Skip to content
Opens in a new window

[1] దావీదు కొడుకూ, జెరుసలం రాజూ అయిన ప్రసంగి వాక్కులు.

[2] వ్యర్థం! వ్యర్థం! అంటున్నాడు ఈ ప్రసంగి. కేవలం వ్యర్థం! అంతా వ్యర్థం!

[3] సూర్యమండలం క్రింద మనుషులు చేసే కష్టమైన పని అంతటిమూలంగా వారికి ఏమి ప్రయోజనం కలుగుతున్నట్టు?

[4] ఒక తరం గతిస్తే, మరో తరం వస్తుంది. భూమి మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది.

[5] పొద్దు పొడుస్తుంది, పొద్దు కుంకుతుంది. అది తను ఉదయించే స్థలానికి త్వరగా మళ్ళీ చేరుకుంటుంది.

[6] గాలి దక్షిణంవైపు వీస్తుంది. అంతలో మళ్ళీ ఉత్తరానికి తిరుగుతుంది. ఈ విధంగా గాలి సుళ్ళు తిరిగి సంచరిస్తూ ఉంటుంది.

[7] నదులన్నీ పారుతూ సముద్రంలో చేరుతాయి. అయినా సముద్రం నిండడం లేదు. నదులు తమ ఉత్పత్తి స్థానానికి మరలిపోతాయి.

[8] విషయాలన్నీ ఆయాసం పుట్టిస్తాయి – మనిషి వివరించలేనంత ఆయాసం. ఎంత చూచినా కంటికి తృప్తి లేదు, ఎంత విన్నా చెవికి తృప్తి లేదు.

[9] ఇంతవరకూ ఉన్నదే ఇక ముందూ ఉంటుంది. ఇంతవరకూ జరిగినదే ఇక ముందూ జరగబోతుంది. సూర్యమండలం క్రింద క్రొత్తది అంటూ ఏదీ లేదు.

[10] ఏదో ఒకదాన్ని గురించి “ఇదిగో ఇది క్రొత్తది” అంటాడు ఒకడు. అయినా అది మనకు పూర్వం, గత తరాలలో ఉండేదే.

[11] మునుపు ఉన్నవి జ్ఞాపకంలో లేవు. జరగబోయేవి ఆ తరువాతి తరంవాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకోరు.

[12] నేను ప్రసంగిని. జెరుసలంలో ఇస్రాయేల్‌ప్రజలకు రాజును నేను.

[13] ఆకాశం క్రింద ఏమి జరుగుతుందో అంతా జ్ఞానదృష్టితో చూచి, అర్థం చేసుకోవాలని నా మనసును అందులో లగ్నం చేశాను. మనుషులు కష్టపడాలని దేవుడు వాళ్ళకు నియమించిన ప్రయాస కఠినమైనది.

[14] సూర్యమండలం క్రింద జరిగే క్రియాకలాపాలన్నీ నేను చూశాను. అవన్నీ వ్యర్థం! గాలికోసం శ్రమించినట్టే ఉన్నాయి ఇవన్నీ!

[15] వంకర టింకరగా ఉండేదానిని సరి చెయ్యడం సాధ్యమయ్యే పని కాదు. లేని వాటిని లెక్క పెట్టడం ఎవరికి చేతా కాదు.

[16] నేను అనుకొన్నాను, “జెరుసలంలో నాకు ముందున్న వారందరి కంటే నేను గొప్ప జ్ఞానినయ్యాను. నేనెంతో జ్ఞాన సముపార్జన చేశాను. జ్ఞానాన్ని, విద్యను అధికంగా అభ్యాసం చేశాను.”

[17] నా మనసును ఈ విషయంమీద కేంద్రీకరించాను – జ్ఞానమంటే ఏమిటి? ఏది వెర్రి? ఏది అవివేకం? ఇదంతా తెలుసుకోవాలని ప్రయత్నించాను. ఇది కూడా గాలికోసం శ్రమించినట్టే అని గ్రహించాను.

[18] అధిక జ్ఞానం వల్ల అధిక దుఃఖం కలుగుతుంది! జ్ఞాన సంపాదన అధికమైనకొలది శోకం అధికం అవుతుంది.

ప్రసంగి — Chapters