Skip to content
Opens in a new window

[1] రక్తమయమైన ఆ నగరానికి బాధ తప్పదు! అందులో అన్నీ అబద్ధాలే, అంతటా దోపిడీ, ఎప్పుడూ ఎరను చీల్చడమే!

[2] ఇప్పుడు కొరడా చప్పుడు, చక్రాల ధ్వని, దౌడు తీస్తున్న గుర్రాలు, వేగంతో పోతున్న రథాలు,

[3] వడిగా పరుగెత్తుతున్న రౌతులు, తళతళలాడుతున్న ఖడ్గాలు, మెరుస్తున్న ఈటెలు! అనేకులు హతమవుతున్నారు. చచ్చినవాళ్ళు కుప్పలు కుప్పలుగా కూలుతున్నారు. లెక్క పెట్టలేనన్ని శవాలు కనిపిస్తున్నాయి. పీనుగులు కాలికి తగిలి ప్రజలు తొట్రుపడు తున్నారు.

[4] దీనికి కారణం అది వేశ్యలాగా చేసిన పోకిరీ చేష్టలు. అది శృంగారమైనది. మంత్ర విద్యలో ఆరితేరినది. దాని పోకిరీ పనులద్వారా జనాలను, దాని మంత్రాలద్వారా జాతులను వశం చేసుకొంది.

[5] సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “నేను నీకు విరోధిని. నీ చెంగులు నీ ముఖం మీదికెత్తి జనాలకు నీ దిగంబరత్వాన్ని చూపిస్తాను. రాజ్యాలకు నీ అవమానాన్ని చూపిస్తాను.

[6] నీ మీద అశుద్ధం వేసి నలుగురి ఎదుట నిన్ను సిగ్గుపరుస్తాను.

[7] అప్పుడు నిన్ను చూచేవారందరూ నీ దగ్గరినుంచి పారిపోయి ఇలా అంటారు: ‘నీనెవె పాడైపోయింది. దానికోసం ఎవరు విలపిస్తారు?’ నిన్ను ఓదార్చడానికి ఇష్టమున్నవాళ్ళను నేను ఎక్కడ వెదకాలి?”

[8] నైలునది ఒడ్డున ఉన్న నో అమోనుకంటే నీ స్ధితి మెరుగైనదా? దాని చుట్టూరా నీళ్ళున్నాయి. దానికి రక్ష ఆ గొప్ప నది. ఆ జలం దానికి ప్రాకారంలాంటిది.

[9] దానికి బలం కూషు, ఈజిప్ట్. దానికి సరిహద్దులు లేవు. పూతు, లూబీయా దానికి సహాయం.

[10] అయినా, దాని నివాసులు బందీలై దేశాంతరం పోయారు. దాని చిన్న పిల్లలను ప్రతి అడ్డుత్రోవలో శత్రువులు క్రింద వేసి ముక్కలు చేశారు. దాని ఘనులమీద చీట్లువేశారు, గొప్పవారందరినీ సంకెళ్ళతో బంధించారు.

[11] నీకు కూడా మైకమెక్కుతుంది. నీవు దాక్కొంటావు. శత్రువుల బారినుంచి ఆశ్రయంకోసం వెదకుతావు.

[12] నీ కోటలన్నీ మొదట పక్వమైన పండ్లు గల అంజూరు చెట్లలాంటివి. అలాంటి చెట్లు కదిలిస్తే పండ్లు తినవచ్చినవారి నోట పడతాయి.

[13] నీ నివాసులంతా స్త్రీలలాంటివాళ్ళు. నీ దేశద్వారాలు శత్రువుల ఎదుట తెరచి ఉన్నాయి. వాటి అడ్డకర్రలు మంటలపాలయ్యాయి.

[14] వారు ముట్టడి వేసే కాలానికి నీళ్ళు చేదుకో! నీ కోటలను బలమైనవిగా చెయ్యి! జిగటమట్టిలోకి దిగి ఇటుకల బురద త్రొక్కు! కొలిమి సిద్ధం చెయ్యి!

[15] అక్కడే మంటలు నిన్ను కాల్చివేస్తాయి. ఖడ్గం నిన్ను కూలుస్తుంది, మిడతలు తినివేసే విధంగా నిన్ను నాశనం చేస్తుంది. మిడతలలాగా, ఎగిరే మిడతలలాగా నీ సంఖ్యను పెంపొందించు.

[16] నీ వర్తకుల సంఖ్య ఆకాశంలో కనిపించే నక్షత్రాల లెక్కకంటే ఎక్కువ. అయితే వాళ్ళు అంతా తినివేసి ఎగిరిపోయే మిడతలలాంటివాళ్ళు.

[17] నీ రక్షకభటులు లెక్కకు మిడతలలాగా ఉన్నారు. నీ సైనికులు మిడతల గుంపులలాగా ఉన్నారు. అవి చలికి కంచెలలో దిగుతాయి. ప్రొద్దు పొడిస్తే అవి ఎగిరిపోతాయి. ఎక్కడికి పోతాయో ఎవరికి తెలియదు.

[18] అష్షూరు రాజా! నీ కాపరులు నిద్రపోయారు, నీ ప్రముఖులు పడుకొన్నారు, నీ ప్రజలు కొండలమీద చెదరివున్నారు, వారిని పోగు చేయడానికి ఎవ్వడూ లేడు.

[19] నీకు తగిలిన దెబ్బ చాలా ఘోరం. నీ గాయం కుదరనిది. నీ విషయం కబురు వినేవారంతా నీ పతనాన్ని గురించి చప్పట్లు కొడతారు. ఎందుకంటే, నీవు ఎడతెగకుండా పెట్టే హింసకు గురి కానివారు ఎవరు!

నహూము — Chapters