Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:11

[1] అలాగైతే నేనడిగేదేమిటంటే, దేవుడు తన ఇస్రాయేల్‌ ప్రజను నిరాకరించాడా? అలా కానే కాదు. ఆ మాటకు వస్తే నేను ఇస్రాయేల్‌వాణ్ణే. అబ్రాహాము సంతానంలో ఒకణ్ణి. బెన్యామీను గోత్రికుణ్ణి.

[2] దేవుడు ముందుగా ఎరిగిన తన ప్రజను త్రోసివేయలేదు. ఏలీయా ఇస్రాయేల్‌కు వ్యతిరేకంగా దేవుని ఎదుట వాదించిన లేఖన భాగంలో చెప్పినది మీకు తెలియదా?

[3] అదేమంటే, “ప్రభూ, వారు నీ ప్రవక్తలను చంపారు, నీ బలిపీఠాలను పడద్రోశారు. నేనొక్కణ్ణే మిగిలాను. వారు నా ప్రాణం కూడా తీయజూస్తున్నారు.”

[4] అయితే దేవుడు అతనికి చెప్పిన సమాధానం ఏమిటంటే, “బయల్‌దేవుడికి మోకరించని ఏడువేలమందిని నా కోసం ప్రత్యేకించి ఉంచుకొన్నాను.”

[5] ఆ విధంగానే, ప్రస్తుత కాలంలో కూడా దేవుని కృపమూలమైన ఏర్పాటు ప్రకారం కొందరు మిగిలి ఉన్నారు.

[6] అది కృపవల్ల గనుక అయితే ఇక క్రియలమూలమైనది కాదు. లేకపోతే కృప ఇక కృపే కాదు. అది క్రియల మూలమైనది అయితే అది ఇక కృపమూలమైనది కాదు, లేకపోతే క్రియ ఇక క్రియ కాదు.

[7] అయితే తేలినదేమిటి? ఇస్రాయేల్‌ప్రజ వెదికేది ఏదో అది వారికి కలగలేదు గాని వారిలో దేవుడు ఎన్నుకొన్నవారికి అది కలిగింది. తక్కినవారికి గుడ్డితనం కలిగింది.

[8] ఇందుకు ఇలా రాసి ఉంది: దేవుడు వారికి నిద్రపోయే మనసు, చూడని కండ్లు, వినని చెవులు నేటివరకు ఇచ్చాడు.

[9] దావీదు చెప్పిన దేమిటంటే, వాళ్ళ భోజనం బల్ల వాళ్ళకు ఉచ్చు, బోను అవుతుంది గాక! అది వాళ్ళకు అడ్డురాయిగా, ప్రతీకారంగా ఉంటుంది గాక!

[10] వాళ్ళు చూడకుండా వాళ్ల కళ్ళకు చీకటి కమ్ముతుంది గాక! వాళ్ళ వీపులు ఎప్పటికీ వంగిపోతాయి గాక!

[11] అందుచేత నేనడిగేదేమిటంటే, వారు పూర్తిగా పడిపోవాలని తొట్రుపడడం జరిగిందా? అలా కానే కాదు గాని, వారి తొట్రుపాటువల్ల ఇతర ప్రజలకు పాపవిముక్తి కలిగింది. తద్వారా ఇస్రాయేల్‌వారికి అసూయ పుట్టాలి అని దేవుని ఉద్దేశం.

[12] వారి తొట్రుపాటు లోకానికి ఐశ్వర్యంగా ఉంటే, వారి భంగపాటు ఇతర ప్రజలకు ఐశ్వర్యంగా ఉంటే, వారి సమృద్ధివల్ల ఇంకా ఎంత ఎక్కువ ఐశ్వర్యం కలుగుతుందో!

[13] ఇతర ప్రజలైన మీతో నేను మాట్లాడుతున్నాను. ఇతర ప్రజలకు దేవుడు పంపిన రాయబారిని నేను, గనుక నా సేవను ఘనపరుస్తున్నాను.

[14] ఎలాగైనా సరే శరీర సంబంధంగా నా జనానికి అసూయ పుట్టించి, వారిలో కొందరికి పాపవిముక్తి కలిగించాలని నా కోరిక.

[15] దేవుడు వారిని త్రోసివేయడం లోకం దేవునితో రాజీపడే స్థితికి కారణం అయితే వారిని స్వీకరించడంవల్ల ఏమి జరుగుతుంది? మృతమైన దానిలో నుంచి జీవమే గదా!

[16] ముద్దలో మొదటి పిడికెడు పవిత్రమైతే ముద్ద కూడా పవిత్రమే. చెట్టువేరు పవిత్రమైతే కొమ్మలు కూడా పవిత్రమే.

[17] అయితే కొమ్మలలో కొన్ని విరిగిపోయాయి. ఇతర ప్రజలైన మీరు అడవి ఆలీవ్ చెట్టుగా మిగిలినవాటి మధ్య అంటుకట్టబడ్డారు. వాటితో కూడా ఆలీవ్ చెట్టువేరు సారంలో పాల్గొన్నారు.

