[1] రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అంటే పవిత్రులుగా ఉండడానికి దేవుని పిలుపు అందిన వారందరికీ పౌలు రాస్తున్న సంగతులు.
[2] మన తండ్రి అయిన దేవునినుంచీ ప్రభువైన యేసుక్రీస్తు నుంచీ మీకు కృప, శాంతి కలుగుతాయి గాక.
[3] నేను యేసు క్రీస్తుకు దాసుణ్ణి, ఆయన రాయబారిగా ఉండడానికి పిలుపు అందినవాణ్ణి, దేవుని శుభవార్తకోసం ప్రత్యేకించబడ్డవాణ్ణి.
[4] దేవుడు తన కుమారుడూ మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన ఈ శుభవార్త ముందుగానే ఆయన ప్రవక్తల ద్వారా పవిత్ర లేఖనాలలో వాగ్దానం చేశాడు.
[5] యేసు శరీర సంబంధంగానైతే దావీదు సంతానంగా జన్మించాడు.
[6] దేవుని పవిత్రమైన ఆత్మసంబంధంగానైతే ఆయన దేవుని కుమారుడు. ఆయన చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేవడంద్వారా ఇది బలప్రభావాలతో రుజువైంది.
[7] ఆయనద్వారా మేము కృప, రాయబారి పదవి పొందాం. ఆయన పేరుకోసం అన్ని జనాలలో విశ్వాస విధేయత కలగాలని ఆయన ఉద్దేశం. అలాంటివారిలో మీరూ దేవుని పిలుపు అంది యేసుక్రీస్తుకు చెందినవారై ఉన్నారు.
[8] మీ నమ్మకాన్ని గురించి లోకమంతటా చెప్పడం జరుగుతూ ఉంది గనుక మొట్టమొదట నేను మీ అందరికోసమూ యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెపుతున్నాను.
[9] నా ప్రార్థనలలో ఎల్లప్పుడూ మిమ్ములను పేర్కొంటూ, ఎలాగైనా సరే దేవుని ఇష్టప్రకారం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే అవకాశం కలగాలని ఆయనను ఎప్పుడూ వేడుకొంటూ ఉన్నాను.
[10] తన కుమారుని శుభవార్త విషయంలో ఆత్మపూర్వకంగా నేను సేవిస్తున్న దేవుడే ఇందుకు నాకు సాక్షి.
[11] మీరు స్థిరపడేందుకు ఆధ్యాత్మిక కృపావరం ఏదైనా మీకు కలిగించడానికి మిమ్ములను చూడాలని ఎంతో ఆశిస్తూ ఉన్నాను.
[12] అంటే, మీకూ నాకూ ఉన్న అన్యోన్య విశ్వాసంవల్ల నేను మీతో కూడా ప్రోత్సాహం పొందాలని నా ఆశ.
[13] సోదరులారా, మీ దగ్గరకు రావడానికి చాలా సార్లు ఉద్దేశించాను గాని ఇదివరకు నాకు ఆటంకాలు కలిగాయి. ఇది మీకు తెలియకపోవడం నాకిష్టం లేదు. ఇతర దేశాల ప్రజల మధ్యలాగే మీమధ్య కూడా ఫలభరితమైన సేవ జరిగించాలని నా ఉద్దేశం.
[14] నేను గ్రీసు దేశస్థులకూ ఇతర జాతులవారికీ, తెలివైనవారికీ తెలివితక్కువవారికీ రుణస్థుణ్ణి.
[15] అందుచేత నా మట్టుకు నేను రోమ్‌లో ఉన్న మీకు కూడా శుభవార్త ప్రకటించడానికి సిద్ధంగానే ఉన్నాను.
[16] క్రీస్తు శుభవార్తను గురించి నాకు సిగ్గు అంటూ ఏమీ లేదు. ఎందుకంటే, నమ్మే ప్రతి ఒక్కరికీ – మొదట యూదులకు, తరువాత ఇతర ప్రజలకు కూడా – అది పాప విముక్తి, రక్షణ కోసం దేవుని బలప్రభావాలు.
