[1] దావీదు తనకోసం కట్టడాలను దావీదునగరంలో కట్టించుకొన్నాడు. దేవుని మందసానికి ఒక స్థలం సిద్ధపరచి దానిమీద గుడారం వేయించాడు.
[2] అప్పుడు దావీదు “దేవుని మందసాన్ని మోయడానికీ నిత్యంగా తనకు సేవ చేయడానికీ యెహోవా లేవీగోత్రికులను ఎన్నుకొన్నాడు. వారు తప్ప ఇంకెవరూ దేవుని మందసాన్ని మోయకూడదు” అన్నాడు.
[3] యెహోవా మందసంకోసం తాను సిద్ధపరచిన స్థలానికి దానిని తీసుకురావడానికి దావీదు ఇస్రాయేల్ వారందరినీ జెరుసలంలో సమకూర్చాడు.
[4] అప్పుడు అహరోను సంతతివారిలో, లేవీగోత్రికులలో కొంతమందిని పిలిపించాడు.
[5] వారెవరంటే, కహాతు వంశంవారిలో నాయకుడైన ఊరీయేల్, అతని బంధువులు నూట ఇరవై మంది;
[6] మెరారి వంశంవారిలో నాయకుడైన అశాయా, అతని బంధువులు రెండు వందల ఇరవైమంది;
[7] గెర్షోను వంశంలో నాయకుడైన యోవేల్, అతని బంధువులు నూట ముప్ఫయిమంది;
[8] ఎలీజాపాను వంశంలో నాయకుడైన షెమయా, అతని బంధువులు రెండు వందలమంది;
[9] హెబ్రోను వంశంలో నాయకుడైన ఎలీయేల్, అతని బంధువులు ఎనభైమంది;
[10] ఉజ్జీయేల్ వంశంలో నాయకుడైన అమ్మినాదాబ్, అతని బంధువులు నూట పన్నెండు మంది.
[11] అప్పుడు దావీదు యాజులైన సాదోకునూ అబియాతారునూ లేవీగోత్రికులైన ఊరియేల్‌నూ అశాయానూ యోనేల్‌నూ షెమయానూ ఎలీయేల్‌నూ అమ్మీనాదాబ్‌నూ పిలిపించి వారితో ఇలా అన్నాడు:
[12] “మీరు లేవీ కుటుంబాల నాయకులు. ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవా మందసం కోసం నేను సిద్ధపరచిన స్థలానికి దానిని తీసుకురావడానికి మీరు మిమ్ములనూ మీ బంధువులనూ ప్రతిష్ఠించుకోండి.
[13] ఆ మొదటిసారి మీరు దానిని మోయలేదు. గనుకనే మన దేవుడు యెహోవా మనలో నాశనం కలిగించాడు. అప్పుడు ఆయన నియమం ప్రకారం ఆయనను మనం వెదకలేదు.”
[14] అందుచేత ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా మందసాన్ని తేవడానికి యాజులూ లేవీగోత్రికులూ తమను ప్రతిష్ఠించుకొన్నారు.
[15] యెహోవా పలికిన వాక్కు ప్రకారం మోషే ఆదేశించినట్టే లేవీగోత్రికులు దేవుని మందసం కర్రలను తమ భుజాల మీదికి ఎక్కించుకొని దానిని మోశారు.
[16] దావీదు “మీ బంధువులైన పాటకులు తంతి వాద్యాలనూ తాళాలనూ ఇతర వాద్యాలనూ వాయిస్తూ, సంతోషంతో స్వరమెత్తి పాటలు పాడేలా ఏర్పాటు చేయండి” అని లేవీగోత్రికుల నాయకులతో చెప్పాడు.
[17] లేవీగోత్రికులు దానికి నియమించినవారెవరంటే, యోవేల్ కొడుకు హేమాను; హేమాను తోబుట్టువులలో బెరెకయా కొడుకు ఆసాపు; వారి బంధువులైన మెరారి వంశంవారిలో కూషాయాహు కొడుకు ఏతాను;
[18] వారితోకూడా రెండో హోదాలో ఉన్న వారి బంధువులు జెకర్యా, బేను, యహజీయేల్, షెమీరామోతు, యెహీయేల్, ఊనీ, ఏలీయాబ్, బెనాయా, మయశేయా, మత్తితయా, ఎలీపలేహు, మికనేయాహు; ద్వారపాలకులు ఓబేదెదోం, యెహీయేల్.
[19] కంచు తాళాలను వాయించడానికి పాటకులైన హేమానునూ ఆసాపునూ ఏతానునూ వారు నియమించారు.
[20] హెచ్చు స్వరంగల తంతివాద్యాలు వాయించడానికి జెకర్యానూ అజీయేల్‌నూ షెమీరామోతునూ యెహీయేల్‌నూ ఊనినీ ఏలీయాబ్‌నూ మయశేయానూ బెనాయాను నియమించారు.
[21] రాగమెత్తి సితారాలు వాయించడానికి మత్తితయానా ఎలీపలేహునూ మికనేయాహునూ ఓబేదెదోంనూ యెహీయేల్‌నూ అజజయానూ నియమించారు.
[22] లేవీగోత్రికుల నాయకుడైన కెననయా సంగీతంలో పాటకులను నడిపించడంలో ప్రవీణుడు గనుక ఆ పనికి అతణ్ణి నియమించారు.
[23] దేవుని మందసానికి కాపలాదారులుగా బెకెరయాను ఎల్కానానూ నియమించారు.
[24] దేవుని మందసానికి ముందు బూరలు ఊదడానికి షెబనయా, యెహోషాపాతు, నెతనేల్, అమాశయి, జెకర్యా, బెనాయా, ఎలియాజరు అనే యాజులను నియమించారు. దేవుని మందసానికి కాపలాదారులుగా ఓబేదెదోంనూ యెహీయానూ కూడా నియమించారు.
[25] యెహోవా మందసాన్ని ఓబేదెదోం ఇంటినుంచి తేవడానికి దావీదు, ఇస్రాయేల్ ప్రజల పెద్దలు సహస్రాధిపతులు సంతోషంతో వెళ్ళారు.
[26] యెహోవా ఒడంబడిక పెట్టెను మోసిన లేవీగోత్రికులకు దేవుడు సహాయం చేశాడు గనుక వారు ఏడు ఎద్దులనూ ఏడు పొట్టేళ్ళనూ బలిగా అర్పించారు.
[27] దావీదు, మందసాన్ని మోసిన లేవీగోత్రికులందరూ, గాయకులు, సంగీత నాయకుడైన కెననయా సన్నని నూలుతో నేయబడ్డ వస్త్రాలు ధరించినవారు. సన్నని నారతో నేసిన ఏఫోదు దావీదు తొడుక్కొన్నాడు.
[28] ఇస్రాయేల్ వారంతా ఆనందధ్వనులు చేస్తూ పొట్టేలు కొమ్ములూ బూరలూ ఊదుతూ, తాళాలూ తంతివాద్యాలూ స్వరమండలాలూ వాయిస్తూ, యెహోవా మందసాన్ని తీసుకువచ్చారు.
[29] యెహోవా మందసం దావీదు నగరంలోకి వస్తూ ఉన్నప్పుడు సౌలు కూతురు మీకాల్ కిటికీలోనుంచి చూస్తూ ఉంది. యెహోవా సన్నిధానంలో దావీదు నాట్యం చేస్తూ, సంబరపడుతూ ఉండడం ఆమె చూచి అతణ్ణి తృణీకరించింది.