Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:45

[1] యేసు క్రీస్తు వంశక్రమము: ఈయన దావీదు మరియు అబ్రాహాము వంశానికి చెందినవాడు.

[2] అబ్రాహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు యాకోబు కుమారులు యూదా మరియు అతని సహోదరులు.

[3] యూదా కుమారులు పెరెసు మరియు జెరహు. (పెరెసు, జెరహుల తల్లి తామారు.) పెరెసు కుమారుడు ఎస్రోము ఎస్రోము కుమారుడు అరాము

[4] అరాము కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మా

[5] శల్మా కుమారుడు బోయజు. (బోయజు తల్లి రాహాబు.) బోయజు కుమారుడు ఓబేదు. (ఓబేదు తల్లి రూతు.) ఓబేదు కుమారుడు యెష్షయి.

[6] యెష్షయి కుమారుడు రాజు దావీదు. దావీదు కుమారుడు సొలొమోను. (సొలొమోను తల్లి పూర్వం ఊరియా భార్య.)

[7] సొలొమోను కుమారుడు రెహబాము. రెహబాము కుమారుడు అబీయా. అబీయా కుమారుడు ఆసా.

[8] ఆసా కుమారుడు యెహోషాపాతు. యెహోషాపాతు కుమారుడు యెహోరాము. యెహోరాము కుమారుడు ఉజ్జియా.

[9] ఉజ్జియా కుమారుడు యోతాము. యోతాము కుమారుడు ఆహాజు. ఆహాజు కుమారుడు హిజ్కియా.

[10] హిజ్కియా కుమారుడు మనష్షే. మనష్షే కుమారుడు ఆమోసు. ఆమోసు కుమారుడు యోషీయా.

[11] యోషీయా కుమారులు యెకొన్యా మరియు అతని సోదరులు. వీళ్ళ కాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడినారు.

[12] బబులోను నగరానికి కొనిపోబడిన తరువాతి వంశ క్రమము: యెకొన్యా కుమారుడు షయల్తీయేలు. షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు.

[13] జెరుబ్బాబెలు కుమారుడు అబీహూదు. అబీహూదు కుమారుడు ఎల్యాకీము. ఎల్యాకీము కుమారుడు అజోరు.

[14] అజోరు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు ఆకీము. ఆకీము కుమారుడు ఎలీహూదు.

[15] ఎలీహూదు కుమారుడు ఎలియాజరు. ఎలియాజరు కుమారుడు మత్తాను. మత్తాను కుమారుడు యాకోబు.

[16] యాకోబు కుమారుడు యోసేపు. యోసేపు భార్య మరియ. మరియ కుమారుడు యేసు. ఈయన్ని క్రీస్తు అంటారు.

[17] అంటే అబ్రాహాము కాలం నుండి దావీదు కాలం వరకు మొత్తం పదునాలుగు తరాలు. దావీదు కాలం నుండి బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడిన కాలం వరకు పదునాలుగు తరాలు. అలా కొనిపోబడిన కాలం నుండి క్రీస్తు వరకు పదునాలుగు తరాలు.

[18] యేసు క్రీస్తు జననం ఇలా సంభవించింది: యేసు క్రీస్తు తల్లి మరియకు, యోసేపు అనే వ్యక్తికి వివాహం నిశ్చయమై ఉంది. వివాహంకాకముందే పవిత్రాత్మ శక్తి ద్వారా మరియ గర్భవతి అయింది.

[19] కాని ఆమె భర్త యోసేపు నీతిమంతుడు. అందువల్ల అతడు అమెను నలుగురిలో అవమాన పరచదలచుకోలేదు. ఆమెతో రహస్యంగా తెగతెంపులు చేసుకోవాలని మనస్సులో అనుకొన్నాడు.

[20] అతడీవిధంగా అనుకొన్న తర్వాత, దేవదూత అతనికి కలలో కనిపించి, “యోసేపూ, దావీదు కుమారుడా, మరియ పవిత్రాత్మ ద్వారా గర్భవతి అయింది. కనుక ఆమెను భార్యగా స్వీకరించటానికి భయపడకు.

[21] ఆమె ఒక మగ శిశువును ప్రసవిస్తుంది. ఆయన తన ప్రజల్ని వాళ్ళు చేసిన పాపాలనుండి రక్షిస్తాడు. కనుక ఆయనకు ‘యేసు’ అని పేరు పెట్టు” అని అన్నాడు.

[22] ప్రవక్త ద్వారా ప్రభువు ఈ విధంగా చెప్పాడు: “కన్యక గర్భవతియై మగ శిశువును ప్రసవిస్తుంది. వాళ్ళాయనను ఇమ్మానుయేలు అని పిలుస్తారు” ఇది నిజం కావటానికే ఇలా జరిగింది.

[24] యోసేపు నిద్రలేచి దేవదూత ఆజ్ఞాపించినట్లు చేసాడు. మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంటికి పిలుచుకు వెళ్ళాడు.

[25] కాని, ఆమె కుమారుణ్ణి ప్రసవించే వరకు అతడు ఆమెతో కలియలేదు. అతడు ఆ బాలునికి “యేసు” అని నామకరణం చేసాడు.

మత్తయి సువార్త — Chapters