Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:54

[1] ఈ సంగతుల తరువాత నలుగురు దేవదూతలు భూమి నలుమూలలో నిలుచుండడం నాకు కనిపించింది. గాలి భూమి మీద గానీ సముద్రం మీద గానీ ఏ చెట్టు మీద గానీ వీచకుండా ఆ దేవదూతలు భూమి నాలుగు దిక్కుల గాలులను అడ్డగిస్తూ ఉన్నారు.

[2] అప్పుడు మరో దేవదూత తూర్పు దిక్కు నుంచి పైకి రావడం చూశాను. జీవం గల దేవుని ముద్ర అతనికి ఉంది. భూమికీ సముద్రానికీ హాని చేయడానికి అధికారం పొందిన ఆ నలుగురు దేవదూతలతో అతడు పెద్ద స్వరంతో ఇలా అన్నాడు:

[3] “మేము మన దేవుని దాసుల నొసళ్ళమీద ముద్ర వేసేవరకు భూమికీ సముద్రానికీ చెట్లకూ హాని చెయ్యకండి.”

[4] ముద్ర పొందినవారి లెక్క నేను విన్నాను – ఇస్రాయేల్ ప్రజల గోత్రాలన్నిటిలో ముద్ర పొందినవారు లక్ష నలభై నాలుగు వేలమంది.

[5] యూదా గోత్రంలో పన్నెండు వేలమంది ముద్ర పొందారు. రూబేను గోత్రంలో పన్నెండు వేలమంది ముద్రపొందారు. గాదు గోత్రంలో పన్నెండు వేలమంది ముద్రపొందారు.

[6] ఆషేరు గోత్రంలో పన్నెండు వేలమంది ముద్ర పొందారు. నఫ్తాలి గోత్రంలో పన్నెండు వేలమంది ముద్ర పొందారు. మనష్షే గోత్రంలో పన్నెండు వేలమంది ముద్ర పొందారు.

[7] షిమ్యోను గోత్రంలో పన్నెండు వేలమంది ముద్ర పొందారు. లేవీ గోత్రంలో పన్నెండు వేలమంది ముద్రపొందారు. ఇశ్శాకారు గోత్రంలో పన్నెండు వేలమంది ముద్ర పొందారు.

[8] జెబూలూను గోత్రంలో పన్నెండు వేలమంది ముద్ర పొందారు. యోసేపు గోత్రంలో పన్నెండు వేలమంది ముద్ర పొందారు. బెన్యామీను గోత్రంలో పన్నెండు వేలమంది ముద్ర పొందారు.

[9] ఈ సంగతుల తరువాత నేను చూస్తూ ఉంటే సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట గొప్ప జన సమూహం నిలుచుండడం కనిపించింది. వారిని లెక్కించడానికి ఏ మనిషికీ చేతకాదు. వారు అన్ని జాతులలోనుంచీ గోత్రాలలోనుంచీ ప్రజలలోనుంచీ భాషలు మాట్లాడేవారిలోనుంచీ వచ్చినవారు. వారు తెల్లని నిలువుటంగీలు తొడుక్కొన్నవారై మట్టలు చేతపట్టుకొని ఉన్నారు.

[10] వారు స్వరమెత్తి బిగ్గరగా ఇలా అన్నారు: “రక్షణ సింహాసనం మీద కూర్చుని ఉన్న మా దేవునికీ గొర్రెపిల్లకూ చెందేది.”

[11] దేవదూతలంతా సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూ నాలుగు ప్రాణుల చుట్టూ నిలుచున్నారు. సింహాసనం ఎదుట సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఇలా అన్నారు:

[12] “తథాస్తు! మా దేవునికి కీర్తీ మహిమా జ్ఞానమూ కృతజ్ఞతలూ గౌరవమూ ప్రభావమూ బలమూ శాశ్వతంగా ఉంటాయి గాక! తథాస్తు!”

[13] అప్పుడు పెద్దలలో ఒకడు జవాబిస్తూ “తెల్లని అంగీలు తొడుక్కొన్న వీరెవరు? ఎక్కడనుంచి వచ్చారు?” అని నాతో అన్నాడు.

[14] “అయ్యా, మీకే తెలుసు” అని నేను అతనితో అన్నాను. అప్పుడతడు నాతో అన్నాడు “వీరు మహా బాధకాలంలో నుంచి వచ్చేవారే. గొర్రెపిల్ల రక్తంలో తమ అంగీలు ఉతుక్కొని తెల్లగా చేసుకొన్నారు.

[15] అందుచేత వారు దేవుని సింహాసనం ఎదుట ఉంటూ, ఆయన ఆలయంలో రాత్రింబగళ్ళు ఆయనకు సేవ చేస్తూ ఉన్నారు. సింహాసనంమీద కూర్చుని ఉన్నవాడు వారిమీద తన గుడారం కప్పుతాడు.

[16] వారికి ఇకనుంచి ఆకలి గానీ దప్పి గానీ ఉండదు. ఎండ గానీ మరే తీవ్రమైన వేడి గానీ వారికి తగలదు.

[17] ఎందుకంటే, సింహాసనం మధ్యన ఉన్న గొర్రెపిల్ల వారికి కాపరి అయి ఉంటాడు, జీవ జలాల ఊటలదగ్గరకు వారిని నడిపిస్తాడు. వారి కళ్ళ నుంచి కన్నీరంతా దేవుడు తానే తుడిచివేస్తాడు.”

ప్రకటన (ప్రత్యక్షం) — Chapters