[18] ఇది నిజమైతే ఆ కొమ్మలకు వ్యతిరేకంగా గొప్పలు చెప్పకండి. ఒకవేళ గొప్పలు చెపితే మీరు చెట్టువేరుకు ఆధారం కాదు గాని చెట్టువేరే మీకు ఆధారమని తెలుసుకోండి.

[19] మీరంటారు గదా, “నేను అంటుకట్టబడేందుకే కొమ్మలను విరగ్గొట్టడం జరిగింది!”

[20] సరే గాని, వారు అవిశ్వాసాన్ని బట్టే విరిగిపోయారు, మీరు విశ్వాసాన్నిబట్టే నిలిచి ఉన్నారు. విర్రవీగకండి! భయంతో ఉండండి.

[21] దేవుడు సహజమైన కొమ్మలను విరగొట్టడం నుంచి వెనకకు తగ్గకుండా ఉంటే మిమ్మల్ని విరగొట్టడం నుంచి వెనకకు తగ్గడు.

[22] ఇందులో దేవుని దయ, కాఠిన్యం చూడండి. పతనమైన వారిమీద కాఠిన్యమూ, మీరు దేవుని దయలో నిలిచివుంటే మీమీద దయ చూపుతాడు. నిలిచి ఉండకపోతే మిమ్ములను కూడా నరికివేయడం జరుగుతుంది.

[23] వారేమో ఇంకా అవిశ్వాసంలో సాగుతూ ఉండకపోతే అంటుకట్టబడతారు. వారిని మళ్ళీ అంటుకట్టడానికి దేవుడు సమర్థుడు.

[24] మిమ్ములను సహజమైన అడవి ఆలీవ్ చెట్టునుంచి నరికివేసి మంచి ఆలీవ్‌చెట్టులో అసహజంగా అంటుకట్టడం జరిగిందంటే, ఈ సహజమైన కొమ్మలను తమ సొంత ఆలీవ్‌చెట్టులో అంటుకట్టడం మరీ ఎంతో నిశ్చయంగా జరుగుతుంది గదా!

[25] సోదరులారా, మీ దృష్టిలో మీరే జ్ఞానులమని అనుకోకుండేలా మీరు ఈ రహస్య సత్యం తెలుసుకోకుండా ఉండాలని నా కోరిక కాదు. ఆ సత్యం ఏమంటే ఆలీవ్‌చెట్టులో ఇతర ప్రజల సంఖ్య పూర్తి అయ్యేవరకు ఇస్రాయేల్‌ప్రజలో కొంత భాగానికి గుడ్డితనం కలిగి ఉంది.

[26] ఆ తరువాత ఇస్రాయేల్ ప్రజ అంతటికీ పాపవిముక్తి కలుగుతుంది. దీనికి సమ్మతంగా రాసి ఉన్నదేమిటంటే, విమోచకుడు సీయోను నుంచి వచ్చి యాకోబు జనంలో ఉన్న భక్తిహీనతను తొలగిస్తాడు;

[27] వారి అపరాధాలను తీసివేసేటప్పుడు నేను వారితో చేసే ఒడంబడిక ఇదే.

[28] శుభవార్త విషయమైతే వారు విరోధులు. ఇది మీకోసమే. కానీ దేవుని ఎన్నిక విషయంలో వారు పితరులను బట్టి దేవునికి ప్రియులు.

[29] ఎందుకంటే దేవుడు ఉచితంగా ఇచ్చిన వాటి విషయంలో, ఆయన పిలుపు విషయంలో మార్పు కలగదు.

[30] గతంలో మీరు దేవునికి లోబడనివారు. ఇప్పుడైతే వారు లోబడకపోవడంచేత మీకు కరుణ లభించింది.

[31] అలాగే, ఇప్పుడు వారూ లోబడనివారు గాని మీకు కలిగిన కరుణవల్ల వారికి కూడా కరుణ కలగాలి అని దేవుని ఉద్దేశం.

[32] ఎందుకంటే దేవుడు అందరి మీదా కరుణ చూపాలని అందరినీ లోబడని స్థితిలో మూసివేసి నిర్బంధించాడు.

[33] ఆహా, దేవుని బుద్ధిజ్ఞానాల సమృద్ధి ఎంత లోతైనది! ఆయన న్యాయ నిర్ణయాలు ఎంత అన్వేషించలేనివి! ఆయన మార్గాలు ఎంత జాడ పట్టలేనివి!

[34] ప్రభు మనసు ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పేవాడెవడు?

[35] ఆయన మళ్ళీ ఇవ్వాలని ఆయనకు ముందుగా ఇచ్చిన వాడెవడు?

[36] సమస్తమూ ఆయననుంచీ, ఆయనద్వారా, ఆయనకే. ఆయనకే శాశ్వతంగా మహిమ కలుగుతుంది గాక! తథాస్తు.

రోమ్ వారికి లేఖ — Chapters