[1] ఒకప్పుడు ఒక విశ్రాంతి రోజున యేసు, తన శిష్యులతో కలిసి పొలాల్లో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆకలితో ఉండటం వల్ల కంకులు నలిపి తినటం మొదలు పెట్టారు.
[2] పరిసయ్యులు ఇది చూసి యేసుతో, “విశ్రాంతి రోజు మీ శిష్యులు చెయ్యరాని పని చేస్తున్నారు” అని అన్నారు.
[3] యేసు, “దావీదుకు, అతని అనుచరులకు ఆకలివేసినప్పుడు అతడు దేవాలయంలోకి ప్రవేశించారు. తర్వాత అతడు, అతని అనుచరులు దేవుని సన్నిధిలో పెట్టిన రొట్టెలు తిన్నారు. ఈ విషయాన్ని మీరు చదువలేదా? యాజకులకు తప్ప దావీదుకు కాని, అతని అనుచరులకు కాని, మరెవ్వరికి ఆ రొట్టెను తినే అధికారం లేదు.
[5] అంతేకాక, యాజకులు విశ్రాంతి రోజు పని చేస్తారన్న విషయం ధర్మశాస్త్రంలో ఉంది. ఇది మీరు చదువలేదా? వాళ్ళు అలా చెయ్యటం తప్పుకాదు.
[6] నేను చెప్పేదేమిటంటే మందిరం కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు.
[7] ‘నాకు దయకావాలి, బలికాదు’ అన్న వాక్యంలోని అర్థం మీకు తెలిసివుంటే మీరు అమాయకుల్ని అవమానించే వాళ్ళు కాదు.
[8] “విశ్రాంతి రోజుకు మనుష్యకుమారుడు ప్రభువు” అని అన్నాడు.
[9] ఆయన అక్కడి నుండి బయలుదేరి సమాజ మందిరానికి వెళ్ళాడు.
[10] అక్కడ ఎండి పోయిన చేయిగలవాడొకడున్నాడు. యేసుపై నేరారోపణ చెయ్యాలని ఎదురుచూస్తున్న పరిసయ్యులు, ఆయన్ని, “విశ్రాంతి రోజు నయం చెయ్యటం ధర్మమా?” అని అడిగారు.
[11] ఆయన వాళ్ళతో, “మీలో ఎవరి దగ్గరైనా ఒక గొఱ్ఱె ఉందనుకొండి. విశ్రాంతి రోజు అది గోతిలో పడితే దాన్ని పట్టి మీరు బయటికి లాగరా?
[12] మరి మానవుడు గొఱ్ఱెలకన్నా ఎన్నోరెట్లు విలువైన వాడు కదా! అందువల్ల విశ్రాంతిరోజు మంచి చెయ్యటం ధర్మమే!” అని అన్నాడు.
[13] అలా అన్నాక ఆ ఎండిపోయిన చెయ్యిగల వానితో, “నీ చేయి చాపు!” అని అన్నాడు. అతడు చేయి చాపాడు. చేయి పూర్తిగా నయమై రెండవ చెయ్యిలా అయింది.
[14] కాని పరిసయ్యులు బయటికి వెళ్ళి, యేసును చంపటానికి పన్నాగం పన్నారు.
[15] యేసు ఇది తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళ వ్యాధుల్ని నయం చేసాడు.
[16] తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు.
[17] యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఈ విధంగా జరిగింది:
[18] “ఆయన నేనెన్నుకున్న నా సేవకుడు! ఆయన పట్ల నాకు ప్రేమవుంది. ఆయన నా ఆత్మకు చాలా ఆనందం కలిగించాడు. నా ఆత్మ ఆయన పైకి రప్పించుదును. ఆయన జనములకు న్యాయం చేకూరుతుందని ప్రకటిస్తాడు.
[19] ఆయన పోట్లాడడు: కేకలు పెట్టడు, ఆయన ధ్వని వీధిలోని వాళ్ళకెవ్వరికి వినిపించదు.
