Skip to content
Opens in a new window

[1] జ్ఞానులకు ఎవరు సాటి? విషయ పరిజ్ఞాన వివరణ ఇంకెవరికి తెలుసు? జ్ఞానం మనిషికి ముఖ వర్చస్సు కలిగిస్తుంది. మనిషి ముఖంలో కరుకుదనం జ్ఞానంచేత మారిపోతుంది.

[2] నేను చెప్పేదేమిటంటే, రాజాజ్ఞను నీవు పాటించాలి. ఎందుకంటే, నీవు దేవుని ఎదుట శపథం చేశావు.

[3] రాజుయెదుటనుంచి తొందరపడి వెళ్ళిపోవద్దు. చెడుగులో పాలు పొందకు. రాజు ఇష్టపడితే ఏదైనా చేస్తాడు.

[4] రాజు మాట అధికారంతో వస్తుంది. నీవేమి చేస్తున్నావని రాజును అడిగేవాడెవడు?

[5] ఆజ్ఞ శిరసావహించేవారికి కీడేమీ కలగదు. జ్ఞానికి సమయమేదో, యుక్త విధానమేదో అంతరంగంలో తెలుసు.

[6] ప్రతి దానికి సమయం ఉంది, యుక్త విధానమూ ఉంది. అయినా మనుషుల దుర్దశ గొప్పది.

[7] ఏమి జరగబోతుందో మనుషులకు తెలియదు. అది ఎలా జరుగుతుందో ఎవరు చెప్పగలరు?

[8] గాలి వీచకుండా చెయ్యాలంటే, దానిమీద శాసనాధికారం ఎవరికీ లేదుగా. అలాగే తన మరణదినం మీద ఎవరికీ అధికారం లేదు. ఈ యుద్ధంలో విడుదల దొరకదు. దుర్మార్గం దాన్ని అనుసరించేవాళ్ళను తప్పించదు.

[9] సూర్య మండలం క్రింద ఒకడిమీద ఒకడు పెత్తనం చేసి పరస్పర హాని తెచ్చిపెట్టే ఈ కాలంలో, జరిగే ప్రతి పనీ నేను మనస్ఫూర్తిగా పరిశీలించాను. ఇదంతా నేను తెలుసుకొన్నాను.

[10] ఇది కూడా నేను చూశాను – దుర్మార్గులు చనిపోతే వాళ్ళకు అంత్యక్రియలు జరుగుతాయి. వాళ్ళు దేవుని పవిత్ర ఆలయానికి క్రమంగా వస్తూ పోతూ ఉండేవాళ్ళు. ఊళ్ళోవాళ్ళంతా వారిని ఇట్టే మరచిపోతారు. ఇది కూడా వ్యర్థమే.

[11] దుర్మార్గానికి తగిన తీర్పు త్వరగా రాకపోయేసరికి మనుషులు భయం లేకుండా బరితెగి కావాలని చెడు పనులు చేయసాగుతారు.

[12] నూరు సార్లు చెడుగు చేసిన పాపులు దీర్ఘాయుష్షు కలిగి బ్రతికినా, దేవుని పట్ల, ఆయన సన్నిధానంలో భయభక్తులున్నవారికే క్షేమం ఉంటుందని నాకు తెలుసు.

[13] దుర్మార్గులకు దేవుడంటే భయభక్తులుండవు గనుక వాళ్ళకు క్షేమం ఉండదు. వాళ్ళు నీడలాగా తమ జీవితాన్ని పొడిగించుకోలేరు. ఇది కూడా నాకు తెలుసు.

[14] భూమిమీద మరో వ్యర్థ క్రియ జరుగుతూ ఉంది. అదేమిటంటే, అప్పుడప్పుడు దుర్మార్గులకు తమ క్రియలనుబట్టి సంభవించవలసినది సన్మార్గులకు సంభవిస్తుంది. సన్మార్గులకు తమ క్రియలను బట్టి సంభవించవలసినది దుర్మార్గులకు సంభవిస్తుంది. ఇది కూడా వ్యర్థమని తోస్తుంది నాకు.

[15] హాయిగా అన్నపానాలు పుచ్చుకొని సంతోషించాలి మనిషి. సూర్యమండలం క్రింద ఇంతకంటే లాభసాటి విశేషం మరొకటి లేదు. అందుచేత సంతోషాన్ని నేను ప్రశంసిస్తాను. సూర్యమండలం క్రింద మనిషి కష్టపడి బ్రతకాలని దేవుడు నిర్ణయించిన కాలమంతా అతడికి తోడు వచ్చేది సంతోషమే.

[16] జ్ఞానాభ్యాసం చేయాలనీ, రాత్రింబగళ్ళు కండ్లకు నిద్ర అంటే ఏమిటో తెలియకుండా మనుషులు చేస్తూ ఉన్న కృషి చూడాలనీ నా మనసును దీనిమీద లగ్నం చేశాను.

[17] దేవుడు చేస్తున్నదంతా నేను చూశాను. సూర్యమండలంక్రింద జరిగేవి మనుషులకు అర్థం కావు. ఎంత ప్రయత్నించినా, వారు గ్రహించరు. ఎవడో ఒక జ్ఞాని “నేను గ్రహించాను” అని చెప్పినా అతడు గ్రహించలేడు.

ప్రసంగి — Chapters