[1] అప్పుడు కొత్త ఆకాశం, కొత్త భూమి నాకు కనిపించాయి. మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోయాయి. సముద్రం ఇక లేదు.
[2] నేను – యోహానును – పవిత్ర నగరమైన కొత్త జెరుసలం కూడా చూశాను. అది తన భర్తకోసం అలంకరించుకొన్న పెళ్ళికూతురులాగా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గరనుంచి వస్తూ ఉంది.
[3] అప్పుడు పరలోకంనుంచి ఒక గొప్ప స్వరం ఇలా చెప్పగా విన్నాను: “ఇదిగో, దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో నివసిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటూ వారి దేవుడై ఉంటాడు.
[4] దేవుడు వారి కళ్ళలో నుంచి కన్నీళ్ళన్నీ తుడిచివేస్తాడు. అప్పటినుంచి చావు, దుఃఖం, ఏడ్పు ఉండవు. నొప్పి కూడా ఉండదు. పూర్వమున్న విషయాలు గతించిపోయాయి.”
[5] సింహాసనం మీద కూర్చునివున్న వ్యక్తి “ఇదిగో, సమస్తం కొత్త చేస్తున్నాను” అన్నాడు. ఆయన నాతో “ఈ మాటలు సత్యమైనవి, నమ్మతగినవి గనుక ఇవి వ్రాయి” అన్నాడు.
[6] ఆయన నాతో ఇంకా అన్నాడు. “సమాప్తమైంది. నేను ‘అల్ఫా’ను ‘ఓమేగ’ను, ఆదిని, అంతాన్ని. దప్పి అయిన వ్యక్తికి జీవజల ఊటనుంచి ఉచితంగా ఇస్తాను.
[7] జయించే వ్యక్తి అన్నిటికీ వారసుడవుతాడు. నేను అతని దేవుణ్ణయి ఉంటాను. అతడు నా కొడుకై ఉంటాడు.
[8] “కానీ పిరికివారు, విశ్వాసం లేనివారు, అసహ్యులు, హంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహ పూజ చేసేవారు, అబద్ధికులంతా అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది రెండో చావు.”
[9] ఆ చివరి ఏడు ఈతిబాధలతో నిండిన ఏడు పాత్రలు చేతపట్టుకొన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి “ఇటు రా. పెండ్లి కుమార్తెను, అంటే, గొర్రెపిల్ల భార్యను నీకు చూపిస్తాను” అన్నాడు.
[10] అప్పుడతడు దేవుని ఆత్మవశుడైన నన్ను ఎత్తయిన గొప్ప పర్వతానికి కొనిపోయాడు, ఆ గొప్ప నగరమైన పవిత్ర జెరుసలం పరలోకంలో ఉన్న దేవుని దగ్గరనుంచి దిగిరావడం నాకు చూపించాడు.
[11] అది దేవుని మహిమాప్రకాశం గలది. దానిలోని వెలుగు అత్యంత వెలగల రత్నంలాగా, స్వచ్ఛమైన స్ఫటికాన్ని పోలిన సూర్యకాంత మణిలాగా ఉంది.
[12] నగరానికి పన్నెండు ద్వారాలు గల ఎత్తయిన గొప్ప ప్రాకారం ఉంది. ఆ ద్వారాల దగ్గర పన్నెండుమంది దేవదూతలు ఉన్నారు. ఆ ద్వారాలమీద పేర్లు రాసి ఉన్నాయి. ఇస్రాయేల్ ప్రజల పన్నెండు గోత్రాల పేర్లు ఇవి.
[13] తూర్పుగా మూడు ద్వారాలు ఉన్నాయి, ఉత్తరంగా మూడు ద్వారాలు, దక్షిణంగా మూడు ద్వారాలు, పడమరగా మూడు ద్వారాలు ఉన్నాయి.
[14] నగర ప్రాకారానికి పన్నెండు పునాదులున్నాయి. వాటిమీద గొర్రెపిల్ల పన్నెండుమంది రాయబారుల పేర్లు ఉన్నాయి.
[15] నగరం, దాని ద్వారాలు, దాని ప్రాకారం కొలతలు తీసుకోవడానికి నాతో మాట్లాడిన వ్యక్తి దగ్గర బంగారు కొలబద్ద ఉంది.
[16] ఆ నగరం నలు చదరంగా ఉంది – దాని పొడుగు దాని వెడల్పు ఒక్కటే. అతడు ఆ కొలబద్దతో నగరం కొలత తీసుకొన్నాడు. దాని కొలత సుమారు రెండువేల రెండు వందల కిలోమీటర్లు. దాని పొడుగూ వెడల్పూ ఎత్తూ సమానమే.
[17] అతడు దాని ప్రాకారం కూడా కొలత తీసుకొన్నాడు. దాని కొలత మనుషుల కొలత ప్రకారం అంటే ఆ దేవదూత కొలత ప్రకారం నూట నలభై నాలుగు మూరలు.
[18] నగర ప్రాకారం నిర్మించినది సూర్యకాంత మణితో. నగరం స్వచ్ఛమైన గాజులాంటి మేలిమి బంగారం.
[19] నగర ప్రాకారం పునాదులకు అలంకారంగా అన్ని రకాల ప్రశస్త రత్నాలు ఉన్నాయి. మొదటి పునాది సూర్యకాంతం. రెండోది నీలమణి. మూడోది యమునారాయి. నాలుగోది పచ్చ.
[20] అయిదోది వైడూర్యం. ఆరోది కెంపు. ఏడోది సువర్ణ రత్నం. ఎనిమిదోది గోమేధికం. తొమ్మిదోది పుష్యరాగం. పదోది సువర్ణ సునీయం. పదకొండోది పద్మరాగం. పన్నెండోది ఊదామణి.
[21] దాని పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలు. ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క ముత్యం. నగరం వీధి స్వచ్ఛమైన గాజులాంటి మేలిమి బంగారం.
[22] నగరంలో ఏ దేవాలయమూ నాకు కనిపించలేదు. దాని దేవాలయం అమిత శక్తిగలవాడూ ప్రభువూ అయిన దేవుడే, గొర్రెపిల్లే.
[23] నగరం మీద ప్రకాశించడానికి సూర్యుడూ చంద్రుడూ దానికి అక్కర లేనే లేదు. ఎందుకంటే, దేవుని మహిమాప్రకాశమే దానిలో వెలిగిస్తూ ఉంది. గొర్రెపిల్లే దానికి దీపం.
[24] దాని వెలుగులో రక్షించబడ్డ జాతులు నడుస్తాయి. నగరంలోకి భూరాజులు తమ వైభవం, ఘనత తీసుకువస్తారు.
[25] అక్కడ రాత్రి అంటూ ఏమీ ఉండదు గనుక పగలు దాని ద్వారాలు ఎంత మాత్రమూ మూసి ఉండవు.
[26] దానిలోకి వారు జాతుల వైభవం, ఘనత తెస్తారు.
[27] దానిలోకి అపవిత్రమైనదేదీ, అసహ్య కార్యం చేసేవారూ అబద్ధమాడేవారూ రానే రారు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసి ఉన్నవారే దానిలో ప్రవేశిస్తారు.