[1] ఏడు పాత్రలు ఉన్న ఆ ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుతూ నాతో ఇలా అన్నాడు: “ఇటు రా. అనేక జలాల మీద కూర్చుని ఉన్న మహా వేశ్యమీదికి వచ్చే తీర్పు నీకు చూపిస్తాను.
[2] ఆ వేశ్యతో భూరాజులు వ్యభిచరించారు. దాని వ్యభిచార ద్రాక్షమద్యంచేత భూనివాసులు మత్తిల్లారు.”
[3] అప్పుడతడు దేవుని ఆత్మవశుడైన నన్ను ఎడారిలోకి తీసుకుపోయాడు. అక్కడ ఎర్రని మృగంమీద కూర్చుని ఉన్న ఒక స్త్రీ నాకు కనిపించింది. ఆ మృగంమీద అంతటా దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి. దానికి ఏడు తలలూ పది కొమ్ములూ ఉన్నాయి.
[4] ఆ స్త్రీ ఊదా, ఎర్రని బట్టలు తొడుక్కొన్నది. బంగారం, విలువైన రాళ్ళు, ముత్యాలు ఆమెకు అలంకారం. ఆమె చేతిలో బంగారు పాత్ర ఒకటి ఉంది. అది అసహ్యమైన వాటితో, ఆమె వ్యభిచార సంబంధమైన మాలిన్యంతో నిండి ఉంది.
[5] ఆమె నొసట ఈ పేరు రాసి ఉంది. రహస్యం – మహా బబులోను, వేశ్యలకూ భూలోక అసహ్యమైన వాటికీ తల్లి
[6] ఆ స్త్రీ పవిత్రుల రక్తంచేత, యేసు హతసాక్షుల రక్తంచేత మత్తిల్లి ఉండడం చూశాను. ఆమెను చూచి నేను అధిక విస్మయంతో ఆశ్చర్యపడ్డాను.
[7] అప్పుడా దేవదూత నాతో ఇలా అన్నాడు: నీవెందుకు ఆశ్చర్యపడ్డావు? ఆ స్త్రీని గురించిన రహస్య సత్యం, ఏడు తలలూ పది కొమ్ములూ ఉండి ఆ స్త్రీని మోస్తున్న మృగాన్ని గురించిన రహస్య సత్యం కూడా వివరిస్తాను.
[8] నీవు చూచిన ఆ మృగం పూర్వం ఉంది గాని ఇప్పుడు లేదు. అది అగాధంలోనుంచి పైకి వస్తుంది, నాశనానికి పోతుంది. పూర్వం ఉండి ఇప్పుడు లేని – అయినా ఉన్న – ఆ మృగాన్ని చూచేటప్పుడు భూనివాసులు, అంటే ప్రపంచానికి పునాది కుదిరినప్పటినుంచి జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాసి ఉండలేదో వారు ఆశ్చర్యపోతారు.
[9] “ఇందుకు జ్ఞానం గల మనసు అవసరం. ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చుని ఉన్న ఏడు కొండలు.
[10] అంతే కాదు, ఏడుగురు రాజులు ఉన్నారు. వారిలో అయిదుగురు కూలిపోయారు, ఒకడున్నాడు, మరొకడు ఇంకా రాలేదు. వచ్చినప్పుడు అతడు కొద్ది కాలం ఉండాలి.
[11] పూర్వముండి ఇప్పుడు లేని ఆ మృగం ఎనిమిదో రాజు, అయినా ఆ ఏడుగురిలో ఒకడు. అతడు నాశనానికి పోతాడు.
[12] “నీవు చూచిన ఆ పది కొమ్ములు వేరే పదిమంది రాజులు. వారికింకా రాజ్యం కలగలేదు. కానీ ఒక్క ఘడియ రాజులుగా ఉండడానికి ఆ మృగంతోపాటు వారికి అధికారం లభిస్తుంది.
[13] వీరంతా ఒకే ఉద్దేశం కలిగి తమ బలప్రభావాలూ అధికారమూ మృగానికిస్తారు.
[14] వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు గాని గొర్రెపిల్ల వారిని ఓడిస్తాడు. ఎందుకంటే, ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, ఆయనతో ఉన్నవారు పిలుపు అందినవారు, ఎన్నికైనవారు, నమ్మకమైనవారు.”
[15] అతడు నాతో ఇంకా అన్నాడు: “నీవు చూచిన జలాలు – వేశ్య కూర్చుని ఉన్న ఆ జలాలు ప్రజలూ జన సమూహాలూ, జాతులూ, ఆయా భాషలవారు.
[16] “ఆ మృగం మీద ఆ పది కొమ్ములు చూశావు. అవి ఆ వేశ్యను ద్వేషించి ఆమెను దిక్కులేనిదిగా, దిగంబరంగా చేసి ఆమె మాంసం తిని నిప్పంటించి ఆమెను కాల్చివేస్తాయి.
[17] ఎందుకంటే తన మాటలు నెరవేరేంతవరకు వారు ఏకీభవించి వారి రాజ్యం ఆ మృగానికివ్వాలనీ తన సంకల్పం నెరవేర్చాలనీ దేవుడు అది వారి హృదయాల్లో ఉంచాడు.
[18] “నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులను పరిపాలిస్తూ ఉన్న ఆ మహా నగరమే.”