[17] ఎందుకంటే, అందులో దేవుని న్యాయం విశ్వాసం నుంచి విశ్వాసానికి వెల్లడి అయింది. దీనికి సమ్మతంగా ఇలా రాసి ఉంది: “న్యాయవంతుడు దేవునిమీది తన నమ్మకంవల్లే జీవిస్తాడు.”
[18] దుర్మార్గంచేత సత్యాన్ని అణచివేసే మనుషుల సమస్త భక్తిహీనత మీదా దుర్మార్గం మీదా దేవుని కోపం కూడా పరలోకంనుంచి వెల్లడి అయింది.
[19] ఎందుకంటే, దేవుని విషయం తెలిసిన సంగతులు వారిలో దృష్టిగోచరమైనవి ఉన్నాయి. దేవుడు తానే వారికి స్పష్టం చేశారు.
[20] ఏలాగంటే లోకసృష్టి ఆరంభంనుంచి కంటికి కనబడని ఆయన లక్షణాలు – ఆయన శాశ్వత బలప్రభావాలు, దేవత్వం స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అవి నిర్మాణమైనవాటి వల్ల తెలిసిపోతూ వున్నాయి. అందుచేత వారు ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నారు.
[21] ఎందుకంటే, వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుడుగా ఆయనను మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞత చెప్పలేదు. అంతేగాక వారి తలంపులు వ్యర్థమైపోయాయి. వారి తెలివితక్కువ హృదయాలు చీకటిమయమయ్యాయి.
[22] తాము జ్ఞానులమని చెప్పుకొంటూ బుద్ధిలేనివారయ్యారు.
[23] ఎన్నడూ నాశనం కానివాడైన దేవుని మహిమకు బదులుగా నాశనం అయ్యే మనుషుల విగ్రహాలనూ పక్షుల, నాలుగు కాళ్ళున్న మృగాల, ప్రాకే ప్రాణుల విగ్రహాలను కూడా పెట్టుకొన్నారు.
[24] ఆ కారణంచేత దేవుడు వారి హృదయంలోని చెడ్డ కోరికలతోపాటు వారిని కల్మషానికి పరస్పరంగా తమ శరీరాలను అవమానపరచడానికి అప్పగించాడు.
[25] వారు దేవుని సత్యానికి బదులు అబద్ధాన్ని పెట్టుకొని సృష్టికర్తకు మారుగా సృష్టిలోనివాటినే పూజించారు, సేవించారు. ఆయనే శాశ్వతంగా స్తుతిపాత్రుడు. తథాస్తు!
[26] ఆ కారణంచేత దేవుడు వారిని నీచమైన ఆశలకు అప్పగించాడు. వారి స్త్రీలు సహా సహజ సంబంధం మానుకొని అసహజ సంబంధం ఎన్నుకొన్నారు.
[27] అలాగే పురుషులు కూడా స్త్రీలతో సహజ సంబంధం మానుకొని ఒకణ్ణి ఒకడు మోహించుకొని కామాగ్నిలో మాడిపోయారు. మగవారు మగవారితో అసహ్యమైనది చేశారు. తమ తప్పిదానికి తగిన ప్రతిఫలం తమ లోపల పొందారు కూడా.
[28] దేవుణ్ణి తమ ఎరుకలో ఉంచుకోవడమంటే వారికి ఇష్టంగా లేదు గనుక చేయరానివి చేయించే పాడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు.
[29] వారిలో అన్ని రకాల దుర్మార్గత, జారత్వం, చెడుతనం, అత్యాశ, దుష్టబుద్ధి నిండి ఉన్నాయి. అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వారిని నింపివేశాయి.
[30] వారు కొండెగాళ్ళు, అపనిందలు వేసేవారు, దేవుడంటే ద్వేషం ఉన్నవారు, అపకారులు, గర్విష్ఠులు, బడాయికోరులు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రుల మాట విననివారు,
[31] తెలివితక్కువ వారు, మాట తప్పేవారు, జాలి లేనివారు, క్షమించనివారు, దయ చూపనివారు.
[32] ఇలాంటి వాటిని చేస్తూ ఉండేవారు మరణానికి తగినవారనే దేవుని న్యాయనిర్ణయం వారికి తెలిసి కూడా వాటిని చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వాటిని చేస్తూ ఉన్నవారిని మెచ్చుకొంటారు.