[1] మనం విశ్వాసంవల్ల నిర్దోషులుగా లెక్కలోకి వచ్చినందుచేత మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో మనకు సమాధానం ఉంది.
[2] అంతేగాక, ఆయన ద్వారా నమ్మకంవల్ల దేవుని కృపలోకి మనకు ప్రవేశం కలిగి ఉంది. ఈ కృపలో నిలిచి ఉంటూ దేవుని మహిమకోసం ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉత్సాహపడుతున్నాం.
[3] అంతేగాక, మన బాధలలో కూడా ఉత్సాహపడుతున్నాం. ఎందుకంటే, బాధ సహనాన్ని కలిగిస్తుందనీ
[4] సహనం అనుభవాన్ని కలిగిస్తుందనీ అనుభవం ఆశాభావాన్ని కలిగిస్తుందనీ మనకు తెలుసు.
[5] ఈ ఆశాభావం మనకు ఆశాభంగం కలిగించదు. ఎందుకంటే, మనకు ప్రసాదించబడిన పవిత్రాత్మ ద్వారా మన హృదయాలలో దేవుని ప్రేమను కుమ్మరించడం జరిగింది.
[6] మనమింకా బలం లేకుండా ఉన్నప్పుడు క్రీస్తు తగిన కాలంలో భక్తిహీనులకోసం చనిపోయాడు.
[7] న్యాయవంతుని కోసం సహా ఎవరైనా చనిపోవడం అరుదు. ఒకవేళ మంచి వ్యక్తికోసం ఎవరైనా తెగించి చనిపోతే చనిపోవచ్చు.
[8] కానీ మనమింకా పాపులమై ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం చనిపోయాడు. ఇందులో దేవుడు తన ప్రేమను మనపట్ల చూపుతున్నాడు.
[9] ఇప్పుడు మనం ఆయన రక్తంవల్ల నిర్దోషులుగా లెక్కలోకి వచ్చాం, గనుక మరీ నిశ్చయంగా ఆయనద్వారా దేవుని కోపం నుంచి మనకు విముక్తి కలుగుతుంది.
[10] మనం దేవునికి విరోధులమై ఉన్నప్పుడు తన కుమారుని మరణం ద్వారా మనలను దేవునితో సఖ్యపరచడం జరిగింది. అలాంటప్పుడు ఆయనతో సఖ్యపడి, ఆ కుమారుడు జీవిస్తూ ఉండడంవల్ల మరి నిశ్చయంగా మనకు విముక్తి కలుగుతుంది.
[11] ఇంతేగాక, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు దేవునితో సఖ్యపడి ఆయన ద్వారా దేవునిలో ఉత్సాహ పడుతున్నాం.
[12] పాపమనేది ఒకే మనిషి ద్వారా లోకంలో ప్రవేశించింది. పాపం ద్వారా చావు ప్రవేశించింది. అందరూ పాపం చేశారు గనుక అలాగే అందరికీ చావు వచ్చింది.
[13] ధర్మశాస్త్రానికి ముందు పాపం లోకంలో ఉంది గాని ధర్మశాస్త్రం లేనప్పుడు అది పాపంగా లెక్కలోకి రాదు.
[14] అయినప్పటికీ ఆదామునుంచి మోషే వరకు చావు ఏలింది. ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమం లాంటి పాపం చేయనివారిమీద కూడా చావు ఏలింది. ఆదాము అప్పుడు రాబోయి ఉండేవానికి సూచన.
[15] అయితే ఆదాము అపరాధంలాగా దేవుని ఉచిత కృపావరం రాలేదు, అంటే ఆ ఒక్క మనిషి అపరాధంవల్ల అనేకులకు చావు కలిగింది గాని యేసు క్రీస్తు అనే మనిషివల్ల వచ్చే ఉచిత కృపావరమూ, దేవుని అనుగ్రహమూ మరీ నిశ్చయంగా అనేకులకు సమృద్ధిగా కలిగాయి.
[16] అంతేగాక, పాపం చేసిన ఆ ఒక్కడి వల్ల ఫలితం కలిగినట్లు దేవుని ఉచిత వరం కలగలేదు. ఆ ఒక్క పాపంవల్ల దేవుని తీర్పు వచ్చింది. తీర్పు వల్ల శిక్షావిధి కలిగింది. ఆ ఉచిత వరమైతే అనేక అపరాధాల మూలంగా కలిగింది. దానివల్ల నిర్దోషులుగా ఎంచబడడం అనేది కలిగింది.
[17] ఆ ఒక్కని అపరాధంవల్ల చావు వచ్చి ఆ ఒక్కని ద్వారా ఏలింది. అయితే కృపాసమృద్ధి, నిర్దోషత్వమనే ఉచిత వరం పొందేవారు మరీ నిశ్చయంగా జీవిస్తూ యేసు క్రీస్తు అనే ఒక్కని ద్వారా ఏలుతారు.
[18] కనుక ఒకే అపరాధ ఫలితం మనుషులందరికీ శిక్షావిధి వచ్చినట్టే ఒకే న్యాయ క్రియ వలన మనుషులందరికీ ఆ ఉచిత వరం వచ్చింది. దాని ఫలితం జీవితం నిర్దోషంగా ఎంచబడడం.
[19] ఎలాగంటే, ఆ ఒకే మనిషి అవిధేయతవల్ల అనేకులు ఎలా పాపులయ్యారో అలాగే ఈ ఒకే మనిషి విధేయతవల్ల అనేకులు నిర్దోషులవుతారు.
[20] దోషాన్ని వృద్ధి చేయడానికి ధర్మశాస్త్రం ప్రవేశించింది. అయితే పాపం ఎక్కడ వృద్ధి అయిందో అక్కడ దేవుని కృప మరింతగా వృద్ధి అయింది.
[21] ఈ విధంగా మరణంలో పాపం ఎలా ఏలిందో అలాగే నిర్దోషత్వం మూలంగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా శాశ్వత జీవానికి కృప ఏలుతుంది.