Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:02

[1] నేనింకా చూస్తూ ఉంటే సీయోను పర్వతం మీద గొర్రెపిల్ల నిలుచుండడం కనిపించింది. ఆయనతో పాటు లక్ష నలభై నాలుగు వేలమంది ఉన్నారు. వారి నొసళ్ళమీద ఆయన తండ్రి పేరు రాసి ఉంది.

[2] అప్పుడు పరలోకంనుంచి ఒక శబ్దం నాకు వినిపించింది. అది అనేక జలాల ధ్వనిలాంటిది, గొప్ప ఉరుము ధ్వనిలాంటిది. నేను తంతివాద్యాలు వాయిస్తున్నవారి తంతి వాదనం విన్నాను.

[3] వారు సింహాసనం ముందర, ఆ నాలుగు ప్రాణుల ముందర, ఆ పెద్దల ముందర కొత్త పాట ఒకటి పాడారు. ఈ లక్ష నలభై నాలుగు వేలమంది తప్ప మరెవ్వరూ ఆ పాట నేర్చుకోలేకపోయారు. వీరు భూలోకంలోనుంచి విమోచించ బడ్డవారు.

[4] వీరు పెళ్ళి కానివారై స్త్రీలతో తమను తాము అపవిత్రం చేసుకోనివారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినా సరే వీరు ఆయన వెంటవెళ్తూ ఉన్నారు. వీరు మనుషులలో నుంచి విమోచించబడి దేవునికీ గొర్రెపిల్లకూ తొలి పంటగా ఉన్నారు.

[5] వీరి నోట ఏ మోసమూ కనబడలేదు. దేవుని సింహాసనం ముందర వీరిలో నిందించతగిన విషయమేమీ లేదు.

[6] అప్పుడు మరో దేవదూత ఆకాశం మధ్యన ఎగిరిపోతూ ఉండడం నాకు కనిపించింది. అతడు భూమిమీద నివసించేవారికి – ప్రతి దేశంవారికీ ప్రతి జాతికీ ప్రతి భాష మాట్లాడేవారికీ ప్రతి జనానికీ ప్రకటించడానికి శాశ్వత శుభవార్త గలవాడు.

[7] అతడు పెద్ద స్వరంతో చెప్పినదేమిటంటే, “దేవునికి భయపడండి! ఆయనకు మహిమ చేకూర్చండి! ఆయన తీర్పు ఘడియ వచ్చింది! ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ నీళ్ళ ఊటలనూ కలగజేసిన ఆయనను ఆరాధించండి!”

[8] అతని వెంట మరో దేవదూత వచ్చి ఇలా చెప్పాడు: “మహా నగరమైన బబులోను కూలిపోయింది! కూలిపోయింది! అది తన వ్యభిచార ఆగ్రహ ద్రాక్షమద్యం జనాలన్నిటికీ తాగించింది!”

[9] వారి వెంట మూడో దేవదూత వచ్చి పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు: “ఎవరైనా సరే ఆ మృగాన్నీ వాడి విగ్రహాన్నీ పూజిస్తే, నొసటిమీద గానీ చేతిమీద గానీ వాడి ముద్ర పడనిస్తే

[10] ఆ వ్యక్తి దేవుని ఆగ్రహ ద్రాక్షమద్యం త్రాగుతాడు. దానిని దేవుడు తన ఉగ్రత పాత్రలో కల్తీ లేకుండా పోశాడు. అంతే కాక, ఆ వ్యక్తిని పవిత్ర దేవదూతల ముందర, గొర్రెపిల్ల ముందర అగ్నిగంధకాలతో వేధించడం జరుగుతుంది.

[11] వారి వేదన సంబంధమైన పొగ యుగయుగాలకు పైకి లేస్తూ ఉంటుంది. మృగాన్నీ వాడి విగ్రహాన్నీ పూజించేవారికీ వాడి పేరు ముద్ర పడనిచ్చినవారికీ రాత్రింబగళ్లు ఏమీ విశ్రాంతి లేదు.”

[12] ఇలాంటప్పుడు పవిత్రుల సహనం ఉంది; ఇలాంటప్పుడు దేవుని ఆజ్ఞలూ యేసు విశ్వాస సత్యాలూ పాటించే వారు ఉన్నారు.

[13] అప్పుడు పరలోకంనుంచి ఒక స్వరం నాకు వినిపించి “ఈ విధంగా రాయి: ఇప్పటినుంచి ప్రభువులో ఉంటూ చనిపోయేవారు ధన్యులు” అంది. “అవును, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి అనుభవిస్తారు. వారి క్రియలు వారి వెంట వస్తాయి” అని దేవుని ఆత్మ చెపుతున్నాడు.

[14] నేను చూస్తూ ఉంటే, తెల్లని మేఘం, ఆ మేఘం మీద మానవ పుత్రుడిలాంటి వ్యక్తి ఒకరు కూర్చుని ఉండడం నాకు కనిపించింది. ఆయన తలమీద బంగారు కిరీటం ఉంది, ఆయన చేతిలో వాడిగల కొడవలి ఉంది.

[15] మరో దేవదూత దేవాలయంలోనుంచి వచ్చి మేఘంమీద కూర్చుని ఉన్న వ్యక్తితో బిగ్గరగా ఇలా అన్నాడు: “భూమి పంట పండింది, నీవు కోత కోసే కాలం వచ్చింది, గనుక నీ కొడవలి పెట్టి కోసుకో.”

[16] మేఘంమీద కూర్చుని ఉన్న వ్యక్తి భూమిమీద తన కొడవలి పెట్టాడు. వెంటనే భూమి పంట కోయబడింది.

[17] అప్పుడు పరలోకంలో ఉన్న దేవాలయంలోనుంచి మరో దేవదూత వచ్చాడు. ఇతనిదగ్గర కూడా వాడిగల కొడవలి ఉంది.

[18] మరో దేవదూత వేదిక దగ్గరనుంచి వచ్చాడు. ఇతడు నిప్పుమీద అధికారం ఉన్నవాడు. ఇతడు వాడిగల కొడవలి గలవానితో పెద్ద స్వరంతో ఇలా అన్నాడు: “భూమి ద్రాక్షపండ్లు పండాయి, గనుక వాడిగల నీ కొడవలి పెట్టి ద్రాక్షచెట్టునుంచి దాని గెలలు కోయండి.”

[19] ఆ దేవదూత తన కొడవలి భూమిమీద పెట్టి దాని ద్రాక్ష చెట్టు కోసి దేవుని ఉగ్రత మహా ద్రాక్ష గానుగతొట్టిలో పడవేశాడు.

[20] ఆ ద్రాక్ష గానుగ నగరం బయట తొక్కడం జరిగింది. గానుగలోనుంచి రక్తం వచ్చి సుమారు మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరం, గుర్రం కళ్ళెమంత ఎత్తు పారింది.

ప్రకటన (ప్రత్యక్షం) — Chapters