[1] నాది ఎంత బాధ! పండ్లకాలం తరువాత పండ్లను ఏరుకొనే వాడిలాంటివాణ్ణి. ద్రాక్ష పండ్ల పరిగె సేకరించే వాడిలాంటివాణ్ణి. ద్రాక్షపండ్ల గెల ఒక్కటి కూడా లేదు, నాకిష్టమైన క్రొత్త అంజూరు పండ్లేమీ లేవు.
[2] భక్తులు దేశంలో లేకుండా పోయారు. ప్రజలో నిజాయితీపరుడు ఎవ్వడూ మిగలలేదు. హత్య చేయడానికి అందరూ పొంచి ఉంటారు. ప్రతీవాడు సాటి మానవుణ్ణి వలలో చిక్కించాలని వేటాడుతూ ఉంటాడు.
[3] వాళ్ళు రెండు చేతులతోను కీడు చేయడానికి ఆరితేరినవాళ్ళు. పరిపాలకులు బహుమతులు కోరతారు, న్యాయాధిపతులు లంచాలు పుచ్చుకొంటారు. గొప్పవాళ్ళు తమ దురాశలు తెలుపుతారు. వాళ్ళంతా ఒక్క చేయిగా ఉన్నారు.
[4] వాళ్ళందరిలో మంచివాళ్ళు ముండ్లచెట్టులాంటివాళ్ళు, అందరిలో నిజాయితీపరులు ముండ్లకంచె కంటే కంటక మయులు. మీ కాపరులు చెప్పిన రోజు, మీరు శిక్షకు గురి అయ్యే రోజు వస్తున్నది. ఇప్పుడే ప్రజలు కలవరపడుతున్నారు.
[5] పొరుగువాడిమీద నమ్మకం పెట్టకు. స్నేహితుణ్ణి నమ్ముకోకు. నీ కౌగిట పడుకొనే ఆమె ఎదుట కూడా నీ నోటికి కాపుపెట్టుకో!
[6] కొడుకు తండ్రిని తృణీకారంతో చూస్తున్నాడు. కూతురు తల్లిమీదికి, కోడలు అత్తమీదికి లేస్తున్నారు. ఎవరి ఇంటివాళ్ళు వారికి శత్రువులు.
[7] నేనైతే యెహోవావైపు చూస్తాను, నన్ను రక్షించే నా దేవుని కోసం ఆశతో ఎదురు చూస్తాను. నా దేవుడు నా ప్రార్థనలు వింటాడు.
[8] నా పగవాడా! నామీద అతిశయించకు. నేను క్రింద పడ్డా తిరిగి లేస్తాను. నేను చీకటిలో ఉన్నా, యెహోవా నాకు వెలుగై ఉంటాడు.
[9] నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపాలు చేశాను గనుక ఆయన నాపక్షాన వాదించి న్యాయం తీర్చేవరకూ నేను ఆయన కోపాగ్నికి ఓర్చుకొంటాను. ఆయన నన్ను వెలుగులోకి తెస్తాడు. నేను ఆయన న్యాయాన్ని చూస్తాను.
[10] నా శత్రువు - “నీ దేవుడు యెహోవా ఎక్కడ?” అని నాతో చెప్పిన ఆమె - ఇలా జరగడం చూచి సిగ్గుపాలవుతుంది. నా కళ్ళెదుటే, త్వరలోనే దానిని వీధిలో ఉన్న బురదలాగా త్రొక్కడం జరుగుతుంది.
[11] మీ గోడలు మళ్ళీ కట్టేకాలం వస్తుంది. ఆ రోజులలో మీ సరిహద్దులు విశాలం అవుతాయి.
[12] ఆ రోజుల్లో అష్షూరు నుంచీ ఈజిప్ట్ నగరాలనుంచీ మీ దగ్గరికి వస్తారు. ఈజిప్ట్ మొదలుకొని యూఫ్రటీస్ నదివరకున్న ప్రాంతం నుంచి, ఆ సముద్రం మొదలుకొని ఈ సముద్రం వరకున్న ప్రాంతంనుంచి, ఆయా పర్వత ప్రాంతాలనుంచి మీదగ్గరికి వస్తారు.
[13] అయితే భూనివాసులు చేసిన క్రియల ఫలితంగా భూమి పాడవుతుంది.
[14] దేవా, నీ దండం చేతపట్టుకొని నీ ప్రజకు కాపరిగా ఉండు. వారు నీ సొత్తు. వారు కర్మెల్‌కు చెందిన అడవిలో ప్రత్యేకంగా నివసిస్తున్నారు. పూర్వకాలంలోలాగే వారిని బాషాను, గిలాదులలో పోషించబడనియ్యి.
[15] “మీరు ఈజిప్ట్‌దేశంనుంచి వచ్చిన రోజులలోలాగే నేను అద్భుతాలు ప్రజలకు మళ్ళీ చూపిస్తాను.”
[16] ఇతర జనాలు అది చూచి తమకు బలం లేకపోవడం కారణంగా సిగ్గుపడతారు. చేయి నోటి మీద ఉంచుతారు. వాళ్ళ చెవులకు చెవుడు వస్తుంది.
[17] పాములాగా, నేలమీద ప్రాకే ప్రాణులలాగా వాళ్ళు మట్టి నాకుతారు. తమ కోటల్లోనుంచి వణికిపోతూ వస్తారు. హడలిపోతూ, మన దేవుడు యెహోవావైపుకు తిరుగుతారు. నీకారణంగా భయపడతారు.
[18] నీకు సాటి అయిన దేవుడెవడు? నీవు అపరాధాలను క్షమించే దేవుడివి. నీ సొత్తుగా ఉన్న ప్రజలో మిగిలిన వారి అతిక్రమాలను వదిలిపెట్టే దేవుడివి. నీవు సదాకాలం కోపగించవు. కరుణ చూపడంలో నీకు మహదానందం.
[19] నీవు మమ్ములను మళ్ళీ కనికరిస్తావు. మా అపరాధాలను అణచివేస్తావు. మా పాపాలన్నిటినీ సముద్రం అడుగుకు పడవేస్తావు.
[20] పూర్వ కాలంలో మా పూర్వీకులు అబ్రాహాముకూ యాకోబుకూ ప్రమాణం చేసిన విశ్వసనీయత, అనుగ్రహం నీవు చూపుతావు.