[1] నాకు హృదయంలో ఎంతో దుఃఖం, ఎడతెగని బాధ ఉన్నాయి –
[2] క్రీస్తులో సత్యమే చెపుతున్నాను. నేను అబద్ధమాడడం లేదు. నా అంతర్వాణి పవిత్రాత్మతో కలిసి నాకు సాక్ష్యం చెపుతూ ఉంది.
[3] శరీర సంబంధంగా నా సోదరులైన నా సొంత జాతివారికోసం నేను క్రీస్తునుంచి వేరుపడి శాపానికి గురి కావడానికి కోరగలవాణ్ణి.
[4] వారు ఇస్రాయేల్ ప్రజ. దత్తస్వీకారం, మహిమ, ఒడంబడికలు, ధర్మశాస్త్ర ప్రధానం, ఆరాధనాచారాలు, వాగ్దానాలు వారికి చెందుతాయి.
[5] పితరులు వీరివారే. శరీరరీతిగా క్రీస్తు వచ్చినది వీరిలోనుంచే. ఈయన అందరికంటే ఉన్నతుడు, శాశ్వతంగా స్తుతిపాత్రుడైన దేవుడు. తథాస్తు!
[6] దేవుని వాక్కు భంగమైనట్టు కాదు. ఎందుకంటే, ఇస్రాయేల్ నుంచి సహజంగా వచ్చినవారంతా నిజమైన ఇస్రాయేల్‌వారు కారు.
[7] అలాగే, అబ్రాహాముకు పుట్టిన వారంతా దాన్ని బట్టి అబ్రాహాము సంతానమని కాదు గాని “ఇస్సాకు మూలంగా కలిగే సంతానమే నీ సంతానం అని పిలవడం జరుగుతుంది.”
[8] దీని అర్థమేమంటే శరీరరీతిగా పుట్టినవారు దేవుని సంతానం కాదు గాని దేవుని వాగ్దానం మూలంగా పుట్టినవారే సంతానంగా లెక్కలోకి వస్తారు.
[9] ఆ వాగ్దానం గురించిన వాక్కు ఇది: “ఇదే కాలంలో నేను వస్తాను. శారాకు కుమారుడు కలుగుతాడు.”
[10] అంతే కాదు. రిబ్కా కూడా మన పితరుడైన ఇస్సాకు అనే ఒక మనిషి వల్ల గర్భం ధరించినప్పుడు
[11] ఆ పిల్లలు ఇంకా పుట్టి మంచీ చెడూ ఏదీ చేయకముందే ఆమెతో ఇలా చెప్పడం జరిగింది: “పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడు.”
[12] దేవుని ఎన్నిక ప్రకారమైన ఉద్దేశమే నిలవాలని అలా జరిగింది. ఆ ఉద్దేశం మనుషుల క్రియల మూలమైనది కాదు గాని మనుషులను పిలిచే దేవుని మూలమైనదే.
[13] దీనికి సమ్మతంగా ఈ విధంగా రాసి ఉన్నది: “యాకోబును ప్రేమతో చూశాను గాని ఏశావును ద్వేషంతో చూశాను.”
[14] అందుచేత మనం ఏమనాలి? దేవుడు అన్యాయస్థుడా? అలా కానే కాదు!
[15] ఆయన మోషేతో ఇలా అన్నాడు గదా: “నాకు ఎవరిమీద కరుణ చూపాలని ఉందో వారిమీద కరుణ చూపుతాను. ఎవరిని కనికరించాలని ఉందో వారిని కనికరిస్తాను.”
[16] గనుక కరుణ చూపడం దేవునివల్లే అయ్యేది. అది కావాలని ఇష్టపడే వ్యక్తివల్ల కాదు, దానికోసం పరుగెత్తే వ్యక్తివల్లా కాదు.
[17] లేఖనం ఫరోతో చెప్పేదేమిటంటే, “నీ విషయంలో నా బలప్రభావాలను ప్రదర్శించాలి, నా పేరు విశాల లోకంలో ప్రచురం కావాలి. ఈ కారణంచేతే నిన్ను హెచ్చించాను”.
[18] కనుక ఆయన ఎవరిమీద కరుణ చూపాలని కోరుతాడో వారిమీద చూపుతాడు, ఎవరి హృదయం గట్టిపరచాలని కోరుతాడో వారికి అలా చేస్తాడు.
