Skip to content
Opens in a new window

[1] శాంతియుతమైన జవాబు కోపాన్ని పోగొడ్తుంది. కాని దురుసు జవాబు కోపాన్ని పెంచుతుంది.

[2] జ్ఞానముగల మనిషి మాట్లాడినప్పుడు ఇతరులు వినాలని ఆశిస్తారు. కాని బుద్ధిహీనుడు మాట్లాడేది తెలివితక్కువ తనమే అవుతుంది.

[3] అన్నిచోట్లా జరిగేవాటన్నింటినీ యెహోవా చూస్తాడు. దుర్మార్గులను, మంచి వాళ్లను యెహోవా గమనిస్తాడు.

[4] దయగల మాటలు జీవవృక్షంలా ఉంటాయి. కాని అబద్ధాల మాటలు ఒక మనిషి ఆత్మను అణచివేస్తాయి.

[5] తెలివితక్కువ వాడు తన తండ్రి సలహా వినేందుకు నిరాకరిస్తాడు. కాని జ్ఞానముగలవాడు మనుష్యులు అతనికి నేర్పించటానికి ప్రయత్నించినప్పుడు జాగ్రత్తగా వింటాడు.

[6] మంచి మనుష్యులు అనేక విషయాలలో ఐశ్వర్యవంతులుగా ఉంటారు. కాని ఒక దుర్మార్గునికి ఉన్నవి అతనికి కష్టం మాత్రమే కలిగిస్తాయి.

[7] జ్ఞానము గలవాడు మాట్లాడినప్పుడు అతడు జ్ఞానముతో మాట్లాడుతాడు. కాని బుద్ధిహీనులు వినదగినది ఏమీ చెప్పరు.

[8] దుర్మార్గులు అర్పించే అర్పణలు యెహోవాకు అసహ్యం. అయితే మంచి మనిషి చేసే ప్రార్థనలు వినటం యెహోవాకు సంతోషం.

[9] దుర్మార్గులు జీవించే విధానం యెహోవాకు అసహ్యం. మంచి పనులను చేయాలని ప్రయత్నించే మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.

[10] ఒక వ్యక్తి అక్రమంగా జీవించటం మొదలు పెడితే అతడు శిక్షించబడుతాడు. సరిదిద్దబడటానికి ఇష్టపడని మనిషి నాశనం చేయబడతాడు.

[11] మరణస్థానంలో జరిగేదానితో సహా, సమస్తం యెహోవాకు తెలుసు. కనుక మనుష్యుల హృదయాల్లో, మనస్సుల్లో ఏమి జరుగుతుందో యెహోవాకు నిశ్చయంగా తెలుసు.

[12] బుద్ధిహీనుడు తప్పు చేసినప్పుడు అది అతనికి చెబితే ఇష్టం ఉండదు. అతడు జ్ఞానముగల వారిని సలహా అడగటానికి నిరాకరిస్తాడు.

[13] ఒక వ్వక్తి సంతోషంగా ఉంటే అతని ముఖం ఆనందంగా ఉంటుంది. అయితే ఒక మనిషి హృదయంలో విచారం ఉంటే, అప్పుడు అతని స్వభావంలో ఆ దు:ఖం వ్యక్తం అవుతుంది.

[14] జ్ఞానముగలవాడు ఇంకా ఎక్కువ తెలివి సంపాదించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ బుద్ధిహీనునికి ఇంకా ఎక్కువ బుద్ధిహీనత కావాలి.

[15] కొంతమంది పేదవాళ్లు ఎంతసేపూ విచారం గానే ఉంటారు. అయితే హృదయాల్లో సంతోషంగల పేదవాళ్లకు జీవితం ఒక పెద్ద విందులా ఉంటుంది.

[16] ధనికునిగా అనేక కష్టాలు కలిగి ఉండటంకంటె, దరిద్రునిగా ఉండి యెహోవాను గౌరవించటం మేలు.

[17] ద్వేషం ఉన్నచోట విస్తారంగా భోజనం చేయటంకంటే, ప్రేమగల చోట కొద్దిగా భోజనం చేయటం మేలు.

