[1] అదే రోజు యేసు ఇంటి నుండి వెళ్ళి సరస్సు ప్రక్కన కూర్చున్నాడు.
[2] ఆయన చుట్టు పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. అందువల్ల ఆయన పడవనెక్కి కూర్చున్నాడు. ప్రజలు సరస్సు ఒడ్డున నిలుచున్నారు.
[3] ఆయన వాళ్ళకు ఎన్నో విషయాలు ఉపమానాలు చెబుతూ బోధించాడు, “ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు.
[4] అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేసాయి.
[5] మరి కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందున అవి త్వరగా మొలకెత్తాయి.
[6] కాని సూర్యోదయమయ్యాక ఆ మొక్కలు వాడి పొయ్యాయి. వాటివేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి.
[7] మరి కొన్ని విత్తనాలు ముండ్ల మొక్కల మధ్య పడ్డాయి. ఈ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కల్ని అణిచి వేసాయి.
[8] మరి కొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై బడ్డాయి. వాటిలో కొన్ని నూరు రెట్ల పంటను, కొన్ని అరవై రెట్ల పంటను, కొన్ని ముప్పైరెట్ల పంటనిచ్చాయి.
[9] వినేవాళ్లు వినండి!”
[10] శిష్యులు వచ్చి యేసును, “మీరు ప్రజలతో ఉపమానాలు ఉపయోగించి ఎందుకు మాట్లాడుతారు?” అని అడిగారు.
[11] ఆయన ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుని రాజ్యం యొక్క రహస్యాలను తెలుసుకొనే జ్ఞానాన్ని మీరు పొందారు. వాళ్ళుకాదు.
[12] దేవుడు గ్రహింపు ఉన్న వాళ్ళకు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. లేని వాళ్ళ దగ్గరనుండి ఉన్నది కూడా తీసివేస్తాడు.
[13] నేను వాళ్ళతో ఉపమానాల ద్వారా ఎందుకు మాట్లాడుతున్నానంటే, చూసినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. విన్నా అర్దంచేసుకోరు, గ్రహించరు.
[14] తద్వారా యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన ఈ ప్రవచనం వాళ్ళ విషయంలో నిజమైంది: ‘మీరు తప్పక వింటారు, కాని అర్థంచేసుకోలేరు. మీరు తప్పక చూస్తారు కాని గ్రహించలేరు.
[15] వాళ్ళు కళ్ళతో చూసి, చెవుల్తో విని, హృదయాలతో అర్థం చేసుకొని నావైపు మళ్ళితే నేను వాళ్ళను నయం చేస్తాను. కాని అలా జరుగరాదని ఈ ప్రజల హృదయాలు మొద్దుబారాయి. వాళ్ళకు బాగా వినిపించదు. వాళ్ళు తమ కళ్ళు మూసికొన్నారు.’
[16] కాని మీ కళ్ళు చూడకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి. మీ చెవులు వినకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి.
[17] ఎందుకంటే ఎందరో ప్రవక్తలు, నీతిమంతులు మీరుచూస్తున్నవి చూడాలని ఆశించారు. కాని చూడలేక పోయారు. మీరు వింటున్నవి వినాలని ఆశించారు. కాని వినలేక పోయారు. ఇది సత్యం.
[18] “మరి విత్తనాన్ని చల్లే రైతు ఉపమానాన్ని గురించి వినండి.
[19] “కొందరు దేవుని రాజ్యాన్ని గురించి వింటారు. కాని అర్థం చేసుకోరు. అలాంటి హృదయాల్లో నాటబడిన దైవ సందేశాన్ని సైతాను తీసుకు వెళ్తాడు. వీళ్ళను రహదారి ప్రక్కనపడిన విత్తనాలతో పోల్చవచ్చు.
[20] “దైవ సందేశాన్ని విని వెంటనే ఆనందంగా అంగీకరించే వాళ్ళను రాతి నేలపైబడ్డ విత్తనాలతో పోల్చవచ్చు.
[21] అలాంటి విత్తనాలకు వేర్లు ఉండవు. కనుక అవి చాలాకాలం బ్రతుకవు. సందేశం వలన కష్టాలుకాని హింసలు కాని సంభవించినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని వదలి వేస్తారు.
[22] “దైవ సందేశాన్ని విని జీవితంలోని కష్టాలకు, ధనంవలన కలిగే మోసానికి ఉక్కిరి బిక్కిరై, నిష్పలులై పోయే వాళ్ళను ముళ్ళ మొక్కల్లో పడిన విత్తనాలతో పోల్చవచ్చు.
