[1] సోదరులారా, ఇస్రాయేల్ ప్రజకు పాపవిముక్తి కలగాలనే నా హృదయాభిలాష, వారికోసం దేవునికి చేసే నా ప్రార్థన.
[2] వారికి దేవుని విషయంలో ఆసక్తి ఉందని వారిని గురించిన నా సాక్ష్యం. అయితే వారి ఆసక్తి జ్ఞానానికి అనుగుణమైనది కాదు.
[3] దేవుని నీతిన్యాయాల విషయంలో వారికి తెలివి లేదు గనుక తమ సొంత నీతిన్యాయాలను స్థాపించాలని చూస్తూ, దేవుని నీతిన్యాయాలకు లోబడలేదు.
[4] నీతిన్యాయాల సంగతి చూస్తే తనను నమ్మిన ప్రతి ఒక్కరి విషయంలోనూ క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తం.
[5] ధర్మశాస్త్రానికి సంబంధించిన నీతిన్యాయాల గురించి మోషే రాసేదేమంటే, వాటిని చేస్తూ ఉండే మనిషి వాటివల్ల జీవిస్తాడు.
[6] అయితే నమ్మకానికి సంబంధించిన నీతిన్యాయాలు చెప్పేదేమిటంటే మీ హృదయాలలో ఇలా అనుకోకండి: పరలోకానికి ఎక్కిపోయే వారెవరు (క్రీస్తును అక్కడనుంచి క్రిందికి తీసుకురావాలని)?
[7] లేదా, అగాధంలోకి దిగిపోయేవారెవరు (క్రీస్తును చనిపోయిన వారిలో నుంచి పైకి తీసుకురావాలని)?
[8] అది ఏమని చెపుతూ ఉంది? “వాక్కు మీ సమీపంలో ఉంది. అది మీ నోట్లోనూ మీ హృదయంలోనూ ఉంది.” ఆ వాక్కు మేము ప్రకటించే విశ్వాస సంబంధమైన వాక్కే.
[9] అదేమంటే ప్రభువైన యేసును మీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపాడని మీ హృదయంలో నమ్మితే మీరు పాపవిముక్తి, రక్షణ పొందుతారు.
[10] ఎందుకంటే, మనిషి హృదయంతో నమ్ముతాడు, దాని ఫలితం నిర్దోషత్వం. నోటితో ఒప్పుకొంటాడు. దాని ఫలితం పాపవిముక్తి.
[11] లేఖనం ఇలా అంటుంది: ఆయనమీద నమ్మకం ఉంచినవారెవరికీ సిగ్గంటూ కలగదు.
[12] యూదులూ గ్రీసువారూ అంటూ భేదం లేదు – ఒకే ఒక ప్రభువు అందరికీ ప్రభువే. ఆయన తనకు మొరపెట్టే వారందరిపట్లా కృపాసంపన్నుడు.
[13] ఎలాగంటే, ఎవరైతే ప్రభువు పేర మొర పెడతారో వారికి పాపవిముక్తి కలుగుతుంది.
[14] కానీ వారు నమ్మనివానికి మొరపెట్టడం ఎలా? వారు ఆయనను గురించి వినకపోతే నమ్మడం ఎలా? చాటించేవాడు లేనిదే వారు వినడం ఎలా?
[15] పంపబడకపోతే చాటించేవారు ఎలా చాటిస్తారు? ఇందుకు ఇలా రాసి ఉంది: శాంతి శుభవార్త ప్రకటిస్తూ, ఉత్తమ విశేషాలను గురించి శ్రేష్ఠ సమాచారం తీసుకువచ్చేవారి పాదాలు ఎంతో అందమైనవి.
[16] అయినా వారంతా శుభవార్త చెవినిపెట్టలేదు. యెషయా అన్నాడు గదా, ప్రభూ! మేము తెలియజేసిన సమాచారం నమ్మినదెవరు?
[17] గనుక వినడంవల్ల నమ్మకం కలుగుతుంది. వినడం దేవుని వాక్కువల్ల కలుగుతుంది.
[18] అయితే నేను చెప్పేదేమిటంటే, వారు వినలేదా? విన్నారు గదా! “వాటి వాణి లోకమంతటా వినిపించింది, వాటి మాటలు జగత్తు కొనలకు చేరాయి.”
[19] నేను చెప్పేదేమిటంటే, ఇస్రాయేల్‌ప్రజకు ఇది తెలిసినది కాదా? మొదట మోషే దేవుని మాటలు ఇలా చెప్పాడు: జాతి కానివారివల్ల మీకు అసూయ పుట్టిస్తాను. బుద్ధిలేని జాతివల్ల మీకు కోపం రేకెత్తిస్తాను.
[20] యెషయా చాలా ధైర్యం వహించి దేవుని మాటలు ఇలా పలికాడు: నన్ను వెదకనివారికి నేను దొరికాను. నన్ను గురించి విచారణ చేయనివారికి ప్రత్యక్షమయ్యాను.
[21] ఇస్రాయేల్‌ప్రజ విషయమైతే ఆయన అన్నాడు, అవిధేయులై మూర్ఖంగా ఉండే ప్రజవైపు నేను రోజంతా చేతులు చాపాను.