Skip to content
Opens in a new window

[1] పరిమళ తైలంలో ఈగలు పడి చస్తే దానికి దుర్వాసన ఉంటుంది. త్రాసులో పెట్టి తూస్తే మూర్ఖత్వం కొంచెమైనా, గౌరవాన్నీ జ్ఞానాన్నీ తేలగొడుతుంది.

[2] జ్ఞాని హృదయం అతడి కుడి చెయ్యి చేత పని చేయిస్తుంది. మూర్ఖుడి హృదయం అతడి ఎడమ చెయ్యి చేత పని చేయిస్తుంది.

[3] మూర్ఖులకు మార్గంలో సరిగా నడుచుకోవడానికి కూడా చాలినంత బుద్ధి లేదు. తమ తెలివితక్కువతనాన్ని అందరికీ ప్రదర్శిస్తారు.

[4] పాలకుడికి నీమీద కోపం వచ్చిందనుకో, కొలువు వదిలిపెట్టి పోవద్దు. వినయంతో ప్రవర్తిస్తే ఘోరమైన తప్పులు మరవబడతాయి.

[5] సూర్యమండలం క్రింద జరిగే మరో చెడుగు నేను చూశాను. పరిపాలకులు పొరపాటున ఈ చెడుగు చేయవచ్చు.

[6] అదేమిటంటే, తెలివితక్కువవాళ్ళను పెద్ద ఉద్యోగాలలో ఉంచుతారు. గొప్పవారు క్రింద ఉన్నారు.

[7] బానిసలు గుర్రాలెక్కుతారు, ఘనులు దాసుల్లాగా క్రింద నడుస్తారు. ఇది నేను చూశాను.

[8] ఎవడు తవ్వుకొన్న గోతిలో వాడే పడవచ్చు. కంచె కొట్టేవాణ్ణి పాము కాటు వేయవచ్చు.

[9] రాళ్ళు దొర్లించేవాడికి రాళ్ళమూలంగా గాయాలు తగలవచ్చు. చెట్లను నరికేవాడికి వాటిమూలంగా అపాయం ఉంది.

[10] మొద్దుబారిపోయిన ఇనుప పనిముట్టును పదును పెట్టకపోతే, పనివాడికి ఎక్కువ బలం అవసరం. సఫలమైన పనికి జ్ఞానం ప్రధానం.

[11] పాము మంత్రం పామును కట్టువేయకముందు అది కరిస్తే, మంత్రగాడివల్ల ఉపయోగం లేదు.

[12] జ్ఞాని పలికే వాక్కులు వినడానికి ఇంపుగా ఉంటాయి. మూర్ఖుడి మాటలు వాణ్ణే దిగమింగివేస్తాయి.

[13] మూర్ఖుడు ఆరంభంలోనే తెలివితక్కువగా మాట్లాడుతాడు. ముగింపులో వాడి మాటల్లో ఘోరమైన వెర్రితనం ఉట్టిపడుతుంది.

[14] ఏమి జరగబోతుందో మనుషులకు తెలియదు అయినా, తెలివితక్కువవాళ్ళు ఎక్కువ వాగుతారు. మనిషి చనిపోయాక ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు?

[15] తన ప్రయాస మూర్ఖుడికి ఆయాసం కలిగిస్తుంది. ఊరికి పోవాలంటే, వాడికి త్రోవ తెలియదు.

[16] దేశానికి బానిస రాజైతే, దేశాధికారులు ప్రొద్దున్నే తిండికి పడిగాపులు పడేవారైతే, ఆ దేశానికి అగచాట్లు తప్పవు.

[17] గొప్ప వంశంనుంచి వచ్చినవారు దేశానికి రాజైతే, దేశాధికారులు త్రాగుబోతులై ఉండకుండా, బలం పుంజుకోవడానికే సరైన వేళకు ఆహారం తీసుకొనేవారై ఉంటే, ఆ దేశానికి క్షేమం ఉంటుంది.

[18] సోమరితనం ఉంటే, ఇంటి కప్పు పాడవుతుంది. బద్ధకం ఉంటే, ఇల్లు కురుస్తుంది.

[19] నవ్వులు కావాలని విందులు చేస్తారు మనుషులు. ద్రాక్షమద్యం వారికి సంతోషం కలిగిస్తుంది. డబ్బు అన్నిటికీ పనికి వస్తుంది.

[20] నీ మనసులో కూడా రాజును తూలనాడకు, నీ పడక గదిలో కూడా ధనికులను శాపనార్థాలు పెట్టకు. ఆకాశవీధిలో ఎగిరే పక్షులు నీ మాటలు చేరవేయవచ్చు. రెక్కలమీద ఈ సంగతి ప్రయాణమైపోయి ఇతరులకు తెలిసిపోవచ్చు.

ప్రసంగి — Chapters