Skip to content
Opens in a new window

[1] మనుష్యులు తమ ఆలోచనలు చేస్తారు. అయితే ఆ విషయాలు జరిగేటట్టుగా చేసేవాడు యెహోవాయే.

[2] ఒకడు తాను చేసేది అంతా సరిగ్గా ఉంది అనుకొంటాడు. అయితే మనుష్యులు చేసే వాటికిగల అసలైన కారణాలు ఏమిటో యెహోవా తీర్పు చెబుతాడు.

[3] నీవు చేసే ప్రతీదానిలో సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు తిరుగు, నీవు జయంపొందుతావు.

[4] ప్రతీదానికీ యెహోవా ఏర్పాటు ఒకటి ఉంది. యెహోవా ఏర్పాటులో దుర్మార్గులు నాశనం చేయబడతారు.

[5] ఇతరులకంటే తానే మంచివాడిని అనుకొనే ప్రతి మనిష యెహోవాకు అసహ్యుడు. ఆ గర్విష్ఠుల నందరినీ యెహోవా తప్పక నాశనం చేస్తాడు.

[6] నిజమైన ప్రేమ, నమ్మకం నిన్ను పవిత్రం చేస్తాయి. యెహోవాను గౌరవించు, నీవు దుర్మార్గానికి దూరంగా ఉంటావు.

[7] ఒక వ్యక్తి యెహోవాను సంతోషపెట్టే విధంగా మంచి జీవితం జీవిస్తూంటే అప్పుడు అతని శత్రువులు కూడా అతనితో సమాధానంగా ఉంటారు.

[8] మోసం చేసి విస్తారంగా సంపాదించుటకంటే, సరైన విధంగా కొంచెం మాత్రమే సంపాదించుట మేలు.

[9] ఒక మనిషి తాను చేయాలనుకొనే వాటి విషయంలో పథకాలు వేయవచ్చు. అయితే ఏమి జరుగు తుంది అనేది నిర్ణయించే వాడు యెహోవా.

[10] ఒక రాజు మాట్లాడితే, అతని మాటలు చట్టం అవుతాయి. అతని నిర్ణయాలు ఎల్లప్పుడూ న్యాయంగా ఉండాలి.

[11] త్రాసులు, తూనిక రాళ్లు అన్నీ నిజాయితీగా ఉండాలని యెహోవా కోరుతాడు, వ్యాపార ఒప్పందాలన్నీ న్యాయంగా ఉండాలని ఆయన కోరుతాడు.

[12] కీడు చేసే మనుష్యులను రాజులు అసహ్యించుకొంటారు. మంచితనం అతని రాజ్యాన్ని మరింత బలమైనదిగా చేస్తుంది.

[13] రాజులు సత్యం వినాలని కోరుతారు. అబద్ధాలు చేప్పని ప్రజలు రాజులకు ఇష్టం.

[14] రాజుకు కోపం వస్తే, అతడు ఎవరినైనా చంపవచ్చును. జ్ఞానముగలవాడు రాజును సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాడు.

[15] రాజు సంతోషంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ జీవితం సంతోషంగా ఉంటుంది. నీ విషయమై రాజు సంతోషిస్తే, అది మేఘం నుండి కురిసిన వర్షపు ఊటలా ఉంటుంది.

[16] జ్ఞానము బంగారంకంటె చాలా ఎక్కువ విలువగలది. అవగాహన వెండికంటె చాలా ఎక్కువ విలువగలది.

[17] మంచి మనుష్యులు దుర్మార్గానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ తమ జీవితాలు జీవిస్తారు. తన జీవితం కాపాడుకొనేవాడు తన ఆత్మను భద్రము చేసుకొంటున్నాడు.

[18] ఒక వ్యక్తి గనుక గర్వంగా ఉంటే, అప్పుడు అతడు నాశనకరమైన అపాయంలో ఉన్నాడు. ఒక మనిషి ఇతరులకంటె తానే మంచివాడినని అనుకొంటే అతడు ఓడిపోయే ప్రమాదంలో ఉన్నాడు.

[19] ఇతరులకంటె గొప్పవాళ్లం అనుకొనే వాళ్లతో ఐశ్వర్యాలు పంచుకోవటంకంటె, దీనులైన, పేదవాళ్లతో కలిసి జీవించటం మేలు.

[20] మనుష్యులు తనకు నేర్పించుటకు ప్రయత్నించినప్పుడు, వినే వ్యక్తి లాభం పొందుతాడు. యెహోవాను నమ్ముకొనేవాడు ఆశీర్వదించబడుతాడు.

[21] ఒకవేళ ఒక మనిషి జ్ఞానముగల వాడైతే అది ప్రజలు తెలుసుకొంటారు. జాగ్రత్తగా ఎంచుకొని మాటలు మాట్లాడే మనిషి, చాలా ఒప్పించదగినవాడుగా ఉంటాడు.

[22] జ్ఞానముగల వారికి అది నిజమైన జీవాన్ని తెచ్చిపెడుతుంది. కానీ బుద్ధిహీనులు మరింత బుద్ధిహీనంగా ఉండటమే నేర్చుకొంటారు.

[23] జ్ఞానముగల మనిషి మాట్లాడక ముదు ఎల్లప్పుడూ ఆలోచిస్తాడు. అతడు చెప్పే మాటలు మంచివి, వినదగినవి.

[24] దయగల మాటలు తేనెలా ఉంటాయి. వాటిని అంగీకరించటం సులభం, అవి నీ ఆరోగ్యానికి మంచివి.

[25] మనుష్యుల దృష్టికి సరైనదిగా కనుపించే మార్గం ఒకటి ఉంది. కానీ ఆ మార్గం మరణానికి మాత్రమే నడిపిస్తుంది.

[26] పనివాని ఆకలి అతణ్ణి పని చేయిస్తూనే ఉంటుంది. అతడు భోజనం చేయగలిగేటట్టు, అతని ఆకలి అతణ్ణి పని చేయిస్తుంది.

[27] పనికిమాలిన మనిషి చెడు పనులు చేయాలని పథకం వేస్తాడు. అతని సలహా నిప్పులా నాశనం చేస్తుంది.

[28] చిక్కులు పేట్టేవారు ఎల్లప్పుడూ సమస్యలు పుట్టిస్తూంటారు. చెప్పుడు మాటలు వ్యాపింపజేసేవాడు సన్నిహితులైన మిత్రుల మధ్య చిక్కు కలిగిస్తాడు.

[29] త్వరగా కోపం వచ్చే మనిషి తన స్నేహితులకు చిక్కు తెచ్చిపెడ్తాడు. మంచిది కాని మార్గంలో అతడు వారిని నడిపిస్తాడు.

[30] కన్నుగీటి, చిరునవ్వునవ్వేవాడు ఏదో అక్రమం, కీడు తలపెడ్తున్నాడు.

[31] నెరసిన తల వెంట్రుకలు, మంచి జీవితాలు జీవించిన వారికి మహిమ కిరీటం.

[32] బలమైన ఒక సైనికునిగా ఉండటంకంటే సహనం గలిగి ఉండటం మంచిది, ఒక పట్టణం అంతటిని స్వాధీనం చేసికోవటంకంటే, నీ కోపాన్ని స్వాధీనం చేసికోవటం మేలు.

[33] నిర్ణయాలు చేయటానికి మనుష్యులు చీట్లు వేస్తారు. కానీ నిర్ణయాలు ఎల్లప్పుడూ దేవుని దగ్గర్నుండి వస్తాయి.

సామెతలు — Chapters