Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:14

[1] “ఎఫెసులో సంఘం దూతకు ఇలా వ్రాయి: తన కుడిచేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొని ఉన్న వ్యక్తి, ఏడు బంగారు దీప స్తంభాల మధ్య నడుస్తున్న వ్యక్తి చెప్పే విషయాలేవంటే,

[2] నీ క్రియలు, నీ ప్రయాస, నీ సహనం నాకు తెలుసు. దుర్మార్గులు అంటే నీవు ఓర్చుకోలేవని కూడా నాకు తెలుసు. తాము క్రీస్తు రాయబారులు కాకపోయినా రాయబారులమే అని చెప్పినవారిని పరిశీలించి వారు అబద్ధికులని నీవు పసికట్టావు.

[3] నీవు భారంభరిస్తూ ఉన్నావు. నీకు సహనం ఉంది. నా పేరుకోసం ప్రయాసపడుతూ ఉన్నావు గాని అలసిపోలేదు.

[4] “అయినా నీ విషయంలో నాకు అభ్యంతరం ఒకటి ఉంది – మొదట నీకున్న ప్రేమ విడిచిపెట్టావు.

[5] అందుచేత ఏ స్థితినుంచి క్రిందికి పడిపోయావో జ్ఞాపకం చేసుకో. పశ్చాత్తాపపడి మొదటి పనులు చేయి. లేకపోతే, నీవు పశ్చాత్తాపపడకపోతే, నేను త్వరగా నీ దగ్గరకు వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోటునుంచి తీసివేస్తాను.

[6] అయినా ఈ విషయం నీలో ఉంది – నీకొలాయితులు అనేవారి చర్యలు అసహ్యించుకొంటున్నావు. అవంటే నాకు కూడా అసహ్యమే.

[7] “సంఘాలకు దేవుని ఆత్మ చెప్పేది చెవి గలవాడు వింటాడు గాక! జయించే వ్యక్తికి దేవుని పరమానంద నివాసంలో ఉన్న జీవవృక్ష ఫలం తినడానికి ఇస్తాను.

[8] “స్ముర్నలో ఉన్న సంఘం దూతకు ఇలా వ్రాయి: మొదటివాడూ చివరివాడూ చనిపోయి మళ్ళీ బ్రతికినవాడూ అయిన వ్యక్తి చెప్పేవిషయాలేవంటే,

[9] నీ పనులు, బాధలు, దరిద్రం నాకు తెలుసు – అసలు నీవు ధనవంతుడివే! తాము యూదులు కాకపోయినా యూదులమే మేము అని చెప్పినవారి దూషణ కూడా నాకు తెలుసు. వారు సైతాను సమాజం.

[10] నీకు రాబోయే కష్టాలకు భయపడకు. ఇదిగో విను, అపవాద పిశాచం మీలో కొందరిని ఖైదులో వేయించ బోతున్నాడు. ఇది మీ పరీక్షకోసమే. పది రోజులపాటు మీరు బాధలకు గురి అవుతారు. మరణంవరకు నమ్మకంగా ఉండు. నీకు జీవ కిరీటం ఇస్తాను.

[11] “సంఘాలకు ఆత్మ చెప్పేది చెవి ఉన్నవాడు వింటాడు గాక! జయించే వ్యక్తికి రెండో మరణంవల్ల ఏమీ హాని కలగదు.

[12] “పెర్గములో ఉన్న సంఘం దూతకు ఇలా వ్రాయి: పదును గల రెండంచుల ఖడ్గం ఉన్న వ్యక్తి చెప్పే విషయాలేవంటే,

[13] నీ పనులు, నీ నివాస స్థలం నాకు తెలుసు. అది సైతాను సింహాసనమున్న స్థలం. అయినా నీవు నా పేరును గట్టిగా చేపట్టి ఉన్నావు. సైతాను నివాసముంటున్న ఆ స్థలంగా నా నమ్మకమైన సాక్షి అంతిపాస్ హతమైన రోజులలో కూడా నాగురించిన విశ్వాసం నీవు కాదనలేదు.

[14] “అయినా నీ విషయంలో నాకు అభ్యంతరాలు కొన్ని ఉన్నాయి. అవేమంటే, బిలాం బోధన అనుసరించేవారు కొందరు అక్కడ మీ మధ్య ఉన్నారు. అతను విగ్రహాలకు బలి చేసినవాటిని తినేలా, వ్యభిచారం చేసేలా ఇస్రాయేల్ ప్రజలకు ఉరి ఒడ్డాలని బాలాకుకు నేర్పాడు.

