Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:11

[1] మన సోదరి ఫీబేను మీకు సిఫారసు చేస్తున్నాను. కెంక్రేయలో ఉన్న క్రీస్తుసంఘంలో ఈమె సేవకురాలు.

[2] పవిత్రులకు తగినట్టుగా ప్రభువును బట్టి ఈమెను స్వీకరించండి. ఈమెకు ఏ విషయాలలో మీ సహాయం అవసరమో వాటిలో తోడ్పడండి. ఎందుకంటే ఈమె అనేకులకూ, ఆ మాటకు వస్తే నాకూ కూడా సహాయం చేసింది.

[3] ప్రిస్కిల్లాకూ అకులకూ నా అభివందనాలు చెప్పండి. వారు క్రీస్తు యేసులో నా జతపనివారు.

[4] నా కోసం వారు తమ ప్రాణాలను కూడా తెగించారు. నేను వారికి కృతజ్ఞుణ్ణి – నేనూ కాదు, యూదేతర జనాలలో ఉన్న క్రీస్తుసంఘాల వారంతా కృతజ్ఞులు.

[5] వారి ఇంట్లో సమకూడే సంఘానికి కూడా నా అభివందనాలు. నా ప్రియ సోదరుడైన ఎపైనీటుకు నా అభివందనాలు చెప్పండి. ఆసియా రాష్ట్రంలో ఇతడే క్రీస్తుకు తొలిపంట.

[6] మరియకు అభివందనాలు. మా కోసం ఆమె ప్రయాస ఇంతింత కాదు.

[7] ఆంద్రోనికస్‌కూ యూనికస్‌కూ అభివందనాలు. వారు నా రక్తసంబంధులు, మునుపు నాతోకూడా ఖైదీలు, క్రీస్తు రాయబారులలో ప్రసిద్ధులు, నాకంటే ముందుగా క్రీస్తులో ఉన్నవారు.

[8] ప్రభువులో నా ప్రియ మిత్రుడు అంప్లీయతుకు అభివందనాలు.

[9] క్రీస్తులో నా జతపనివాడైన ఊర్బానుకు, నా ప్రియ మిత్రుడు స్టాకుకు అభివందనాలు.

[10] అపెల్లెకు అభివందనాలు. అతడు క్రీస్తులో పరీక్షలకు నిలిచిన యోగ్యుడు. అరిస్టాబులస్ ఇంటివారికి అభివందనాలు.

[11] నా రక్తసంబంధి అయిన హెరోదియొన్‌కు అభివందనాలు. నార్కిస్సు ఇంటివారిలో ప్రభువులో ఉన్నవారికి అభివందనాలు.

[12] ప్రభువులో ప్రయాసపడే త్రుఫైనాకూ త్రుఫోసాకూ అభివందనాలు. ప్రియ సోదరి పెర్సిసుకు అభివందనాలు. ఆమె ప్రభువులో అధికంగా ప్రయాసపడింది.

[13] ప్రభువులో ఎన్నికైనవాడు రూఫసుకూ అతని తల్లికీ అభివందనాలు. ఆవిడ నాకు కూడా తల్లి.

[14] అసుంక్రితసుకూ ఫ్లెగోనుకూ హెర్మాకూ పత్రొబసుకూ హెర్మేకూ వారితో ఉన్న సోదరులకూ అభివందనాలు.

[15] ఫిలొలొగస్‌కూ యూలియాకూ నేరియాకూ అతని సోదరికీ ఒలుంపాకూ వారితో ఉన్న పవిత్రులందరికీ అభివందనాలు.

[16] పవిత్రమైన ముద్దుపెట్టుకొని ఒకరితో ఒకరు అభివందనాలు చెప్పుకోండి. క్రీస్తు సంఘాలనుంచి మీకు అభివందనాలు.

[17] సోదరులారా, మీరు నేర్చుకొన్న ఉపదేశానికి విరుద్ధమైన భేదాలూ అభ్యంతరాలూ కలిగించేవారిని కనిపెట్టి వారి సహవాసం నుంచి తొలగాలని మిమ్ములను వేడుకొంటున్నాను.

[18] అలాంటివారు మన ప్రభువైన యేసు క్రీస్తుకు సేవ చేయడం లేదు గాని తమ కడుపుకే దాసులు. వారు ఇచ్చకం వినియోగిస్తూ, మృదువైన మాటలతో అమాయకులను మోసగిస్తారు.

[19] మీ విధేయతను గురించి అందరికీ వినిపించింది గనుక మీ విషయం నేనానందిస్తున్నాను. అయితే మీరు మంచి విషయాలలో తెలివైనవారు, చెడు విషయాలలో నిర్దోషులు కావాలని నా కోరిక.

[20] శాంతి ప్రదాత అయిన దేవుడు మీ పాదాలక్రింద సైతానును త్వరగా చితగ్గొట్టివేస్తాడు. మన ప్రభువైన యేసు అనుగ్రహం మీకు తోడై ఉంటుంది గాక.

[21] నా జతపనివాడు తిమోతి, నా బంధువులు లూకియ, యాసోను, సోసిపత్తు మీకు అభివందనాలు చెపుతున్నారు.

[22] ఈ లేఖ రాసిపెట్టిన తెర్తియ అనే నేను కూడా ప్రభువులో మీకు అభివందనాలు చెపుతున్నాను.

[23] నాకూ క్రీస్తు సంఘమంతటికీ అతిథి సత్కారాలిచ్చే గాయస్, ఈ నగర ఖజానాదారుడు ఎరస్తు, సోదరుడు క్వర్తు మీకు అభివందనాలు చెపుతున్నారు.

[24] మన ప్రభువైన యేసు క్రీస్తు అనుగ్రహం మీకు తోడై ఉంటుంది గాక. తథాస్తు.

[25] నేను ప్రకటించే శుభవార్త ప్రకారం, యేసు క్రీస్తును గురించిన ఉపదేశం ప్రకారం దేవుడు మిమ్ములను సుస్థిరం చేయడానికి సమర్ధుడు. ఇదంతా అనాదినుంచి మరుగైవుండీ, ప్రత్యక్షమైన రహస్య సత్యానికి అనుగుణమైనది.

[26] ఈ రహస్య సత్యం ఇప్పుడు వెల్లడి అయింది. జనాలన్నీ ఈ విశ్వాస సత్యాలకు లోబడాలన్న శాశ్వతుడైన దేవుని ఆజ్ఞప్రకారం, ప్రవక్తల లేఖనాల ద్వారా వారికి తెలియవచ్చింది.

[27] ఆ ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా ఎప్పటికీ మహిమ కలుగుతుంది గాక! తథాస్తు!

రోమ్ వారికి లేఖ — Chapters