[20] న్యాయం చేకూరే వరకు నలిగిన రెల్లును ఆయన విరువడు. ఆరిపోతున్న దీపాన్ని ఆయన ఆర్పడు.
[21] ఈయన పేరుమీద ఇతర జనాలకు నిరీక్షణ కలుగుతుంది.”
[22] ఆ తర్వాత కొందరు, దయ్యంపట్టి గ్రుడ్డివానిగా, మూగవానిగా అయిపోయిన ఒకతణ్ణి యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. యేసు అతనికి నయం చేసాడు. దానితో ఆ మూగ వానికి మాట, దృష్టి రెండూ వచ్చాయి.
[23] ప్రజలందరికి ఆశ్చర్యమేసి, “ఈయన బహుశా దావీదు కుమారుడేమో!” అని అన్నారు.
[24] పరిసయ్యులు ఇది విని, “దయ్యాల రాజైన బయెల్జెబూలు సహాయంతో యితడు దయ్యాలను వదిలిస్తున్నాడు. అంతే!” అని అన్నారు.
[25] వాళ్ళ ఆలోచనలను యేసు తెలుసుకొన్నాడు. వాళ్ళతో, “విభాగాలైన ప్రతి రాజ్యం నశించి పోతుంది. విభాగాలైన ప్రతి పట్టణమూ, ప్రతి యిల్లు కూలిపోతుంది.
[26] సైతాను సైతాన్ని పారద్రోలితే వాడు విడిపోతాడు. అప్పుడు వాని రాజ్యం ఏవిధంగా నిలుస్తుంది?
[27] నేను బయెల్జెబూలు ద్వారా దయ్యాన్ని పారద్రోలుతున్నట్లైతే మీ కుమారులు ఎవరి ద్వారా పారద్రోలుతున్నారు? మీరంటున్నది తప్పని మీ వాళ్ళే ఋజువు చేస్తున్నారు.
[28] ఒకవేళ నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాల్ని పారద్రోలుతున్నట్లైతే దేవుని రాజ్యం మీకు వచ్చినట్లేగదా!
[29] అంతేకాక మొదట బలవంతుణ్ణి కట్టి వేయకుండా అతని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఆ బలవంతుణ్ణి కట్టివేసాక అతని యింటిని దోచుకోగలరు.
[30] నాతో ఉండని వాడు నాకు శత్రువుగా ఉంటాడు. నాతో కలసిమెలసి ఉండనివాడు చెదరిపోతాడు.
[31] “అందువలన నేను చెప్పేదేమిటంటే మానవుడు చేసిన పాపాలన్నిటిని దేవదూషణను దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషించిన వాళ్ళను క్షమించడు.
[32] మనుష్యకుమారుణ్ణి దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి ఈయుగంలో కాని, లేక రానున్న యుగంలో కాని క్షమించడు.
[33] “మీరు మంచిఫలాలు కావాలనుకుంటే, చెట్టును మంచిగా చేయాలి. నీ చెట్టు మంచిది కాకపోతే దానికి చెడ్డ ఫలాలు కాస్తాయి. పండును బట్టి చెట్టు ఎట్టిదో చెప్పబడుతుంది.
[34] మీరు పాముల్లాంటి వాళ్ళు. దుష్టులు మంచి మాటలేవిధంగా ఆడగలుగుతారు. హృదయంలో ఉన్నదాన్ని నోరు మాట్లాడుతుంది.
[35] మంచివానిలో మంచి ఉంటుంది. కనుక అతని నుండి మంచి బయటికి వస్తుంది. దుష్టునిలో చెడు ఉంటుంది కనుక అతని నుండి చెడు బయటికి వస్తుంది.
[36] కాని నేను చెప్పేదేమిటంటే మానవులు తాము నిర్లక్ష్యంగా ఆడిన ప్రతి మాటకు తీర్పు చెప్పే రోజున లెక్క చెప్పవలసి ఉంటుంది.