[19] అలాగైతే నీవు నాతో ఇలా అంటావు: “ఆయన సంకల్పాన్ని ఎదిరించేదెవరు? ఆయన తప్పు పట్టడమెందుకు?”
[20] అయితే, ఓ మనిషీ, దేవునికి ఎదురు చెప్పడానికి నీవెవరివి? “నన్ను ఈ విధంగా ఎందుకు చేశావు?” అని నిర్మాణమైనది దాని నిర్మాతతో అనవచ్చా?
[21] కుమ్మరికి మట్టిమీద హక్కు లేదా? ఒకే ముద్ద తీసుకొని ఘనత కోసం ఒక పాత్రను, ఘనహీనతకోసం మరో పాత్రను అతడు చేయలేడా?
[22] ఒకవేళ దేవుడు తన కోపాన్ని వెల్లడి చేయాలనీ తన బలప్రభావాలను తెలియజేయాలనీ నాశనానికి సిద్ధమైన, కోపానికి గురి అయిన పాత్రలను అధిక సహనంతో ఓర్చుకొంటే ఏమి?
[23] ఆయన ముందుగానే మహిమకోసం సిద్ధం చేసిన పాత్రలపట్ల – కరుణ పొందిన ఆ పాత్రలపట్ల – తన మహిమ సంపత్తు తెలియజేయడానికి ఆశిస్తే ఏమి?
[24] కరుణ పొందిన ఈ పాత్రలం మనమే – యూదుల్లోనుంచి మాత్రమే కాకుండా, ఇతర ప్రజలలో నుంచి కూడా ఆయన పిలిచినవారమే.
[25] దీనికి సమ్మతంగా ఆయన హోషేయగ్రంథంలో ఇలా అంటున్నాడు: నా ప్రజ కానివారిని “నా ప్రజ” అనీ, ప్రియురాలు కానిదానిని “ప్రియురాలు” అనీ పిలుస్తాను.
[26] అంతేకాదు, “మీరు నా జనం కాదు” అని చెప్పిన స్థలంలోనే వారిని “సజీవ దేవుని సంతానం” అనడం జరుగుతుంది.
[27] యెషయా కూడా ఇస్రాయేల్‌ను గురించి స్వరమెత్తి ఇలా పలుకుతున్నాడు: ఇస్రాయేల్ ప్రజల సంఖ్య సముద్రం ఇసుక రేణువుల్లాగా ఉన్నా మిగిలిపోయిన భాగానికే రక్షణ కలుగుతుంది.
[28] ఎందుకంటే ఆయన ఆ పని ముగించి న్యాయంతో దానిని సంక్షిప్తంగా చేస్తాడు. ప్రభువు భూమిమీద ఆ పని త్వరగా పూర్తి చేస్తాడు.
[29] అంతే గాక యెషయా ముందుగా ఇలా అన్నాడు: సేనల ప్రభువు మనకు సంతానాన్ని మిగిల్చి ఉండకపోతే మనం సొదొమలాగా అయి ఉండే వాళ్ళమే, గొమొర్రా పోలిన వారంగా చేయడం జరిగి ఉండేది.
[30] అలాగైతే మనమేమంటాం? నిర్దోషత్వాన్ని వెంటాడని యూదేతరులు నిర్దోషత్వాన్ని – నమ్మకం మూలమైన నిర్దోషత్వాన్ని – అందుకొన్నారు.
[31] ఇస్రాయేల్‌ప్రజలైతే నిర్దోషత్వాన్ని గురించిన నియమాన్ని వెంటాడినా దాన్ని అందుకోలేదు.
[32] ఎందుకని? వారు దాన్ని నమ్మకం ద్వారా కాక ధర్మశాస్త్ర క్రియల ద్వారా దానిని వెతికారు. వారి కాలికి అడ్డురాయి తగిలి తొట్రుపడ్డారు.
[33] దీన్ని గురించి ఇలా రాసి ఉంది: ఇదుగో నేను సీయోనులో ఒక అడ్డురాయి, తొట్రుపాటు బండ ఉంచుతాను. ఆయనమీద నమ్మకం ఉంచేవారు అవమానానికి గురి కాబోరు.