Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:53

[1] హేరోదు రాజ్యపాలన చేస్తున్న కాలంలో యూదయ దేశంలోని బేత్లెహేములో యేసు జన్మించాడు. తూర్పు దిశనుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి

[2] “యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడున్నాడు? తూర్పున మేమాయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని ఆరాధించటానికి వచ్చాము” అని అన్నారు.

[3] ఈ విషయం విని హేరోదు చాలా కలవరం చెందాడు. అతనితో పాటు యెరూషలేము ప్రజలు కూడ కలవరపడ్డారు.

[4] అతడు ప్రధానయాజకుల్ని, పండితుల్ని సమావేశపరచి, “క్రీస్తు ఎక్కడ జన్మించబోతున్నాడు?” అని అడిగాడు.

[5] వాళ్ళు, “యూదయ దేశంలోని బేత్లెహేములో” అని సమాధానం చెప్పారు. దీన్ని గురించి ప్రవక్త ఈ విధంగా వ్రాసాడు:

[6] “‘యూదయ దేశంలోని బేత్లెహేమా! నీవు యూదయ పాలకులకన్నా తక్కువేమీ కాదు! ఎందుకంటే, నీ నుండి ఒక పాలకుడు వస్తాడు. ఆయన నా ప్రజల, అంటే ఇశ్రాయేలు ప్రజల, కాపరిగా ఉంటాడు.’”

[7] ఆ తర్వాత హేరోదు జ్ఞానుల్ని రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనిపించిన సరియైన సమయం వాళ్ళనడిగి తెలుసుకొన్నాడు.

[8] వాళ్ళను బేత్లెహేముకు పంపుతూ, “వెళ్ళి, ఆ శిశువును గురించి సమాచారం పూర్తిగా కనుక్కోండి. ఆ శిశువును కనుక్కొన్నాక నాకు వచ్చి చెప్పండి. అప్పుడు నేను కూడా వచ్చి ఆరాధిస్తాను” అని అన్నాడు.

[9] వాళ్ళు రాజు మాటలు విని తమ దారిన తాము వెళ్ళిపొయ్యారు. వాళ్ళు తూర్పు దిశన చూసిన నక్షత్రం వాళ్ళకన్నా ముందు వెళ్ళుతూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగింది.

[10] వాళ్ళా నక్షత్రం ఆగిపోవటం చూసి చాలా ఆనందించారు.

[11] ఇంట్లోకి వెళ్ళి ఆ పసివాడు తన తల్లి మరియతో ఉండటం చూసారు. వాళ్ళు ఆయన ముందు మోకరిల్లి ఆయన్ని ఆరాధించారు. ఆ తర్వాత తమ కానుకల మూటలు విప్పి ఆయనకు బంగారు కానుకలు, సాంబ్రాణి, బోళం బహూకరించారు.

[12] హేరోదు దగ్గరకు వెళ్ళొద్దని దేవుడు ఆ జ్ఞానులతో చెప్పాడు. అందువల్ల వాళ్ళు తమ దేశానికి మరో దారి మీదుగా వెళ్ళిపోయారు.

[13] వాళ్ళు వెళ్ళిపొయ్యాక దేవదూత యోసేపుకు కలలో కనిపించి, “లెమ్ము! తప్పించుకొని తల్లీబిడ్డలతో ఈజిప్టు దేశానికి వెళ్ళు! హేరోదు శిశువును చంపాలని అతని కోసం వెతుకనున్నాడు. కనుక నేను చెప్పే వరకు అక్కడే ఉండు” అని అన్నాడు.

[14] యోసేపు లేచి తల్లీ బిడ్డలతో ఆ రాత్రి ఈజిప్టు దేశానికి బయలుదేరాడు.

[15] యోసేపు హేరోదు మరణించేదాకా అక్కడే ఉండి పొయ్యాడు. తద్వారా ప్రభువు ప్రవక్త ద్వారా, “నేను నా కుమారుణ్ణి ఈజిప్టు నుండి పిలుస్తాను” అని అన్న మాట నిజమైంది.

[16] జ్ఞానులు తనను మోసం చేసారని గ్రహించి హేరోదు కోపంతో మండిపొయ్యాడు. అతడు వాళ్ళు చెప్పిన కాలాన్ననుసరించి బేత్లేహేములో, దాని పరిసర ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు, లేక అంతకన్నా తక్కువ వయస్సుగల బాలురనందర్ని చంపివేయమని ఆజ్ఞాపించాడు.

[17] తద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన ఈ విషయం నిజమైంది:

[18] “రామా గ్రామంలో అతి దుఃఖంతో ఏడుస్తున్న స్వరం వినిపించింది. రాహేలు తన సంతానం కొఱకు ఏడ్చింది. ఎవరు ఓదార్చిన వినలేదు. ఆమె సంతానంలో ఎవ్వరూ మిగల్లేదు.”

[19] హేరోదు మరణించిన తర్వాత దేవదూత ఈజిప్టులో ఉన్న యోసేపుకు కలలో కనిపించి,

[20] “లెమ్ము! శిశువును చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చనిపోయారు. కనుక తల్లిని, బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు” అని అన్నాడు.

[21] అందువల్ల యోసేపు లేచి తల్లిని, బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు.

[22] కాని, యూదయ దేశాన్ని హేరోదుకు మారుగా అతని కుమారుడు అర్కెలాయు పాలిస్తున్నాడని విని అక్కడికి వెళ్ళటానికి భయపడిపొయ్యాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ప్రభువు హెచ్చరించటంవల్ల అతడు గలిలయ ప్రాంతానికి వెళ్ళిపొయ్యాడు.

[23] అక్కడికి వెళ్ళి నజరేతు అనే గ్రామంలో నివసించాడు. తద్వారా, ఆయన నజరేతు నివాసి అని పిలువబడతాడు అని దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు నిజమయ్యాయి.

మత్తయి సువార్త — Chapters