Skip to content
Opens in a new window

[1] దావీదు వెయ్యిమందికీ వందమందికీ అధిపతులుగా ఉన్నవారందరితో ఆలోచన చేసిన తరువాత

[2] అక్కడ సమకూడిన ఇస్రాయేల్‌వారందరితో ఇలా అన్నాడు: “మీకు ఇష్టమైతే, మన దేవుడు యెహోవా చిత్తమైతే ఇస్రాయేల్ దేశంలో అంతటా మిగిలిన మన బంధువులంతా వచ్చి మనతో కలుసుకొనేలా వారికి కబురు పంపుదాం. తమ పట్టణాలలో, వాటి పరిసరాలలో కాపురముంటున్న యాజులూ లేవీగోత్రికులూ కూడా రావాలని కబురు పంపుదాం.

[3] మన దేవుని మందసాన్ని మళ్ళీ తీసుకువచ్చి మన దగ్గర ఉంచుదాం. సౌలు రోజులలో దాని విషయం మనం నిర్లక్ష్యంగా ఉన్నాం.”

[4] ఈ మాట సమకూడినవారందరికీ సమంజసమనిపించింది గనుక ప్రజలంతా అలా చేయడానికి సమ్మతించారు.

[5] అప్పుడు దేవుని మందసాన్ని కిర్యత్‌యారీంనుంచి తీసుకురావడానికి దావీదు ఈజిప్ట్‌లో ఉన్న షీహోరు నది నుంచి హమాతుకు పోయే దారి వరకు ఉన్న ఇస్రాయేల్ వారందరినీ సమకూర్చాడు.

[6] కెరూబులమధ్య ఆసీనుడైన యెహోవాదేవుని పేరు ఉన్న ఆయన మందసాన్ని బయలా (కిర్యత్‌యారీం) నుంచి తీసుకురావడానికి అతడూ ఇస్రాయేల్ వారంతా అక్కడికి వెళ్ళారు.

[7] వారు దేవుని మందసాన్ని కొత్త బండిమీద ఎక్కించి అబీనాదాబు ఇంటినుంచి బయలుదేరారు. ఉజ్జా, అహియో బండిని తోలుతూ ఉన్నారు.

[8] దావీదు, ఇస్రాయేల్ వారంతా తమ శక్తి అంతటితో పాటలు పాడుతూ, తంతివాద్యాలనూ కంజరీలనూ తాళాలనూ వాయిస్తూ, బూరలు ఊదుతూ, దేవుని సన్నిధానంలో సంబరపడుతూ ఉన్నారు.

[9] కీదోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎద్దులకు కాలు జారింది. వెంటనే ఉజ్జా ఆ మందసాన్ని పట్టుకోవడానికి చెయ్యి చాపాడు.

[10] అతడు మందసం మీద చెయ్యి ఉంచినందుచేత యెహోవా ఉజ్జామీద తీవ్రంగా కోపగించుకొని అతణ్ణి మొత్తాడు. అతడు అక్కడే దేవుని సన్నిధానంలో చనిపోయాడు.

[11] యెహోవా ఉజ్జాను నాశనం చేసినందుకు దావీదు పరితపించి ఆ స్థలానికి పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. ఈ రోజువరకు దానికి అదే పేరు.

[12] ఆ రోజు దావీదు దేవునికి భయపడి “దేవుని మందసాన్ని నా దగ్గరికి ఏవిధంగా తెప్పిస్తాను?” అనుకొన్నాడు.

[13] తన దగ్గర ఉండడానికి ఆ మందసాన్ని అతడు దావీదు నగరానికి తీసుకుపోలేదు. దానికి బదులుగా అతడు దారి ప్రక్కన గాతువాడైన ఓబేదెదోం ఇంటికి దానిని తీసుకుపోయాడు.

[14] దేవుని మందసం ఓబేదెదోం ఇంటిలో అతడి కుటుంబం దగ్గర మూడు నెలలు ఉండిపోయింది. యెహోవా అతడి ఇంటివారినీ అతడి ఆస్తి అంతటినీ దీవించాడు.

1 దినవృత్తాంతాలు — Chapters