[1] యేసు ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా చెప్పాడు:
[2] “దేవుని రాజ్యాన్ని తన కుమారుని వివాహ సందర్భంగా విందునేర్పాటు చేసిన ఒక రాజుతో పోల్చవచ్చు.
[3] ఆ రాజు విందుకు ఆహ్వానింపబడిన వాళ్ళను రమ్మని పిలవటానికి తన సేవకుల్ని పంపాడు. కాని ఆహ్వానితులు రావటానికి నిరాకరించారు.
[4] “ఆ రాజు మరికొంతమంది సేవకుల్ని పంపుతూ ఆహ్వానింపబడిన వాళ్ళతో ‘భోజనం సిద్దంగా ఉందని చెప్పండి. ఎద్దుల్ని, బాగా బలిసిన పశువుల్ని కోసి అన్నీ సిద్ధంగా ఉంచామని చెప్పి వాళ్ళని పెళ్ళికి రమ్మనండి’ అని అన్నాడు.
[5] “కాని ఆహ్వానితులు లెక్క చెయ్యలేదు. ఒకడు తన పొలానికి, ఇంకొకడు తన వ్యాపారం మీద వెళ్ళిపొయ్యారు.
[6] మిగతా వాళ్ళు ఆ సేవకుల్ని పట్టుకొని అవమానించి చంపేశారు.
[7] ఆ రాజుకు చాలా కోపం వచ్చింది. తన సైన్యాన్ని పంపి ఆ హంతకుల్ని నాశనం చేసి, వాళ్ళ పట్టణాన్ని కాల్చి వేసాడు.
[8] “ఆ తర్వాత తన సేవకులతో, ‘పెళ్ళి విందు సిద్దంగా ఉంది. కాని నేనాహ్వానించిన వాళ్ళు విందుకు రావటానికి అర్హులుకారు.
[9] వీధుల్లోకి వెళ్ళి మీకు కనిపించిన వాళ్ళందర్ని విందుకాహ్వానించండి’ అని అన్నాడు.
[10] ఆ సేవకులు వీధుల్లోకి వెళ్ళి తమకు కనిపించిన వాళ్ళందర్ని అంటే మంచి వాళ్ళను, చెడ్డ వాళ్ళను, అందర్ని పిలుచుకు వచ్చారు. అతిథులతో పెళ్ళి యిల్లంతా నిండిపోయింది.
[11] “రాజు అతిధుల్ని చూడాలని వచ్చాడు. అక్కడున్న వాళ్ళల్లో ఒకడు పెళ్ళి దుస్తులు వెసుకోలేదని గమనించాడు.
[12] ‘మిత్రమా! పెళ్ళి దుస్తులు వేసుకోకుండా లోపలికి ఎట్లా వచ్చావు?’ అని రాజు అత న్ని అడిగాడు. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేక పొయ్యాడు.
[13] వెంటనే ఆ రాజు తన సేవకులతో, ‘అతని కాళ్ళు, చేతులు కట్టేసి అవతల చీకట్లో పారవేయండి. అక్కడున్న వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు’ అని అన్నాడు.
[14] “దేవుడు అనేకుల్ని ఆహ్వానిస్తాడు. కాని కొందర్ని మాత్రమే ఎన్నుకొంటాడు” అని అంటూ యేసు చెప్పటం ముగించాడు.
[15] ఆ తర్వాత పరిసయ్యులు వెళ్ళి ఆయన్ని ఆయన మాటల్తోనే పట్టి వేయాలని కుట్ర పన్ని తమ శిష్యుల్ని, హేరోదు పక్షమున్న వాళ్ళను యేసు దగ్గరకు పంపారు.
[16] వాళ్ళు, “బోధకుడా! మీరు సత్యవంతులని, దైవ మార్గాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారని మాకు తెలుసు. ఇతర్ల అంతస్తులను లెక్క చెయ్యరు. కనుక పక్షపాతం చూపరని కూడా మాకు తెలుసు.
[17] మరి చక్రవర్తికి పన్నులు కట్టడం ధర్మమా? కాదా? మీరేమంటారు?” అని ఆయన్ని అడిగారు.
[18] యేసుకు వాళ్ళ దురుద్దేశం తెలిసిపోయింది. వాళ్ళతో, “వేషధారులారా! నన్నెందుకు పరీక్షిస్తున్నారు?
[19] ఏ నాణెంతో పన్నులు కడుతున్నారో దాన్ని నాకు చూపండి” అని అన్నాడు. వాళ్ళు ఒక దెనారా తెచ్చి ఆయనకు ఇచ్చారు.
[20] ఆయన, “ఈ బొమ్మ ఎవరిది? ఆ నాణెంపై ఎవరి శాసనం ఉంది?” అని వాళ్ళనడిగాడు.
[21] “చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చెప్పారు. అప్పుడాయన వాళ్ళతో, “చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి, దేవునికి చెందిది దేవునికి యివ్వండి” అని అన్నాడు.
[22] ఇది విని వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ తదుపరి ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యారు.
[23] అదే రోజు పునరుత్ధానంలేదని వాదించే సద్దూకయ్యులు యేసు దగ్గరకు వచ్చి ఇలా అన్నారు:
[24] “బోధకుడా! ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే, అతని సోదరుడు ఆ వితంతువును వివాహమాడి చనిపోయిన సోదరునికి సంతానం కలిగించాలని మోషే అన్నాడు.
[25] మాలో ఏడుగురు సోదరులున్న ఒక కుటుంబం ఉండింది. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా మరణించాడు. కనుక ఆ వితంతువును చనిపోయిన వాని సోదరుడు వివాహం చేసుకొన్నాడు.
[26] రెండవవాడు, మూడవవాడు, ఏడవవాని దాకా అదేవిధంగా ఆమెను పెళ్ళి చేసుకొని మరణించారు.
[27] చివరకు ఆ స్త్రీ కూడా మరణించింది.
[28] ఆ ఏడుగురు ఆ స్త్రీని వివాహం చేసుకొన్నారు కదా, మరి పునరుత్ధానం తర్వాత ఆమె ఆ ఏడుగురిలో ఎవరి భార్యగా ఉంటుంది?”
[29] యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు లేఖనాలు తెలియవు. దేవుని శక్తి గురించి మీకు తెలియదు. అందువల్ల మీరు పొరబడుతున్నారు.
[30] పునరుత్థానమందు పెళ్ళి చేసుకోవటం కాని, చెయ్యటం కాని ఉండదు. వాళ్ళు పరలోకంలోని దేవదూతల్లా ఉంటారు.
[31] ఇక చనిపోయిన వారు బ్రతకడాన్ని గురించి దేవుడు మీకేం చెప్పాడో మీరు చదువలేదా?
[32] ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని అన్నాడు. ఆయన చనిపోయిన వాళ్ళ దేవుడు కాదు. జీవిస్తున్న వాళ్ళ దేవుడు.”
[33] ప్రజలు ఈ బోధన విని ఆశ్చర్యపొయ్యారు.
[34] యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు అక్కడ సమావేశమయ్యారు.
[35] వాళ్ళలో ఉన్న ధర్మశాస్త్ర పండితుడొకడు యేసును పరీక్షించాలని, “బోధకుడా! ధర్మశాస్త్రాల్లో ఉన్న ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ గొప్పది?” అని ప్రశ్నించాడు.
[37] యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ ప్రభువైన దేవుణ్ణి సంపూర్ణమైన హృదయంతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితో ప్రేమించండి.
[38] ఇది అన్ని ఆజ్ఞలకన్నా మొదటిది, గొప్పది.
[39] రెండవ ఆజ్ఞ కూడా అట్టిదే. ‘నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు’
[40] ధర్మశాస్త్రాలలో ఉన్న వాటన్నిటికి, ప్రవక్తలు వ్రాసిన వాటన్నిటికి ఈ రెండు ఆజ్ఞలే ఆధారం.”
[41] పరిసయ్యులు సమావేశమయ్యారు. యేసు వాళ్ళను
[42] “మీరు క్రీస్తును గురించి ఏమనుకుంటున్నారు? ఆయన ఎవరి కుమారుడు?” అని అడిగాడు. “దావీదు కుమారుడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
[43] యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “మరి దావీదు దేవుని ఆత్మద్వారా మాట్లాడుతూ క్రీస్తును ‘ప్రభూ!’ అని ఎందుకు పిలిచాడు? దావీదు,
[44] ‘ప్రభువు, నా ప్రభువుతో నీ శత్రువుల్ని నీ కాళ్ళ ముందు పడవేసే దాకా, నా కుడి వైపు కూర్చో’ అని అనలేదా?
[45] దావీదు క్రీస్తును ‘ప్రభూ’ అని అన్నాడు కదా. అలాంటప్పుడు క్రీస్తు దావీదు కుమారుడెట్లవుతాడు?”
[46] ఎవ్వరూ ఏ సమాధానం చెప్పలేక పొయ్యారు. ఆ రోజు నుండి ఆయన్ని మరే ప్రశ్నలు అడగటానికి ఎవ్వరికి ధైర్యం చాలలేదు.