[23] “దైవ సందేశాన్ని విని దాన్ని అర్ధం చేసుకొనే వాళ్ళను సారవంతమైన భూమిలో పడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. వాటిలో కొన్ని నూరురెట్లు పంటను, కొన్ని అరవై రెట్లు పంటను, కొన్ని ముప్పైరెట్లు పంటను యిస్తాయి.”
[24] యేసు వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని మంచి విత్తనాల్ని తన పొలంలో నాటిన మనిషితో పోల్చవచ్చు.
[25] అందరూ నిద్రపోతుండగా అతని శత్రువు వచ్చి గోధుమ విత్తనాల మధ్య కలుపు విత్తనాలను చల్లిపోయాడు.
[26] గోధుమ మొలకెత్తి విత్తనం వేసింది. వాటితో సహా కలుపుమొక్కలు కూడ కనిపించాయి.
[27] పని వాళ్ళు, తమ యజమాని దగ్గరకు వచ్చి ‘అయ్యా! మీరు మీ పొలంలో మంచి విత్తనాలను నాటలేదా? మరి కలపు మొక్కలు ఎట్లా మొలిచాయి?’ అని అడిగారు.
[28] “‘ఇది శత్రువు చేసిన పని’ అని ఆ యజమాని సమాధానం చెప్పాడు. “పని వాళ్ళు, ‘మమ్మల్ని వెళ్ళి కలుపు తీయమంటారా?’ అని అడిగారు.
[29] “అతడు, ‘వద్దు! మీరిప్పుడు కలుపు తీస్తే గోధుమ మొక్కల్ని కూడా పెరికి వేసే అవకాశం ఉంది.
[30] కోతకొచ్చేవరకు రెండింటినీ పెరగనివ్వండి. అప్పుడు నేను కోత కోసే వాళ్ళతో, మొదట కలుపు మొక్కలు కోసి, కాల్చివేయటానికి వాటిని మోపులుగా కట్టి కాల్చివేయండి. ఆ తర్వాత గోధుమ గింజల్ని ప్రోగు చేసి నా ధాన్యపు కొట్టులోకి తీసుకు వెళ్ళమంటాను’ అని అంటాడు.”
[31] ఆయన వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని ఒక ఆవగింజతో పోల్చవచ్చు. ఒక వ్యక్తి ఒక ఆవగింజను తన తోటలో నాటాడు.
[32] అది విత్తనాలన్నిటికన్నా చిన్నదైనా, పెరిగినప్పుడది మొక్కలన్నిటి కన్నా పెద్దగా పెరిగి ఒక చెట్టవుతుంది. గాలిలో ఎగిరే పక్షులు దాని కొమ్మలపై గూళ్ళు కట్టుకొంటాయి.”
[33] యేసు వాళ్లకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యం పులుపు పిండి లాంటిది. ఒక స్త్రీ పులిసినపిండిని తీసికొని మూడు సేర్ల పిండిలో కలిపింది. అలా చెయ్యటం వల్ల ఆ పిండంతా పులుపుగా మారింది.”
[34] యేసు ప్రజలకు ఇవన్నీ ఉపమానాల ద్వారా చెప్పాడు. ఉపమానం ఉపయోగించకుండా వాళ్ళకేదీ చెప్పలేదు.
[35] దాంతో ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన వాక్యాలు నిజమయ్యాయి: “నేను ఉపమానాల ద్వారా మాట్లాడి, ప్రపంచం సృష్టింపబడిన నాటినుండి దాచబడిన వాటిని చెబుతాను.”
[36] ఆ తర్వాత ఆయన ప్రజల్ని వదలి యింట్లోకి వెళ్ళాడు. ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని, “పొలంలోని కలుపు మొక్కల ఉపమానాన్ని గురించి మాకు వివరంగా చెప్పండి” అని అడిగారు.
[37] యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మంచి విత్తనాన్ని నాటుతున్న వాడు మనుష్య కుమారుడు.
[38] ఈ ప్రపంచం పొలంతో పోల్చబడింది. మంచి విత్తనాలు దేవుని రాజ్యంలోవున్న ప్రజలతో పోల్చబడ్డాయి. పొలంలోని కలుపు మొక్కలు సైతాను కుమారులతో పోల్చబడ్డాయి.
