Skip to content
Opens in a new window

[1] మంచి పేరు పరిమళ తైలంకంటే విలువైనది. జన్మదినం కంటే మరణ దినం మేలు.

[2] విందు జరిగే ఇంటికి వెళ్ళేకంటే శోకించేవారి ఇంటికి వెళ్ళడం మేలు. మరణం అందరికీ సంభవిస్తుంది. బ్రతికి ఉన్నవారు అది తలపోయాలి.

[3] నవ్వుకంటే దుఃఖం మేలు, ఎందుకంటే విచారం గల ముఖం మనసుకు మేలు కలిగిస్తుంది.

[4] జ్ఞానుల మనసు శోకించేవారి ఇంటిమీద ఉంటుంది. తెలివితక్కువవారి మనసు సంతోషించేవారి ఇంటిమీద ఉంటుంది.

[5] మూర్ఖుల పాటలు వినడంకంటే జ్ఞానుల మందలింపు వినడం శ్రేయస్కరం.

[6] కుండ క్రింద ముండ్ల కంప మంట చిటపట మంటుంది. మూర్ఖుల నవ్వు కూడా అలాంటిదే. ఇది కూడా వ్యర్థం.

[7] జ్ఞాని దౌర్జన్యం చేస్తే అది అతణ్ణి పిచ్చివాణ్ణిగా చేస్తుంది. లంచం తీసుకొన్నవాడికి మతి చెడుతుంది.

[8] విషయం ఆరంభంకంటే దాని అంతమే మేలు. అహంభావంకంటే సహనం మేలు.

[9] తొందరలో కోపపడవద్దు. మూర్ఖుల అంతరంగంలో కోపం తిష్ఠ వేసుకొని కూర్చుంటుంది.

[10] “ఈ కాలంకంటే గతకాలం ఎందుకని మంచిది?” అని అడగకు. ఈ ప్రశ్నలో జ్ఞానం లేదు.

[11] పిత్రార్జితంతో పాటు జ్ఞానం ఉంటే అది మంచి విషయమే. సూర్యమండలం క్రింద బ్రతికేవారికి అది లాభం.

[12] డబ్బు ఉన్నవారికి అది అండగా ఉంటుంది. అలాగే జ్ఞానం అండగా ఉంటుంది. జ్ఞానం మనిషికి ప్రాణరక్ష. ఇది జ్ఞానం ఉన్నందుకు ప్రయోజనం.

[13] దేవుడు చేసినదాన్ని ధ్యానించి చూడు. దేవుడే వంకరగా చేసినది ఎవడు సరి చేయగలడు?

[14] శ్రేయస్సుగా ఉన్న కాలంలో హాయిగా ఉండు. కష్టాలున్న కాలంలో ఆలోచించి చూడు – ఆ కాలం, ఈ కాలం కలిగించినది దేవుడే. మనుషులు తమ భవిష్యత్తు విషయం ఏమీ తెలుసుకోకుండా ఉండాలని దేవుడు అలా చేస్తాడు.

[15] వ్యర్థమైన నా జీవితంలో నేను ఇదంతా చూశాను – న్యాయాన్ని అనుసరిస్తూ, ప్రాణాలూ విడిచిన న్యాయ వంతులున్నారు. తమ దుర్మార్గంలో చిరాయువులై ఉండిపోయిన దుర్మార్గులు ఉన్నారు.

[16] న్యాయవంతుడుగా అతిగా ప్రవర్తించకు! అతి జ్ఞానం సంపాదించుకోకు! నీమీదికి ఎందుకు నాశనం తెచ్చి పెట్టుకొంటావు?

[17] కావాలని అధిక దుర్మార్గానికి ఒడికట్టకు. తెలివిమాలి తిరగకు. ఎందుకు అకాల మృత్యువుకు గురి అవుతావు?

[18] ఈ సత్యం గట్టిగా పట్టుకో. ఆ సత్యం జారవిడవకు. దేవునిపట్ల భయభక్తులున్నవారు రెండింటినీ అనుసరిస్తారు.

[19] పట్టణంమీద పదిమంది అధికారులకంటే జ్ఞానికి ఎక్కువ బలప్రభావాలు ఉంటాయి. జ్ఞానమే వాటిని అతడికి కలిగిస్తుంది.

[20] ఎన్నడూ తప్పిదం చేయకుండా, ఎప్పుడూ మంచినే చేసే న్యాయవంతుడు ఈ భూమిమీద ఎవ్వడూ లేడు.

[21] ఇతరులు చెప్పే ప్రతి మాటమీదా నీ మనసు పెట్టకు. లేకపోతే నీ సేవకుడు నిన్ను తిట్టుకొంటూ ఉంటే నీవు వినవలసివస్తుంది.

[22] నీవు మట్టుకు ఎన్నో సార్లు ఇతరులను తిట్టలేదా! ఈ సంగతి నీకే తెలుసు.

[23] ఇదంతా జ్ఞానాన్ని వినియోగించి నేను పరిశోధించి చూశాను. “నేను జ్ఞానినవుతాను” అనుకొన్నాను. కాని, అది నాకు దూరంగా ఉండిపోయింది.

[24] జ్ఞానం ఏమై ఉన్నా అది దూరంగానే ఉంది. అది అగాధమైనది. దాన్ని ఎవడు తరచి చూడగలడు?

[25] జ్ఞానం ఏమిటో, సంగతుల హేతువు ఏమిటో వెదికి, పరిశోధించి, తెలుసుకోవాలనీ, దుర్మార్గంలోని మూఢత్వాన్నీ మూఢత్వంలోని వెర్రితనాన్నీ గ్రహించాలనీ నేను ఆలోచించడం ఆరంభించాను.

[26] మరణంకంటే వలలలాంటి స్త్రీ ఎక్కువ దుఃఖకారణమని నేను కనుగొన్నాను. ఆమె మనసు నిండా ఉరులే! ఆమె చేతులు బంధకాలే! దేవుని దృష్టిలో సజ్జనులు ఆమెను తప్పించుకోగలరు. కాని, పాపాత్ములు ఆమెకు చిక్కుపడి పోతారు.

[27] విషయాల హేతువును గ్రహించేందుకు ఒకటి తరువాత ఒకటి కూలంకషంగా తలపోశాను. నేనా హేతువును తెలుసుకోలేదు – ఇంకా అన్వేషిస్తూ ఉన్నాను. అయినా నేను ఒక విషయం గ్రహించాను. ప్రసంగి అనే నేను చెప్పేదేమిటంటే,

[28] వెయ్యిమంది పురుషుల్లో ఒకణ్ణయినా నిజాయితీపరుణ్ణి చూడగలిగాను గాని, అంతమంది స్త్రీలలో ఒకతెను కూడా చూడలేకపొయ్యాను.

[29] ఇది మాత్రం గ్రహించాను – దేవుడు మనిషిని యథార్థవంతుణ్ణిగానే సృష్టించాడు. కాని, మనుషులు కీడు చేసేందుకు వివిధమైన యుక్తులను వెదికారు.

ప్రసంగి — Chapters