[1] బలిష్ఠుడైన వేరొక దేవదూత పరలోకంనుంచి దిగి రావడం నాకు కనిపించింది. ఆయన మేఘం ధరించుకొని ఉన్నాడు. ఆయన తలకు పైగా రంగుల విల్లు ఉంది. ఆయన ముఖం సూర్యమండలంలాంటిది. ఆయన కాళ్ళు నిప్పు స్తంభాలలాంటివి.
[2] ఆయన చేతిలో చుట్టిన చిన్న పత్రం ఒకటి ఉంది. అది విప్పి ఉంది. ఆయన తన కుడి పాదం సముద్రంమీద, ఎడమ పాదం నేలమీద మోపి
[3] పెద్ద స్వరంతో కేక వేశాడు. అది సింహం గర్జించినట్టు ఉంది. ఆయన కేక వేసినప్పుడు ఏడు ఉరుముల స్వరాలు పలికాయి.
[4] ఆ ఏడు ఉరుముల స్వరాలు పలికినప్పుడు నేను రాయబోయాను గాని పరలోకంనుంచి ఒక స్వరం నాతో ఇలా అనడం విన్నాను: “ఏడు ఉరుములు పలికిన విషయాలు మూసివేయి. వాటిని రాయకు.”
[5] నేను చూచినప్పుడు సముద్రం మీదా నేలమీదా నిలబడ్డ ఆ దేవదూత తన చేయి ఆకాశంవైపు ఎత్తాడు,
[6] పరలోకాన్నీ అందులో ఉన్నవాటినీ భూమినీ అందులో ఉన్నవాటినీ సముద్రాన్నీ అందులో ఉన్నవాటినీ సృజించిన, శాశ్వతంగా జీవిస్తూ ఉన్న వ్యక్తి తోడని ఇలా శపథం చేశాడు:
[7] ఇక ఆలస్యం కాదు. ఏడో దేవదూత బూర ఊది వినిపించే రోజులలో అతడు బూర ఊదబోతూ ఉంటే, దేవుని రహస్య సత్యం పూర్తిగా నెరవేరుతుంది. ఇది ప్రవక్తలైన తన దాసులకు ఆయన ప్రకటించినట్టే జరుగుతుంది.”
[8] పరలోకంనుంచి నాకు వినిపించిన స్వరం మళ్ళీ నాతో మాట్లాడి “వెళ్ళి సముద్రంమీదా నేలమీదా నిలుచున్న దేవదూత చేతిలో విప్పి ఉన్న పత్రం తీసుకో” అని పలికింది.
[9] అందుచేత నేనా దేవదూత దగ్గరకు వెళ్ళి ఆయనతో “ఆ చిన్న పత్రం నాకివ్వండి” అన్నాను. అప్పుడాయన నాతో “ఇది తీసుకొని తిను. ఇది నీ కడుపులో చేదవుతుంది గాని నీ నోట్లో మాత్రం ఇది తేనెలాగా తియ్యగా ఉంటుంది” అన్నాడు.
[10] దేవదూత చేతిలోనుంచి ఆ చిన్న పత్రం తీసుకొని దానిని తినివేశాను. నా నోట్లో అది తేనెలాగా తియ్యగా ఉంది గాని అది తిన్న తరువాత నా కడుపులో చేదైపోయింది.
[11] అప్పుడాయన నాతో “మరో సారి అనేక ప్రజలు, జనాలు, భాషలు, రాజులను గురించి నీవు దేవుని మూలంగా పలకాలి” అన్నాడు.