Skip to content
Opens in a new window

[1] ఇవి సొలొమోను సామెతలు (జ్ఞానముగల మాటలు): జ్ఞానముగల కుమారుడు తన తండ్రిని సంతోషపెడతాడు. కాని బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దు:ఖం కలిగిస్తాడు.

[2] ఒకడు చెడు కార్యములు చేయుట వలన అతనికి డబ్బు వస్తే అది పనికిమాలిన డబ్బు అవుతుంది. కాని మంచిని జరిగించిన ఎడల అది మరణం నుండి నిన్ను రక్షించగలుగుతుంది.

[3] యెహోవా మంచి మనుష్యుల విషయమై శ్రద్ధ పుచ్చుకొంటాడు. వారికి అవసరమైన భోజనాన్ని ఆయన వారికి ఇస్తాడు. కాని దుర్మార్గులకు అవసరమైన వాటిని యెహోవా తొలగించి వేస్తాడు.

[4] బద్ధకస్తుడు వేదవాడుగా ఉంటాడు. కాని కష్టపడి పనిచేసేవాడు ధనికుడు అవుతాడు.

[5] తెలివిగల వాడు సకాలంలో పంట కూర్చుకొంటాడు. కాని కోత కాలంలో నిద్రపోయేవాడు అవమానము కలిగించే కుమారుడు.

[6] మంచి మనిషిని ఆశీర్వదించమని మనుష్యులు దేవుని అడుగుతారు. ఆ మంచి విషయాలను చెడ్డవారు చెప్పవచ్చు కాని వారు తల పెడుతున్న చెడు విషయాలను వారి మాటలే కప్పిపుచ్చుతాయి.

[7] మంచి మనుష్యుల కార్యములను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరము. కాని చెడ్డవారి పేరు మరువ బడును.

[8] జ్ఞానముగల మనిషితో ఎవరైనా ఏదైనా చేయుమని చెబితే అతడు విధేయుడవుతాడు. కాని బుద్ధిహీనుడు వాదించి తనకు తానే కష్టం తెచ్చుకుంటాడు.

[9] నిజాయితీగల ఒక మంచి మనిషి క్షేమంగా ఉంటాడు. కాని మోసం చేసే కపటియైన వ్యక్తి పట్టు బడతాడు.

[10] సత్యమును దాచిపెట్టే మనిషి కష్టాలు కలిగిస్తాడు. బాహాటంగా మాట్లాడేవాడు శాంతి కలిగిస్తాడు.

[11] ఒక మంచి మనిషి మాటలు జీవితాన్ని మెరుగు పరుస్తాయి. కానీ ఒక దుర్మార్గుని మాటలు అతని అంతరంగంలో ఉన్న చెడును చూపిస్తాయి.

[12] ద్వేషం వాదాలు పుట్టిస్తుంది. కానీ మనుష్యులు చేసే ప్రతి తప్పునూ ప్రేమ క్షమిస్తుంది.

[13] జ్ఞానముగల వారు వినదగిన మాటలు చెబుతారు. కానీ బుద్ధిహీనులు వారి పాఠం వారు నేర్చుకొనక ముందే శిక్షించబడాలి.

[14] జ్ఞానముగల వారు నెమ్మదిగా ఉంటారు, కొత్త విషయాలు నేర్చుకొంటారు. కానీ బుద్ధిహీనులు మాట్లాడి వారికి వారే కష్టాలు తెచ్చుకొంటారు.

[15] ధనికుడ్ని ఐశ్వర్యం కాపాడుతుంది. మరియు పేదవాడ్ని పేదరికం పాడు చేస్తుంది.

[16] ఒక మనిషి మంచి చేస్తే, అతనికి బహుమానం ఇవ్వబడుతుంది. అతనికి జీవం యివ్వబడుతుంది.దుర్మార్గత శిక్షను మాత్రమే తెచ్చి పెడుతుంది.

[17] తన శిక్ష మూలంగా నేర్చుకొన్నవాడు ఇతరులు జీవించటానికి సహాయం చేయగలుగుతాడు. అయితే నేర్చుకొనేందుకు అంగీకరించని వాడు మనుష్యులను తప్పు త్రోవలో మాత్రమే నడిపించగలడు.

[18] తన ద్వేషాన్ని దాచిపెట్టేవాడు అబద్ధం చెబుతూ ఉండవచ్చు. కానీ బుద్ధిహీనుడు తాను మాత్రమే ప్రచారం చేసేందుకు చెప్పేటటువంటి మాటల కోసం ప్రయత్నిస్తాడు.

[19] అధికంగా మాట్లాడేవాడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు. జ్ఞానముగలవాడు ఊరక ఉండుట నేర్చుకొంటాడు.

[20] మంచి మనిషి మాటలు స్వచ్ఛమైన వెండిలా ఉంటాయి. కానీ దుర్మార్గుని తలంపులు పనికి మాలినవిగా ఉంటాయి.

[21] ఒక మంచి మనిషి మాటలు అనేకులకు సహాయం చేస్తాయి. కానీ బుద్ధిహీనుని మూర్ఖత్వం అతన్నే పాడు చేస్తాయి.

[22] యెహోవా దీవెన నీకు ఐశ్వర్యం ఇస్తుంది. మరియు ఆ ఐశ్వర్యం దానితో బాటు కష్టాలు తీసుకొని రాదు.

[23] బుద్ధిహీనుడు తప్పు చేయుటలో ఆనందిస్తాడు. కానీ జ్ఞానముగలవాడు జ్ఞానములో ఆనందిస్తాడు.

[24] దుర్మార్గుడు తాను భయపడే విషయాల మూలంగా ఓడించబడుతాడు. కానీ మంచివాడు తాను కోరుకొనే వాటిని పోందుతాడు.

[25] సుడిగాలి వీచినప్పుడు దుర్మార్గులు నాశనమవుదురు. కానీ మంచివాళ్లకు శాశ్వతమైన పునాది వుంటుంది. వాళ్లు శాశ్వతంగా ఉంటారు.

[26] బద్ధకస్తుణ్ణి ఎన్నడూ నీ కోసం ఏదీ చేయనీయకు. నీ నోట చిరకలా, లేక నీ కళ్లలో పొగలా అతడు నిన్ను చికాకు పెడతాడు.

[27] నీవు యెహోవాను గౌరవిస్తే, నీవు చాలా కాలం బతుకుతావు. కానీ దుర్మార్గులు వారి జీవితంలోనుండి కొన్ని సంవత్సరాలు పోగొట్టుకొంటారు.

[28] మంచి మనుష్యులు నిరీక్షించే విషయాలు సంతోషం కలిగిస్తాయి. దుర్మార్గులు నిరీక్షించే విషయాలు నాశనం తెచ్చి పెడతాయి.

[29] మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు. కానీ తప్పుచేసే వారిని యెహోవా నాశనం చేస్తాడు.

[30] మంచి మనుష్యులు ఎల్లప్పుడూ క్షేమంగా ఉంటారు. కానీ దుర్మార్గులు బలవంతంగా దేశం నుండి వెళ్లగొట్టబడతారు.

[31] మంచి మనుష్యులు జ్ఞానముగల మాటలు చెబుతారు. కానీ కష్టం తెచ్చి పెట్టే వాని మాటలు వినటం మనుష్యులు మానివేస్తారు.

[32] మంచి మనుష్యులకు సరైన సంగతులు చెప్పటం తెలుసు. కానీ దుర్మార్గులు కష్టం తెచ్చిపెట్టే మాటలు చెబుతారు.

సామెతలు — Chapters