[1] ఇది నీనెవె గురించిన దేవోక్తి: ఎల్‌కోషు పురవాసి నహూముకు వచ్చిన దర్శనం కలిగి ఉన్న గ్రంథం.
[2] యెహోవా రోషం గల దేవుడు, ప్రతీకారం చేసే దేవుడు. యెహోవా ప్రతిక్రియ చేస్తాడు. ఆయన తీవ్ర కోపం గలవాడు. తన శత్రువులకు ప్రతీకారం చేస్తాడు, విరోధుల మీద కోపగించుకొంటూ ఉంటాడు.
[3] యెహోవా త్వరగా కోపపడడు. ఆయన మహా బలాఢ్యుడు. అపరాధాలను శిక్షించకుండా ఉండడు. ఆయన మార్గం తుఫానులో, సుడిగాలిలో ఉంది. మేఘాలు ఆయన పాదాలు కదిలించే ధూళిలాంటివి.
[4] ఆయన సముద్రాన్ని మందలిస్తాడు - అది ఆరిపోతుంది. నదులన్నీ ఇంకిపోయేలా చేస్తాడు. బాషాను, కర్మెలు వాడిపోతాయి. లెబానోను పువ్వులు ఎండిపోతాయి.
[5] ఆయనంటే పర్వతాలు కంపిస్తాయి. కొండలు కరిగిపోతాయి. ఆయన ఎదుట భూమి, భూనివాసులంతా వణకిపోతారు.
[6] ఆయన కోపగిస్తే దాన్ని తట్టుకోగలవాడెవడు? ఆయన తీవ్రకోపం ఎదుట నిలబడగలవాడెవడు? ఆయన ఆగ్రహం అగ్ని ప్రవాహంలాంటిది. ఆయన వస్తే బండలు బ్రద్దలవుతాయి.
[7] యెహోవా ఉత్తముడు. బాధకాలంలో ఆయన ఆశ్రయం లాంటివాడు. తనమీద నమ్మకం ఉంచినవారెవరో ఆయనకు తెలుసు.
[8] పొర్లిపారే వరదలాగా ఆయన ఆ స్థలాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. తన శత్రువులు చీకటిలో దిగేవరకూ ఆయన వాళ్ళను తరుముతాడు.
[9] మీరు యెహోవాకు విరోధంగా ఏమి పన్నినా మిమ్ములను నాశనం చేస్తాడు. ఆపద రెండోసారి రాదు.
[10] శత్రువులు ముండ్లలో చిక్కుబడతారు. ద్రాక్షమద్యం త్రాగి మత్తుగా ఉంటారు. ఎండిపోయిన దుబ్బులాగా కాలిపోతారు.
[11] నీనెవె! యెహోవాకు విరోధంగా కుట్ర పన్ని దురాలోచన చెప్పేవాడొకడు నీలోనుంచి బయలుదేరాడు.
[12] యెహోవా అంటున్నాడు: “వాళ్ళు చాలామంది. పటుత్వం గలవాళ్ళు. అయినా వాళ్ళను నరికివేయడం జరుగుతుంది. వారు గతించిపోతారు. యూదా! నేను మిమ్మల్ని బాధించినా ఇకనుంచి బాధించను.
[13] వాళ్ళు మీమీద మోపిన కాడిని విరగొట్టేస్తాను. మీ కట్లు తెంపివేస్తాను.”
[14] నీనెవే! నిన్ను గురించి యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ఏమంటే “నీ పేరు పెట్టుకొనే వాడు ఇకనుంచి పుట్టడు. నీ దేవుళ్ళ గుళ్ళలోని చెక్కిన విగ్రహాలనూ పోత విగ్రహాలనూ నాశనం చేస్తాను. నీవు నీచుడివి గనుక నిన్ను సమాధిపాలు చేస్తాను.”
[15] ఇదిగో! పర్వతాలమీద శుభవార్త తెచ్చేవాని పాదాలు వస్తున్నాయి! అతడు “శాంతి” చాటిస్తున్నాడు. యూదాప్రజలారా! మీ మహోత్సవాలు ఆచరించండి. మీ మొక్కుబళ్ళు చెల్లించండి. ఇకమీదట దుర్మార్గుడు దండెత్తి మీ దేశంలోకి రాడు. వాడు సమూల నాశనమయ్యాడు.