[1] యేసు కొండదిగి రాగా, ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు.
[2] కుష్టురోగంతో ఉన్న వాడొకడు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మీరు తలచుకొంటే నన్ను బాగుచెయ్యగలరు” అని అన్నాడు.
[3] యేసు తన చేయి చాపి అతణ్ణి తాకుతూ, “నీకు బాగు కావాలని కోరుతున్నాను, స్వస్థుడవుకమ్ము!” అని అన్నాడు. వెంటనే అతనికి నయమైపోయింది.
[4] అప్పుడు యేసు అతనితో, “ఈ సంఘటనను గురించి ఎవ్వరికీ చెప్పకు. కాని యాజకుని దగ్గరకు వెళ్ళి నీ దేహాన్ని చూపి, మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు. తద్వారా నీకు నయమైనట్లు వాళ్ళకు రుజువౌతుంది” అని అన్నాడు.
[5] యేసు కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాక శతాధిపతి ఒకడు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన సహాయం కావాలని కోరుతూ,
[6] “ప్రభూ! నా సేవకుడు పక్షవాతం వచ్చి యింట్లో పడుకొని ఉన్నాడు. వానికి చాలా బాధ కలుగుతోంది” అని అన్నాడు.
[7] యేసు, “నేను వచ్చి నయం చేస్తాను” అని అన్నాడు.
[8] కాని శతాధిపతి సమాధానంగా, “ప్రభూ! మీరు మా యింటి గడపలో కాలు పెట్టటానికి కూడా నేను అర్హుడను కాను. కాని మీరు మాటంటే చాలు, నా సేవకునికి నయమైపోతుంది.
[9] ఎందుకంటే, నేను కూడా అధికారుల క్రింద ఉన్నవాణ్ణి. నా క్రింద కూడా సైనికులున్నారు. నేను ఈ సైనికునితో ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు; ఆ సైనికునితో ‘రా’ అంటే వస్తాడు. నా సేవకునితో ‘ఇది చేయి’ అంటే చేస్తాడు” అని అన్నాడు.
[10] యేసు ఇది విని ఆశ్చర్యపొయ్యాడు. ఆయన తన వెంట వస్తున్న వాళ్ళతో, “ఇది సత్యం. ఇంత గొప్ప విశ్వాసమున్న వ్యక్తి నాకు ఇశ్రాయేలీయులలో ఎవ్వరూ కనిపించలేదు.
[11] నేను చెప్పెదేమిటంటే, తూర్పునుండి, పడమరనుండి, చాలామంది ప్రజలు వస్తారు. వచ్చి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొంటారు.
[12] కాని దేవుడు తన రాజ్యానికి తమ పుట్టుకవల్ల వారసులైన వాళ్ళను అవతల దూరంగా చీకట్లో పారవేస్తాడు. అక్కడ వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు.”
[13] ఇలా అని, యేసు శతాధిపతితో, “వెళ్ళు! నీవు విశ్వసించినట్లే జరుగుతుంది” అని అన్నాడు. అదే క్షణంలో అతని సేవకునికి నయమైపోయింది.
[14] యేసు పేతురు యింటికి వచ్చి పేతురు అత్త జ్వరంతో మంచం పట్టి ఉండటం చూసాడు.
[15] ఆయన ఆమె చేతిని తాకగానే, జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. ఆమె లేచి ఆయనకు సపర్యలు చెయ్యటం మొదలుపెట్టింది.
[16] ప్రజలు సాయంత్రం కాగానే, దయ్యాలు పట్టిన వాళ్ళను చాలా మందిని యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. ఆయన ఒక మాటతో దయ్యాల్ని వదిలించాడు. రోగాలున్న వాళ్ళందరికి నయం చేసాడు.
[17] యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ మాటలు నిజం కావటానికి ఇలా జరిగింది: “మన రోగాల్ని ఆయన తనపై వేసుకొన్నాడు. మన బాధల్ని ఆయన అనుభవించాడు.”
