[1] లెమూయేలు రాజు చెప్పిన జ్ఞాన సూక్తులు ఇవి. ఈ విషయాలను అతని తల్లి అతనికి నేర్పించింది.
[2] నీవు నా కుమారుడవు. నేను ప్రేమించే నా కుమారుడివి. నాకు కావాలని నేను ప్రార్థించిన కుమారుడివి నీవు.
[3] స్త్రీలకోసం నీ బలం వ్యర్థం చేయవద్దు. స్త్రీలే రాజులను నాశనం చేసేవాళ్లు. వారికోసం నిన్ను నీవు వ్యర్థం చేసుకోవద్దు.
[4] లెమూయేలూ, రాజులు ద్రాక్షారసం తాగటం జ్ఞానముగల పనికాదు. మద్యము కోరుట పరిపాలకులకు జ్ఞానముగల పనికాదు.
[5] వారు విపరీతంగా తాగేసి న్యాయచట్టం చెప్పేదానిని మరచి పోవచ్చు. అప్పుడు వారు పేద ప్రజల హక్కులు అన్నీ తీసివేస్తారు.
[6] మద్యం పేద ప్రజలకు ఇమ్ము. ద్రాక్షారసం కష్టంలో ఉన్న ప్రజలకు ఇమ్ము.
[7] అప్పుడు వారు అది తాగి, వారు పేదవాళ్లు అనే మాట మరచిపోతారు. వాళ్లు తాగేసి వారి కష్టాలన్నీ మరచిపోతారు.
[8] ఒకడు తనకు తానే సహాయం చేసికోలేకపోతే అప్పుడు నీవు అతనికి సహాయం చేయాలి. కష్టంలో ఉన్న ప్రజలందరికీ నీవు సహాయం చేయాలి.
[9] సరైనవి అని నీకు తెలిసిన విషయాల కోసం నీవు నిలబడు. మనుష్యులందరికీ న్యాయంగా తీర్పు తీర్చు. పేద ప్రజల, నీ అవసరం ఉన్న ప్రజల హక్కులను కాపాడు.
[10] “పరిపూర్ణమైన స్త్రీ” దొరకటం ఎంతో కష్టం. కాని ఆమె నగలకంటె ఎంతో ఎక్కువ అమూల్యం.
[11] ఆమె భర్త ఆమెను నమ్మగలడు. అతడు ఎన్నడూ దరిద్రునిగా ఉండడు.
[12] మంచి భార్య తన జీవితకాలం అంతా తన భర్తకు మంచినే చేస్తుంది. ఆమె ఎన్నడూ అతనికి చిక్కు కలిగించదు.
[13] ఆమె ఉన్నిబట్ట తయారు చేస్తూ ఎల్లప్పుడూ పనిలో నిమగ్నమవుతుంది.
[14] ఆమె దూరము నుండి వచ్చిన ఓడలా ఉంటుంది. అన్ని చోట్ల నుండీ ఆమె ఆహారం తీసుకొని వస్తుంది.
[15] ఆమె అతి వేకువనే మేలుకొంటుంది. తన కుటుంబానికి భోజనం, తన పని వారికి భోజనం ఆమె వండుతుంది.
[16] ఆమె పొలాన్ని చూస్తుంది. దాన్నికొంటుంది. ఆమె ద్రాక్షతోట నాటేందుకు ఆమె దాచుకొన్న డబ్బు ఉపయోగిస్తుంది.
[17] ఆమె చాలా కష్టపడి పని చేస్తుంది. ఆమె బలంగా ఉండి తన పని అంతా చేసుకో గలుగుతుంది.
[18] ఆమె తయారు చేసిన వాటిని అమ్మినప్పుడు ఆమె ఎల్లప్పుడూ లాభం సంపాదిస్తుంది. మరియు రాత్రి చాలా పొద్దుపోయేదాకా ఆమె పని చేస్తుంది.
[19] ఆమె స్వంతంగా దారం తయారు చేసికొని తన స్వంత బట్ట నేస్తుంది.
[20] ఆమె ఎల్లప్పుడూ పేద ప్రజలకు పెడుతుంది. అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తుంది!
[21] చలిగా ఉన్నప్పుడు ఆమె తన కుటుంబం విషయం దిగులు పడదు. ఆమె వారందరికి మంచి వెచ్చని దుస్తులు ఇస్తుంది.
[22] ఆమె దుప్పట్లు నేసి పడకలమీద పరుస్తుంది. నన్నని నారతో చేయబడ్డ వస్త్రాలు ఆమె ధరిస్తుంది.
[23] ఆమె భర్తను ప్రజలు గౌరవిస్తారు. అతడు దేశ నాయకులలో ఒకడు.
[24] ఆమె మంచి వ్యాపార దక్షతగల స్త్రీ. ఆమె బట్టలు, నడికట్లు తయారు చేసి వాటిని వ్యాపారస్థులకు అమ్ముతుంది.
[25] ఆమె బలంగా ఉంటుంది. మరియు, ప్రజలు ఆమెను గౌరవిస్తారు. ఆమె స్థానము బలంగాను మరియు సురక్షితంగాను ఉంటుంది. భవిష్యత్తును గురించి సంతోషిస్తుంది.
[26] ఆమె మాట్లాడినప్పుడు జ్ఞానముగా ఉంటుంది. ఆమె జ్ఞానం ఉపదేశముతోనిండి ఉంటుంది.
[27] ఆమె ఎన్నడూ బద్ధకంగా ఉండదు. కాని ఆమె తన ఇంటి విషయాలను గూర్చి జాగ్రత్త తీసుకొంటుంది.
[28] ఆమె పిల్లలు పెద్దవారై ఆమెను ఘనపరుస్తారు. మరియు ఆమె భర్త ఆమెను గూర్చి ఎన్నో మంచి విషయాలు చెబుతాడు.
[29] “ఎంతో మంది స్త్రీలు మంచి భార్యలు అవుతారు. కాని నీవు శ్రేష్ఠమైన దానివి” అని ఆమె భర్త చెబుతాడు.
[30] సౌందర్యము, అందము నిన్ను మోసగించవచ్చు. అయితే యెహోవాను గౌరవించే స్త్రీ పొగడబడాలి.
[31] ఆమెకు అర్హమైన ప్రతిఫలం రావాలి. ఆమె చేసిన విషయాల కోసం ప్రజలు ఆమెను బహిరంగంగా ఘనపర్చాలి.