[39] వాటిని నాటిన శత్రువు సైతానుతో పోల్చబడ్డాడు. కోతకాలం యుగాంతంతో పోల్చబడింది. కోతకోసేవాళ్ళు దేవదూతలతో పోల్చబడ్డారు.
[40] “కలుపు మొక్కల్ని పెరికి మంటల్లో వేసి కాల్చి వేసినట్లే యుగాంతంలో కూడా మనుష్య కుమారుడు తన దూతల్ని పంపుతాడు.
[41] వాళ్ళు వచ్చి ఆయన రాజ్యంలో ఉన్న పాపుల్ని, పాపాలను కలుగజేసే వాళ్ళను ప్రోగు చేస్తారు. అలా ప్రోగు చేసి వాళ్ళను అగ్ని గుండంలో పారవేస్తారు.
[42] వాళ్ళు ఏడుస్తారు. బాధననుభవిస్తారు.
[43] ఆ తర్వాత నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు. విన్నవాళ్ళు అర్థం చేసుకోండి!
[44] “దేవుని రాజ్యం పొలంలో దాచబడిన నిధి లాంటిది. ఒక వ్యక్తి ఆ నిధిని కనుగొన్నాడు. కాని వెంటనే దాన్ని దాచేసాడు. ఆ తర్వాత ఆనందంగా వెళ్ళి తన దగ్గరున్నవన్నీ అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు.
[45] “దేవుని రాజ్యం మంచి ముత్యాల కోసం వెతికే వర్తకుని లాంటిది.
[46] ఒక వర్తకుడు మంచి విలువైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత వెళ్ళి తనకున్నదంతా అమ్మేసి దాన్ని కొన్నాడు.
[47] “దేవుని రాజ్యం సరస్సులోకి వేసి అన్ని రకాల చేపల్ని పట్టుకొనే ఒక వలలాంటిది.
[48] వల చేపల్తో నిండిపొయ్యాక బెస్తవాళ్ళు దాన్ని ఒడ్డుకు లాగి మంచి చేపల్ని బుట్టలో వేసికొని పనికిరాని చేపల్ని పారవేస్తారు.
[49] అదేవిధంగా యుగాంతంలో కూడా దేవ దూతలు వచ్చి నీతిమంతులనుండి దుర్మార్గుల్ని వేరు చేసి, భయానకమైన మంటల్లో పారవేస్తారు.
[50] వాళ్ళు దుఃఖిస్తారు, బాధననుభవిస్తారు, పళ్ళు కొరుకుతారు.”
[51] “మీకివన్నీ అర్థమయ్యాయా?” అని యేసు అడిగాడు. అవునని వాళ్ళు సమాధానం చెప్పారు.
[52] యేసు వాళ్ళతో, “దేవుని రాజ్యాన్ని గురించి బోధన పొందిన శాస్త్రుల్ని తన ధనాగారం నుండి క్రొత్త నిధుల్ని, పాతనిధుల్ని తీసుకొని వచ్చే ఆసామితో పోల్చవచ్చు” అని అన్నాడు.
[53] యేసు ఈ ఉపమానాలన్నిటిని చెప్పటం ముగించాక అక్కడి నుండి ప్రయాణమై తన స్వగ్రామం వెళ్ళాడు. అక్కడ సమాజ మందిరంలో ప్రజలకు బోధించటం మొదలు పెట్టాడు.
[54] వాళ్ళు ఆ బోధనలు విని చాలా ఆశ్చర్యపడి, “ఈ జ్ఞానం, ఈ శక్తి ఈయనకు ఎక్కడ నుండి లభించాయి?
[55] ఈయన వడ్రంగి కుమారుడే కదూ! ఈయన తల్లి పేరు మరియ కదూ! ఇతని సోదరులు యాకోబు, యోసేవు, సీమోను, యూదా కదూ!
[56] ఇతని అక్క చెల్లెండ్రందరూ మన గ్రామంలోనే నివసిస్తున్నారు కదూ! మరి ఈయనకు యివన్నీ ఎక్కడనుండి లభించాయి?” అని అన్నారు.
[57] ఆయనపై వాళ్ళకు కోపం వచ్చింది. యేసు వాళ్ళతో, “స్వగ్రామం వాళ్ళు, యింటి వాళ్ళు తప్ప ప్రవక్తను అందరూ గౌరవిస్తారు” అని అన్నాడు.
[58] వాళ్ళు విశ్వసించలేదు. కనుక ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు.