[1] వారు దేవుని మందసాన్ని తీసుకువచ్చి దానికోసం దావీదు వేసిన డేరాలో ఉంచారు. అప్పుడు వారు దేవుని సన్నిధానంలో హోమ బలులూ శాంతి బలులూ అర్పించారు.
[2] హోమబలులూ శాంతిబలులూ అర్పించిన తరువాత యెహోవా పేర దావీదు ప్రజలను దీవించాడు.
[3] అప్పుడతడు ఇస్రాయేల్ ప్రజలలో ప్రతి పురుషుడికీ ప్రతి స్త్రీకీ ఒక రొట్టెనూ అంజూరుపండ్ల అడ ఒకదానినీ ఎండిన ద్రాక్షపండ్ల అడ ఒకదానినీ ఇచ్చాడు.
[4] తరువాత యెహోవా మందసం ఎదుట సేవ చేయడానికీ ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాను కీర్తించడానికీ స్తుతించడానికీ ఆయనకు కృతజ్ఞత అర్పించడానికీ లేవీగోత్రికులలో కొంతమందిని అతడు నియమించాడు.
[5] వారిలో నాయకుడు ఆసాపు; జెకర్యా రెండోవాడు; తరువాత యెమీయేల్, షెమీరామోతు, యెహీయేల్, మత్తితయా, ఎలీయాబ్, బెనాయా, ఓబేదెదోం, యెమీయేల్. వారు తంతివాద్యాలు వాయించడానికి నియమించబడ్డారు. ఆసాపు తాళాలు వాయించేవాడు.
[6] యాజులు బెనాయా, యహజీయేల్ దేవుని ఒడంబడికపెట్టె ఎదుట క్రమంగా బూరలు ఊదేవారు.
[7] ఆ రోజు దావీదు మొదటిసారిగా యెహోవాను గురించిన ఈ స్తుతి కీర్తన ఆసాపు చేతికీ అతని బంధువుల చేతికీ ఇచ్చాడు:
[8] యెహోవాకు కృతజ్ఞత అర్పించండి. ఆయన పేర ప్రార్థన చేయండి. ఆయన క్రియలను జనాలకు తెలపండి.
[9] ఆయనను ఉద్దేశించి పాటలు పాడండి. స్తుతి గీతాలు చెయ్యండి. ఆయన చేసే అద్భుతాలన్నిటిని గురించీ కబుర్లాడుకోండి.
[10] ఆయన పవిత్రమైన పేర అతిశయించండి. యెహోవాను వెదికేవారి హృదయం ఆనందిస్తుంది.
[11] యెహోవానూ ఆయన బలాన్నీ వెదకండి. ఆయన ముఖ సందర్శనాన్ని ఎప్పటికీ వెదకండి.
[12] ఆయన సేవకుడైన ఇస్రాయేల్ వంశమా! ఆయన ఎన్నుకొన్న యాకోబు పిల్లలారా!
[13] ఆయన చేసిన అద్భుతాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన చేసిన ఆశ్చర్యకరమైన క్రియలు, ఆయన నోటినుంచి వెలువడే న్యాయనిర్ణయాలు జ్ఞాపకం చేసుకోండి.
[14] ఆయన మన దేవుడు యెహోవా. ఆయన తీర్పులు లోకంలో అంతటా జరుగుతున్నాయి.
[15] తాను చెప్పిన మాట వెయ్యి తరాలు ఆయన జ్ఞాపకం ఉంచుకొంటాడు. అబ్రాహాముతో చేసుకొన్న తన ఒడంబడిక,
[16] ఇస్సాకుకు ఆయన చేసిన ప్రమాణం ఆయన ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకొంటాడు.
[17] ఆయన దానిని యాకోబుకు శాసనంగా స్థిరపరచాడు. ఇస్రాయేల్‌కు శాశ్వతమైన ఒప్పందంగా సుస్థిరం చేశాడు.
[18] ఆయన ఇలా మాట ఇచ్చాడు: “కనాను దేశం మీకు వారసత్వంగా ఇస్తాను. అది మీ భాగం”.
[19] అప్పుడు వారిని సులభంగా లెక్కపెట్టవచ్చు. ఆ కొద్దిమంది ఆ దేశంలో పరాయివాళ్ళుగా ఉన్నారు.
[20] దేశం నుంచి దేశానికి తిరుగాడారు వారు. ఒక రాజ్యంనుంచి ఇంకో రాజ్యానికి తిరిగారు.
[21] యెహోవా “నేను అభిషేకించినవారిని మీరు ముట్టకూడదు. నా ప్రవక్తలకు హాని చెయ్యకూడదు” అంటూ
[22] ఎవరినీ వారికి హాని చేయనియ్యలేదు. వారి పక్షాన రాజులను ఆయన హెచ్చరించాడు.
[23] సర్వలోక ప్రజలారా! యెహోవాను సంకీర్తనం చేయండి. ప్రతిరోజూ ఆయన రక్షణను చాటించండి.
[24] ఇతర జనాలలో ఆయన మహిమను తెలియజేయండి. అన్ని దేశాల ప్రజలలో ఆయన అద్భుతాలను వివరించండి.
[25] యెహోవా గొప్పవాడు. ఆయన అత్యంత స్తుతికి యోగ్యుడు. దేవుళ్ళందరికంటే భయభక్తులకు పాత్రుడు.
[26] ఎందుకంటే జనాల దేవుళ్ళంతా విగ్రహాలు మాత్రమే. యెహోవా ఆకాశాలను సృజించాడు.
[27] మహిమ, వైభవం ఆయన సన్నిధానంలో ఉన్నాయి. ఆయన నివాసస్థలంలో బలం, ఆనందం ఉన్నాయి.
[28] జనాంగాల్లారా! యెహోవాకు సమర్పణ చేయండి. మహత్తు, బలం యెహోవాకు ఆరోపించండి.
[29] యెహోవా పేరుకు చెందే మహత్తు ఆయనకు ఆరోపించండి. నైవేద్యం చేతపట్టుకొని ఆయన సన్నిధానంలోకి రండి. పవిత్రత అనే సౌందర్యంతో యెహోవాను ఆరాధించండి.
[30] సర్వలోక ప్రజలారా! ఆయన సమక్షంలో వణకండి. లోకం స్థిరంగా ఉంది. అది కదలదు.
[31] ఇతర జనాలలో ఇలా ప్రకటించండి: “యెహోవా పరిపాలన చేస్తున్నాడు!” ఆకాశాలు ఆనందిస్తాయి గాక! భూమి సంతోషిస్తుంది గాక!
[32] సముద్రం, దానిలో ఉన్నదంతా గోష పెడుతుంది గాక మైదానాలు, వాటిలో ఉన్నదంతా ఆనంద ధ్వనులు చేస్తాయి గాక!
[33] యెహోవా రాబోతున్నాడు. భూమిమీది ప్రజానీకానికి తీర్పు తీర్చడానికి ఆయన వేంచేస్తున్నాడు! అప్పుడు అడవి చెట్లు ఉత్సాహంతో కేకలు వేస్తాయి.
[34] యెహోవా మంచివాడు. ఆయన అనుగ్రహం శాశ్వతంగా నిలుస్తుంది. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోండి.
[35] ఇలా చెప్పండి: “దేవా, మా రక్షకా! మమ్ములను రక్షించు. మేము నీ పవిత్రమైన పేరుకు కృతజ్ఞత అర్పించేలా నిన్ను స్తుతించడంలో మాకు అతిశయం కలిగేలా ఇతర జనాల మధ్య నుంచి మమ్ములను విడిపించి సమకూర్చు.”
[36] ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాకు శాశ్వతంగా స్తుతి! అప్పుడు ప్రజలంతా “తథాస్తు” అని చెప్పి యెహోవాను స్తుతించారు.
[37] యెహోవా ఒడంబడిక పెట్టె ఎదుట ప్రతిరోజూ జరగవలసిన సేవ క్రమంగా చేయడానికి అక్కడ పెట్టె ఎదుటే దావీదు ఆసాపునూ అతని బంధువులనూ ఉంచాడు.
[38] ఓబేదెదోంనూ అతని అరవై ఎనిమిదిమంది బంధువులనూ కూడా అక్కడ ఉంచాడు. యెదూతూను కొడుకు ఓబేదెదోం, హోసా అనేవారు ద్వారపాలకులు.
[39] దావీదు యాజి అయిన సాదోకునూ అతని సాటి యాజులనూ గిబియోనులో ఎత్తయిన స్థలంమీద ఉన్న యెహోవా గుడారం దగ్గర ఉంచాడు.
[40] యెహోవా ఇస్రాయేల్ ప్రజలకు ఆదేశించిన ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాసి ఉన్నట్టు, ప్రతి రోజూ ఉదయం, సాయంకాలం క్రమంగా హోమ బలిపీఠం మీద హోమాలు యెహోవాకు అర్పించడానికి దావీదు వారిని నియమించాడు.
[41] “యెహోవా అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది” అంటూ ఆయనకు కృతజ్ఞతలు అర్పించడానికి వారితోకూడా అతడు హేమానునూ యెదూతూనునూ పేర్లు చెప్పి ఎన్నుకొన్న ఇంకా కొంతమందినీ నియమించాడు.
[42] బూరలు ఊదడానికీ తాళాలునూ దేవుని పాటలతో ఇతర వాద్యాలనూ వాయించడానికీ హేమానునూ యెదూతూనునూ నియమించాడు. యెదూతూను కొడుకులను ద్వారపాలకులుగా అతడు నియమించాడు.
[43] ఆ తరువాత ప్రజలంతా ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. దావీదు తన ఇంటివారిని దీవించడానికి వారిదగ్గరికి వెళ్ళాడు.