంలోకి వెళ్ళాడు. అతడు తలెత్తి చూడగా వస్తూ ఉన్న ఒంటెలు కనబడ్డాయి.

[64] రిబ్కా తలెత్తి ఇస్సాకును చూచినప్పుడు ఒంటెమీదినుంచి దిగి అబ్రాహాము సేవకుణ్ణి ఇలా ప్రశ్నించింది:

[65] “మనల్ని కలుసుకోవడానికి మైదానంలో నడుస్తూ ఉన్న ఆ మనిషి ఎవరు?” అతడు “నా యజమాని” అన్నాడు. కనుక ఆమె ముసుకు వేసుకొంది.

[66] తరువాత ఆ సేవకుడు తాను చేసినదంతా ఇస్సాకుకు వివరించాడు.

[67] ఇస్సాకు తన తల్లి శారా డేరాలోకి రిబ్కాను తీసుకువెళ్ళాడు. ఆమె అతనికి భార్య అయింది. అతడు ఆమెను ప్రేమించాడు. అప్పుడు ఇస్సాకు తన తల్లి మృతి విషయంలో ఆదరణ పొందాడు.

ఆదికాండం (ఆరంభాలు) — Chapters