[18] యేసు తన చుట్టూ ఉన్న ప్రజల గుంపును చూసి, తన శిష్యులతో సరస్సు అవతలి వైపుకు వెళ్ళండని అన్నాడు.
[19] అప్పుడు శాస్త్రుడొకడు ఆయన దగ్గరకు వచ్చి, “బోధకుడా! మీరెక్కడికి వేళ్తే నేనక్కడికి వస్తాను” అని అన్నాడు.
[20] యేసు, “నక్కలు దాక్కోవటానికి బిలములున్నాయి. గాలిలో ఎగిరే పక్షులు ఉండటానికి గూళ్ళున్నాయి. కాని మనుష్యకుమారుడు తల వాల్చటానికి కూడ స్థలం లేదు” అని అతనితో అన్నాడు.
[21] మరొక శిష్యుడు, “ప్రభూ! మొదట నా తండ్రిని సమాధి చేసుకోనివ్వండి” అని అన్నాడు.
[22] యేసు అతనితో, “చనిపోయిన తమ వాళ్ళను చనిపోయే వాళ్ళు సమాధి చేసుకోనిమ్ము! నీవు నన్ను అనుసరించు!” అని అన్నాడు.
[23] యేసు పడవనెక్కాడు. ఆయన శిష్యులు ఆయన్ని అనుసరించారు.
[24] అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను ఆ సరస్సు మీదికి రావటం వల్ల ఆ పడవ అలల్లో చిక్కుకు పోయింది. ఆసమయంలో యేసు నిద్రపోతూ ఉన్నాడు.
[25] శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని నిద్రలేపుతూ, “ప్రభూ! రక్షించండి. మునిగిపోతున్నాము!” అని అన్నారు.
[26] యేసు, “మీ విశ్వాసం ఏమైంది? ఎందుకు భయపడుతున్నారు?” అని అంటూ లేచి గాలిని, అలల్ని శాంతించమని ఆజ్ఞాపించాడు. అవి శాంతించాయి.
[27] వాళ్ళు ఆశ్చర్యపడి, “ఈయనేలాంటి వాడు? గాలి, అలలు కూడా ఈయన మాట వింటున్నాయే!” అని అన్నారు.
[28] యేసు, సరస్సు ఆవలి పైపుననున్న గదరేనీయుల ప్రాంతాన్ని చేరుకున్నాడు. దయ్యాలు పట్టిన మనుష్యులిద్దరు స్మశానం నుండి వచ్చి ఆయన్ని కలుసుకొన్నారు. వీళ్ళ క్రూర ప్రవర్తన వల్ల ఆ దారిమీద ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కారు.
[29] అవి, “దేవుని కుమారుడా! మాకేం చెయ్యాలని వచ్చావు తగిన సమయం రాకముందే మమ్మల్ని శిక్షించాలని యిక్కడికి వచ్చారా?” అని బిగ్గరగా అన్నాయి.
[30] వాళ్ళకు కొంత దూరంలో ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది.
[31] ఆ దయ్యాలు యేసుతో, “మీరు మమ్మల్ని వెళ్ళగొట్టాలని అనుకొంటే ఆ పందుల గుంపులోకి పంపండి” అని ప్రాధేయపడ్డాయి.
[32] ఆయన వాటితో, “వెళ్ళండి!” అని అన్నాడు. అందువల్ల అవి వెలుపలికి వచ్చి ఆ పందుల్లోకి ప్రవేశించాయి. ఆ పందుల గుంపంతా నిటారుగా ఉన్న కొండ మీదనుండి జారి సరస్సులో పడి చనిపొయ్యాయి.
[33] ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు అక్కడి నుండి పరుగెత్తి గ్రామంలోకి వెళ్ళి జరిగిందంతా, అంటే ఆ దయ్యం పట్టిన వాళ్ళకేమైందో అంతా చెప్పారు.
[34] ఇది విని ఆ గ్రామమంతా యేసును కలవటానికి వచ్చింది. వాళ్ళాయన్ని చూసాక తమ పరిసరాల్ని వదిలి వెళ్ళమని ఆయనను ప్రాధేయపడ్డారు.