Skip to content
Opens in a new window

[1] అబద్ధాలు చెప్పి, మోసం చేసే బుద్ధిహీనునిగా ఉండుటకంటే, నిజాయితీగల పేదవానిగా ఉండుట మేలు.

[2] దేనిగూర్చిగాని ఉద్వేగ పడిపోవటం మాత్రం చాలదు. నీవు చేస్తేంది ఏమిటో కూడా నీకు తెలిసి ఉండాలి. నీవు తొందరపడి ఏదీ చేయకూడదు. లేకపోతే నీవు తప్పు చేసేస్తావు.

[3] ఒక మనిషి యొక్క బుద్ధిహీనత అతని జీవితాన్ని పాడు చేస్తుంది. కానీ అతడు యెహోవాను నిందిస్తాడు.

[4] ఒకడు ధనవంతుడైతే అతని ఐశ్వర్యం అతనికి అనేకమంది మిత్రులను తెచ్చి పెడ్తుంది. కానీ ఒకడు పేదవాడైతే అతని స్నేహితులంతా అతనిని విడిచి పెట్టేస్తారు.

[5] మరొకనికి విరోధంగా అబద్ధం చెప్పేవాడు శిక్షించబడుతాడు. అబద్ధాలు చెప్పేవాడు క్షేమంగా ఉండడు.

[6] అధికారులతో అనేకమంది స్నేహంగా ఉండాలని కోరుకొంటారు, కానుకలు ఇచ్చే వానితో ప్రతి ఒక్కరూ స్నేహంగా ఉండాలని కోరుకొంటారు.

[7] ఒక మనిషి పేదవాడైతే, అతని కుటుంబం కూడా అతనికి విరోధంగా ఉంటుంది. అతని స్నేహితులంతా అతని దగ్గరనుండి వెళ్లిపోతారు. ఆ పేదవాడు సహాయం కోసం వారిని భిక్షం అడగవచ్చు. కానీ వారు అతని దగ్గరకు కూడా వెళ్లరు.

[8] తెలివిని సంపాదించుకొనుటకు ప్రయత్నించే మనిషి తనను తాను ప్రేమిస్తున్నట్టు సూచిస్తాడు. జ్ఞానమును ప్రేమించేవాడు లాభం పొందుతాడు.

[9] అబద్ధాలు చెప్పేవాడు శిక్షించబడతాడు. అబద్ధాలు చెబుతూనే ఉండేవాడు నాశనం చేయబడతాడు.

[10] బుద్ధిహీనుడు ధనవంతునిగా ఉండకూడదు. అది రాజకుమారుల మీద బానిస పరిపాలన చేసినట్టుగా ఉంటుంది.

[11] ఒక మనిషి జ్ఞానము గలవాడైతే, ఆ జ్ఞానము అతనికి సహనాన్ని ఇస్తుంది. అతని యెడల తప్పు చేసిన వారిని అతడు క్షమించటం అతనికి ఘనతగా ఉంటుంది.

[12] ఒక రాజు కోపంగా ఉన్నప్పుడు అది సింహగర్జనలా ఉంటుంది. కాని అతడు నీతో సంతోషంగా ఉంటే అది మృదువైన వర్షంలా ఉంటుంది.

[13] తెలివి తక్కువ కుమారుడు తన తండ్రిని నాశనం చేయగలడు. వాదులాడే భార్య ఎడతెగక కారే నీటి చుక్కల మాదిరి విసుగు కలిగించేదిగా ఉంటుంది.

[14] మనుష్యులు ఇండ్లు, ధనం వారి తలిదండ్రులనుండి పొందుతారు. అయితే మంచి భార్య యెహోవా నుండి దొరికే వరం.

[15] సోమరివానికి నిద్ర చాలా ఎక్కువ వస్తుంది. కాని అతడు చాలా ఆకలిగా కూడా ఉంటాడు.

[16] దైవాజ్ఞకు విధేయునిగా ఉండేవాడు తన ఆత్మను క్షేమంగా ఉంచుకొంటాడు. కాని దైవాజ్ఞను వినుటకు నిరాకరించేవాడు మరణిస్తాడు.

[17] పేద ప్రజలకు డబ్బులిచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అతడు చేసే పనుల కోసం యెహోవా అతనికి బహుమానం ఇస్తాడు.

[18] నీ కుమారునికి బోధించి, వాడు తప్పు చేసినప్పుడు వానిని శిక్షించు. అదొక్కటే ఆశ. అలా చేయటానికి తిరస్కరిస్తే తనను తానే నాశనం చేసుకొనుటకు నీవు అతనికి సహాయం చేస్తున్నావు.

[19] ఒకడు తేలికగా కోపం తెచ్చుకొంటే అతడు దాని విలువ చెల్లించాలి. అతడు కష్టంలో నుండి బయట పడుటకు నీవు అతనికి సహాయం చేస్తే అతడు తిరిగి నీకూ అలానే చేస్తాడు.

[20] సలహా విని నేర్చుకో. అప్పుడు నీవు జ్ఞానముగలవాడవు అవుతావు.

[21] మనుష్యులు ఎన్నో పథకాలు వేస్తారు. కాని యెహోవా కోరేవి మాత్రమే జరుగుతాయి.

[22] నిజాయితీ, మరియు విశ్వసనీయత మనిషిలో కోరదగ్గవి. విశ్వసనీయత కోల్పోవడం కంటే బీదవాడుగా ఉండటం మేలు.

[23] యెహోవా యెడల గౌరవం నిజమైన జీవానికి నడిపిస్తుంది. అప్పుడు మనిషికి శాంతి ఉంటుంది. కష్టంలో క్షేమంగా ఉంటాడు.

[24] సోమరి తనను పోషించుకొనేందుకు తాను చేయాల్సిన పనులు కూడ చేయడు. తన పళ్లెంలోని భోజనం తన నోటి వద్దకు ఎత్తుకోటానికి కూడా అతనికి బద్ధకమే.

[25] దేనికీ గౌరవం చూపనివారు శిక్షించబడాలి. అప్పుడు బుద్ధిహీనులు ఒక పాఠం నేర్చుకొంటారు. జ్ఞానముగల మనిషి విమర్శించ బడినప్పుడు నేర్చుకొంటాడు.

[26] ఒక వ్యక్తి తన తండ్రి దగ్గర దొంగతనం చేసి తన తల్లిని బలవంతంగా వెళ్లగొడితే, అతడు చాలా దుర్మార్గుడు. అతడు తనకు తానే సిగ్గు, అవమానం తెచ్చుకొంటాడు.

[27] నేర్చుకొనేందుకు నీవు నిరాకరిస్తే, అప్పటికే నీకు తెలిసిన విషయాలను త్వరలోనే నీవు మరచిపోతావు.

[28] సాక్షి నమ్మకంగా లేకపోతే అప్పుడు తీర్పు న్యాయంగా ఉండదు. దుర్మార్గులు చెప్పే విషయాలు మరింత దుర్మార్గం తెచ్చి పెడతాయి.

[29] ఇతరులకంటే తానే మంచి వాడిని అనుకొనే మనిషి శిక్షించబడతాడు. బుద్ధిహీనుడు తనకోసం దాచబడిన శిక్షను పొందుతాడు.

సామెతలు — Chapters