[1] ప్రతిదానికీ సరైన సమయం ఉంటుంది. ఆకాశం క్రింద జరిగే ప్రతి విషయానికీ యుక్త సమయం ఉంటుంది.
[2] పుట్టడానికీ చావడానికీ, నాటడానికీ నాటినదాన్ని పీకివేయడానికీ సమయం ఉంటుంది.
[3] చంపడానికీ బాగు చేయడానికీ, పడగొట్టడానికీ కట్టడానికీ సమయం ఉంటుంది.
[4] ఏడవడానికీ నవ్వడానికీ, శోకించడానికీ నాట్యం చెయ్యడానికీ సమయం ఉంటుంది.
[5] రాళ్ళు పారవేయడానికీ వాటిని సమకూర్చడానికీ, కౌగలించడానికీ మానడానికీ సమయం ఉంటుంది.
[6] వెదకడానికీ పోగొట్టుకోవడానికీ, దాచిపెట్టడానికీ పారవేయడానికీ సమయం ఉంటుంది.
[7] చించడానికీ కుట్టడానికీ, మౌనంగా ఉండడానికీ మాట్లాడడానికీ సమయం ఉంటుంది.
[8] ప్రేమించడానికీ ద్వేషించడానికీ, యుద్ధానికీ శాంతికీ సమయం ఉంటుంది.
[9] మనిషి పని చేస్తే అతడి పరిశ్రమవల్ల కలిగే ఫలితం ఏమిటి?
[10] మనుషులు కష్టపడాలని దేవుడు వారికి నియమించిన ప్రయాసను నేను చూశాను.
[11] దేని సమయంలో అది చక్కగా ఉండేలా దేవుడు సమస్తాన్నీ నియమించాడు. ఆయన శాశ్వతత్వాన్ని మనుషుల హృదయంలో ఉంచాడు. అయినా దేవుని క్రియాకలాపాలను మనుషులు పూర్తిగా తెలుసుకోలేరు.
[12] మనుషులు సంతోషంగా ఉండి, బ్రతికినంతవరకూ మేలు చేస్తూ ఉండాలి. మనుషులకు ఇంతకంటే క్షేమకరమైనది మరొకటి లేదని నాకు తెలుసు.
[13] అంతే గాక, ఒక వ్యక్తి అన్నపానాలు పుచ్చుకొంటూ, తన ప్రయాసమంతట్లో తృప్తిపడితే అది దేవుని ఉచిత బహుమానమే.
[14] దేవుడు చేసే పనులన్నీ ఎప్పటికీ నిలుస్తాయని నాకు తెలుసు. వాటికి ఏదీ చేర్చలేము. వాటిలోనుంచి ఏదీ తీసివెయ్యలేము. దేవుడు ఇలా చేయడంలో ఆయన ఆశయమేమంటే మనుషులు ఆయనపట్ల భయభక్తులు చూపాలని.
[15] ఇప్పుడు జరుగుతున్నది ఇంతకు మునుపు జరిగినదే. ఇకముందు జరగబోయేది పూర్వం ఉన్నదే. మునుపున్నదాన్ని మళ్ళీ ఉండేలా దేవుడు చేస్తాడు.
[16] సూర్యమండలం క్రింద మరో విషయం గమనించాను – తీర్పు తీర్చే స్థానంలో దుర్మార్గం జరుగుతూ ఉంది. న్యాయానికి బదులు దుర్మార్గం ప్రవర్తిల్లుతుంది.
[17] నా హృదయంలో అనుకొన్నాను: ప్రతి ఉద్యమానికీ, ప్రతి పనికీ సమయం అంటూ ఉంది. అయితే సన్మార్గులకూ దుర్మార్గులకూ దేవుడు తీర్పు తీరుస్తాడు.
[18] మనుషుల విషయం మరో ఆలోచన నాకు వచ్చింది – మనుషులు తాము పశుప్రాయులని గ్రహించేలా దేవుడు వారిని విషమ పరీక్షలకు గురి చేస్తాడు.
[19] మనుషులకూ, మృగాలకూ జరిగేది ఒకటే. ఒకే పరిస్థితి సంభవిస్తుంది – జంతువులు చచ్చినట్టే మనుషులూ చస్తారు. జీవులన్నిటికీ ఊపిరి ఒక్కటే. జంతువులకంటే మనుషులకు ఎక్కువ ఏమి ఉంది? అంతా వ్యర్థం!
[20] అంతా పోయేది ఒకే చోటికి. సమస్తమూ మట్టిలోనుంచి పుట్టింది. తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది.
[21] మనుషుల ప్రాణం పైకి ఎక్కిపోతుందా? జంతువుల ప్రాణం భూమిలోకి దిగిపోతుందా? ఏమో ఎవరికి తెలుసు?
[22] మనిషి కాలం చేసిన తరువాత ఏమి జరుగుతుందో చూడడానికి అతణ్ణి ఎవరు తిరిగి తెస్తారు? గనుక మనుషులు తాము చేసిన పనులను బట్టి ఆనందించడంకంటే క్షేమకరమైనది ఇంకొకటి లేదని గ్రహించాను. ఇదే వారి భాగం.