[15] అలాగే నీకొలాయితుల బోధన అనుసరించేవారు కొందరు కూడా మీమధ్య ఉన్నారు. అదంటే నాకు అసహ్యం.

[16] కనుక పశ్చాత్తాపపడు, లేదా, నేను నీ దగ్గరకు త్వరగా వచ్చి నా నోటి ఖడ్గంతో వారిమీద యుద్ధం జరిగిస్తాను.

[17] “సంఘాలకు ఆత్మ చెప్పేది చెవి ఉన్నవాడు వింటాడు గాక! జయించే వ్యక్తికి తినడానికి మరుగైన మన్నా నేనిస్తాను. ఒక తెల్లని రాయి కూడా ఇస్తాను. ఆ రాయిమీద కొత్త పేరు ఒకటి రాసి ఉంటుంది. అది పొందే వ్యక్తికే ఆ పేరు తెలుస్తుంది గాని మరెవరికీ కాదు.

[18] “తుయతైరలో ఉన్న సంఘం దూతకు ఇలా వ్రాయి: “మంటల్లాంటి కళ్ళూ మెరుస్తున్న కంచులాంటి పాదాలూ ఉన్న దేవుని కుమారుడు చెప్పే విషయాలేవంటే,

[19] నీ క్రియలు, ప్రేమ, విశ్వాసం, సేవ, నీ సహనం నాకు తెలుసు. నీ మొదటి క్రియలకంటే ఇప్పటివి ఎక్కువే అని కూడా నాకు తెలుసు.

[20] “అయినా నీ విషయంలో నాకు అభ్యంతరాలు కొన్ని ఉన్నాయి. అవేమంటే తాను ప్రవక్తినని చెప్పుకొంటున్న యెజెబెల్ అనే స్త్రీని ఉండనిస్తున్నావు. ఆమె నా దాసులకు వ్యభిచారం చేయడానికీ, విగ్రహాలకు బలి చేసినవాటిని తినడానికీ నేర్పుతూ తప్పుదారి పట్టిస్తూ ఉంది.

[21] ఆమె వ్యభిచారం గురించి పశ్చాత్తాపపడడానికి ఆమెకు నేను సమయమిచ్చాను గాని ఆమె పశ్చాత్తాపపడలేదు.

[22] ఇదిగో విను, ఆమెను మంచం పట్టిస్తాను. ఆమెతో వ్యభిచరించినవారు తమ పనుల గురించి పశ్చాత్తాప పడకపోతే వారిని మహా బాధలో త్రోసివేస్తాను.

[23] ఆమె పిల్లలను చంపితీరుతాను. అంతరంగాలనూ హృదయాలనూ పరిశీలించే వాణ్ణి నేనే అని అప్పుడు అన్ని సంఘాలకూ తెలిసిపోతుంది. మీలో ప్రతి ఒక్కరికీ తన క్రియలకు తగిన దానిని ఇస్తాను.

[24] అయితే నీతోను తుయతైరలో తక్కిన వారితో, అంటే ఆ బోధన అంగీకరించకుండా, వారు చెప్పుకొన్న “సైతాను గూఢమైన విషయాలు” ఎరగని మీతో నేను చెప్పేదేమంటే, మీ మీద మరే భారం పెట్టను.

[25] నేను వచ్చేంతవరకు మీకున్న దానిని గట్టిగా చేపట్టుకోండి.

[26] “జయించే వ్యక్తికి, అంతంవరకు నా క్రియలు పాటించే వ్యక్తికి జనాలమీద అధికారం ఇస్తాను.

[27] అతడు వారిని ఇనుప దండంతో పరిపాలిస్తాడు. వారు కుమ్మరి కుండలలాగా ముక్కచెక్కలై పోతారు. తండ్రి నాకు కూడా ఇది ఇచ్చాడు.

[28] ఇంతేకాదు, ఆ వ్యక్తికి వేకువచుక్కను ఇస్తాను.

[29] సంఘాలకు ఆత్మ చెప్పేది చెవి గలవాడు వింటాడు గాక!

ప్రకటన (ప్రత్యక్షం) — Chapters