[18] త్వరగా కోపపడేవారు కష్టాన్ని కలిగిస్తారు. కానీ స హనంగల మనిషి శాంతిని కలిగిస్తాడు.

[19] బద్ధకస్తునికి అంతటా కష్టమే ఉంటుంది. కానీ నిజాయితీగల మనుష్యులకు జీవితం తేలిగ్గా ఉంటుంది.

[20] జ్ఞానముగల కుమారుడు తన తండ్రికి సంతోషం కలిగిస్తాడు. అయితే బుద్ధిహీనుడు తన తల్లికి అవమానం తెస్తాడు.

[21] తెలివితక్కువ వానికి తెలివితక్కువ తనమే ఆనందం. కానీ జ్ఞానముగలవాడు సరైన వాటినే చేయటానికి జాగ్రత్తపడతాడు.

[22] ఒక వ్యక్తి సరిపడినంత సలహా తీసుకొనకపోతే, అతని తలంపులు విఫలమవుతాయి. అయితే ఒక వ్యక్తి జ్ఞానముగలవారు తనకు చెప్పే విషయాలు వింటే విజయం పొందగలడు.

[23] ఒక మనిషి మంచి జవాబు ఇచ్చినప్పుడు సంతోషిస్తాడు. మరియు సరైన సమయంలో సరైన మాట చెప్పటం చాలా మంచిది.

[24] జ్ఞానముగల మనిషి చేసే పనులు విజయానికి నడిపిస్తాయి. అతడు మరణ స్థానానికి దిగజారిపోకుండా ఆ విషయాలు అతనిని వారిస్తాయి.

[25] గర్విష్ఠికి ఉన్న గృహమును యెహోవా నాశనం చేస్తాడు. అయితే విధవరాలి వస్తువులను యెహోవా కాపాడుతాడు.

[26] చెడు ఆలోచనలు యెహోవాకు అసహ్యం. కానీ దయగల మాటల విషయంలో యెహోవా సంతోషిస్తాడు.

[27] ఒక వ్యక్తి వస్తువులు సంపాదించటం కోసం దురాశపడితే అతడు తన కుటుంబానికి కష్టం తెచ్చి పెడ్తాడు. కానీ లంచగొండితనాన్ని ద్వేషించే నిజాయితీపరుడు బతుకుతాడు.

[28] మంచి మనుష్యులు జవాబు చెప్పక ముందు ఆలోచిస్తారు. అయితే దుర్మార్గులు ఆలోచించక ముందే మాట్లాడేస్తారు. అది వారికి కష్ఠం కలిగిస్తుంది.

[29] యెహోవా దుర్మార్గులకు చాలా దూరంగా ఉంటాడు. కానీ మంచివాళ్ల ప్రార్థనలు ఆయన ఎల్లప్పుడూ వింటాడు.

[30] నవ్వుతూ ఉండే మనిషి ఇతరులను సంతోషపెడ్తాడు. శుభవార్త మనుష్యులకు మంచి సంతోషాన్ని కలిగిస్తుంది.

[31] ఒక మనిషి తాను తప్పు చేసిననప్పుడు, దానిని సరిదిద్దుటకు చెప్పినప్పుడు జాగ్రత్తగా వినేవాడు చాలా జ్ఞానముగలవాడు.

[32] ఒకడు నేర్చుకొనేందుకు నిరాకరిస్తే అతడు తనకు తానే హాని చేసుకుంటున్నాడు. అయితే ఒక మనిషి తాను చేసింది తప్పు అని చెప్పినప్పుడు వినే మనిషి మరీ ఎక్కువగా గ్రహిస్తాడు.

[33] యెహోవాను గౌరవించువాడు జ్ఞానము గలిగి ఉండటానికి నేర్చుకొంటున్నాడు. ఒక వ్యక్తి నిజంగా యెహోవాను గౌరవించేముందు, వినమ్రుడవాలి.

సామెతలు — Chapters