[37] ఎందుకంటే మీరాడిన మాటల్ని బట్టి మీరు నిరపరాధులో, అపరాధులో నిర్ణయింపబడుతుంది” అని అన్నాడు.
[38] ఆ తర్వాత కొందరు శాస్త్రులు, పరిసయ్యులు ఆయనతో, “బోధకుడా! మీరొక రుజువు చూపాలని మా కోరిక!” అని అన్నారు.
[39] కాని ఆయన చెప్పాడు: “దుష్టులు, వ్యభిచారులు అయినటువంటి ఈ తరంవాళ్ళు రుజువు చూపమని కోరుతారు. యోనా ప్రవక్త ద్వారా చూపిన రుజువు తప్ప మరే రుజువు చూపబడదు.
[40] ఎందుకంటే, యోనా పెద్ద చేప కడుపులో మూడు పగళ్ళు, మూడు రాత్రులు గడిపాడు. అదే విధంగా మనుష్యకుమారుడు మూడు రాత్రులు, మూడు పగళ్ళు భూగర్భంలో గడుపుతాడు.
[41] నీనెవె ప్రజలు యోనా ప్రకటించిన సందేశాన్ని విని మారు మనస్సు పొందారు. కనుక తీర్పు చెప్పబడే రోజు వాళ్ళు ఈ తరం వాళ్ళతో సహా నిలబడి ఈతరం వాళ్ళు నేరస్థులని నిర్ణయిస్తారు. కాని యిప్పుడు యోనా కంటె గొప్పవాడు యిక్కడున్నాడు.
[42] “దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినాలని చాలా దూరం నుండి వచ్చింది. కనుక తీర్పు చెప్పే రోజు ఆమె ఈ తరం వాళ్ళతో కలసి నిలబడి ఈ తరం వాళ్ళు నేరస్థులని నిర్ణయిస్తుంది. కాని యిప్పుడు సొలొమోను కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు.
[43] “దయ్యం పట్టిన వాని నుండి బయటికి వచ్చిన దయ్యం విశ్రాంతి కోసం వెతుకుతూ నీరులేని చోట తిరుగుతుంది. కాని దానికి విశ్రాంతి దొరకదు.
[44] అప్పుడది, ‘నేను వదిలి వచ్చిన నాయింటికి మళ్ళీ వెళ్తాను’ అని అనుకొంటుంది. అది తిరిగి వచ్చి, ఆయింటిని ఎవ్వరూ ఆక్రమించనట్లు, పైగా శుభ్రంగా వూడ్చి అన్నీ సరిదిద్దినట్లు గమనిస్తుంది.
[45] అప్పుడది వెళ్ళి తనతో సహా, తనకన్నా దుష్టమైన ఏడు దయ్యాల్ని పిలుచుకు వస్తుంది. అన్నీ కలసి ఆ యింటిలోకి వెళ్ళి నివశిస్తాయి. అప్పుడా వ్యక్తి గతి మొదటికన్నా అధ్వాన్నం ఔతుంది. దుర్బుద్ధిగల ఈ తరం వాళ్ళకు ఇలాంటి గతి పడ్తుంది” అని చెప్పాడు.
[46] యేసు ప్రజలతో యింకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంతలో ఆయన తల్లి, సోదరులు ఆయనతో మాట్లాడాలనుకొని వచ్చి, బయట నిలబడ్డారు.
[47] ఒకడు యేసుతో, “మీ తల్లి, సోదరులు మీతో మాట్లాడాలని బయట నిలుచొన్నారు!” అని అన్నాడు.
[48] యేసు సమాధానం చెబుతూ, “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అని అన్నాడు.
[49] తన శిష్యుల వైపు చూపుతూ, “ఇదిగో నా తల్లి, నా సోదరులు.
[50] ఎవరైతే పరలోకంలోని నా తండ్రి యిచ్చానుసారం నడుచుకొంటారో వాళ్ళే నా సోదరులు, నా చెల్లెండ్రు, నా తల్లి” అని అన్నాడు.