[1] నీవు దేవుని ఆలయానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన కనిపెట్టుకొని మరీ వెళ్ళు. వినడానికి సమీపించు. మూర్ఖంగా బలి అర్పించడంకంటే అది మేలు గదా. తామేమి దుర్మార్గం చేస్తున్నారో వారికే తెలియదు.
[2] దేవుని సన్నిధానంలో మాట్లాడడానికి నీ హృదయాన్ని తొందరపడనియ్యకు, త్వరపడి నీ నోటితో ఏమి పలకకు. దేవుడు పరలోకంలో ఉన్నవాడు, నీవు భూమిమీద ఉన్నావు. అందుచేత నీ మాటలు కొద్దిగానే ఉండాలి.
[3] చింతలు అనేకం ఉంటే కలలు వస్తాయి. మాటలు ఎక్కువైతే తెలివితక్కువ వాడి కంఠమని గుర్తించవచ్చు.
[4] నీవు దేవునికి మొక్కుబడి చేసుకొంటే, దాన్ని తీర్చుకోవడానికి ఆలస్యం చెయ్యకు. మూర్ఖుల విషయంలో దేవునికి సంతోషం ఉండదు. ఆ మొక్కుబడి తీర్చుకో!
[5] నీవు మొక్కుకొని, దానిని చెల్లించకపోవడంకంటే అసలు మొక్కుకోకుండా ఉండడమే మంచిది.
[6] నీ నోటి మూలంగా నీవు అపరాధివి కాకుండా చూచుకో. దూతతో “ఏదో పొరపాటైంది” అని చెప్పకు. నీవు చెప్పినది విని దేవుడు కోపపడి, నీ కృషివల్ల నీకు కలిగినవాటిని నాశనం చేస్తాడేమో. అదంతా ఎందుకు?
[7] ఎక్కువ కలలు కనడం, అధికంగా మాట్లాడడం వ్యర్థం. నీవు మట్టుకు దేవునిపట్ల భయభక్తులతో మెలుగుతూ ఉండు.
[8] ఏ ప్రదేశంలో నైనా బీదప్రజలు దౌర్జన్యానికి గురి కావడం, నీతిన్యాయాల భంగం నీవు చూస్తే ఆశ్చర్యపడనక్కరలేదు. అక్కడి అధికారులను పై అధికారులు కాపాడుతారు. ఆ అధికారులను వారికంటే పైవారు కాపాడుతారు.
[9] భూసంపద దేశంలో అందరికీ లాభకరం. అందుచేత రాజు భూమి విషయం శ్రద్ధ తీసుకోవడం అందరికీ మేలు.
[10] డబ్బును ఆశించేవారు దానితో తృప్తిపడరు. అధిక లాభం ఆశించేవారికి దానితో కూడా తృప్తి ఉండదు. ఇది కూడా వ్యర్థం!
[11] ఆస్తి వృద్ధి అవుతున్న కొద్దీ, దాన్ని తినేవాళ్ళు ఎక్కువవుతారు. ఆస్తిపరుడు ఆ ఆస్తిని కండ్లారా చూస్తూ ఉండగలడు గాని, అది తప్ప ఆ ఆస్తివల్ల అతడికేమి ప్రయోజనం?
[12] కడుపునిండా తిన్నా, తినకపోయినా, శ్రమజీవి హాయిగా నిద్రపోతాడు. కాని, ఐశ్వర్యం ధనికులకు నిద్ర పట్టనియ్యదు.
[13] సూర్యమండలం క్రింద చాలా దుఃఖకరమైన విషయం ఒకటి నాకు కనిపించింది. అదేమిటంటే, ఆస్తిపరుడు తన ఆస్తిని దాచిపెట్టి, తనకు తానే హాని కొనితెచ్చుకుంటాడు.
[14] ఏదో విపత్తువల్ల అతడి ఆస్తి అంతా హరించుకుపోవచ్చు. అతడికి కొడుకు జన్మిస్తే వాణ్ణి పోషించుకోవడానికి కూడా చేతిలో అతడికి ఏమీ ఉండదు.
[15] అతడు తల్లి గర్భంనుంచి నగ్న శరీరిగా వచ్చాడు. వచ్చినట్టే పోతాడు. తాను కష్టపడి సంపాయించుకొన్నది ఏదీ చేతపట్టుకొని పోడు.
[16] అన్ని విధాల అతడు వచ్చినట్టే వెళ్ళిపోతాడు. గాలి కోసం శ్రమించినట్టే ఉంటుంది. అతడికి కలిగిన లాభమేమిటి? ఇది కూడా చాలా దుఃఖకరమైన విషయం.
[17] అతడు బ్రతికినన్నాళ్ళూ చీకట్లో తింటాడు. అతడికి చాలా విసుగు, బాధ, కోపం అలవడుతాయి.
[18] నేను తెలుసుకొన్నదేమిటంటే, దేవుడిచ్చిన జీవిత కాలమంతా మనిషి అన్నపానాలు పుచ్చుకొంటూ, సూర్య మండలంక్రింద అతడి ప్రయాసమంతట్లో తృప్తిపడడం మంచిది, మెరుగైనది. ఇదే అతడికి దేవుడు కేటాయించిన భాగం!
[19] దేవుడు ఎవడికైనా ధనధాన్య సమృద్ధి ప్రసాదిస్తాడనుకో. అతడు దాన్ని హాయిగా అనుభవిస్తూ, ఇదే దేవుడిచ్చిన భాగమంటూ, తన ప్రయాసలో సంతోషిస్తూ ఉన్నాడనుకో. అదంతా దేవుని ఉచిత బహుమానమే.
[20] అతడు హృదయంలో ఆనందం అనుభవిస్తూ ఉండేలా దేవుడు చేస్తున్నాడు. అందుచేత తాను బ్రతికిన రోజులను గురించి ఎక్కువగా తలచుకోడు.