[1] ఇది హబక్కూకుప్రవక్తకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి.
[2] యెహోవా! నీవు వినకుండా ఉంటే నేను ఎంత కాలమని సహాయంకోసం మొరపెట్టాలి? “దౌర్జన్యం జరుగుతూ ఉంది” అని నేను నీకు ఆక్రందన చేసినా నీవు రక్షణ ప్రసాదించడం లేదు.
[3] నేను చెడుగు చూచేలా చేస్తున్నావెందుకని? కష్టాలను నీవెందుకు చూచి ఊరుకుంటున్నావు? నా ఎదుట నాశనం, దౌర్జన్యం కనిపిస్తూ ఉన్నాయి. జగడాలూ కలహాలూ రేగుతూ ఉన్నాయి.
[4] అందుచేత ధర్మశాస్త్రం నిష్ఫలం అయ్యింది, న్యాయం ఎప్పుడూ తప్పుతూ ఉంది. దుర్మార్గులు న్యాయవంతులను చుట్టుముట్టి ఉన్నారు గనుక న్యాయం తారుమారు అవుతున్నది.
[5] “ఇతర జనాలలో జరుగుతున్నది చూస్తూ ఉండండి. చూచి కేవలం నిర్ఘాంతపోండి! మీ రోజుల్లో నేను చేయబోయే క్రియను గురించి మీకు ఎవరైనా చెపితే మీరు నమ్మేవారు కారు.
[6] ఇదిగో వినండి. నేను కల్దీయదేశస్థులను పురికొలుపుతున్నాను. వారు ఉద్రేకం గల క్రూరులు, ఇతరుల నివాస స్థలాలను ఆక్రమించాలని విశాల భూభాగాల గుండా దాటిపోయేవారు.
[7] వారు భయంకరులు, బీకర జనం. ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలనూ ప్రభుత్వాన్నీ విధిస్తారు.
[8] వారి గుర్రాలు చిరుతపులులకంటే వేగంతో పరుగెత్తగలవు. సాయంకాల సమయంలో తిరుగులాడే తోడేళ్ళకంటే అవి చురుకుగా ఉంటాయి. వారి రౌతులు దూరంనుంచి గుర్రాలను దొమ్మిగా పరుగులెత్తిస్తూ వస్తారు. ఎరను పట్టుకోవడానికి ఎగురుతున్న గరుడపక్షిలాగా అతి వేగంతో వస్తారు.
[9] ఒక్క పెట్టున వాళ్ళంతా సూటిగా చూస్తూ దౌర్జన్యం చేయడానికి వస్తారు. ఇసుకరేణువుల్లా ఉన్న ప్రజలను చెరపట్టుకొంటారు.
[10] రాజులను వెక్కిరిస్తారు, అధిపతులను హేళన చేస్తారు. కోటలన్నిటినీ చూచి నవ్వుకొంటారు. మట్టి దిబ్బలు చేసి వాటిని పట్టుకొంటారు.
[11] అప్పుడు గాలి వీచేవిధంగా వడిగా సాగిపోతారు. వారు అపరాధులు. వారి బలమే వారికి దేవుడు.”
[12] యెహోవా! నా దేవా! నా పవిత్ర దేవా! నీవు ఆదినుంచి ఉన్నావు గదా! మేము మృతికి గురి కాబోము. యెహోవా! వారిని తీర్పు సాధనాలుగా నియమించావు. ఆధారశిలా! వారు దండన చేసేలా నీవు వారిని నిర్ణయించావు.
[13] నీ కండ్లు చెడుగును చూడలేనంత పరిశుద్ధంగా ఉన్నాయి. కష్టాలను చూచి ఊరుకోలేవు. మరి, వంచకులను చూచి ఎందుకు ఓర్చుకొంటున్నావు? దుర్మార్గులు తమకంటే న్యాయవంతులను దిగమింగివేస్తూ ఉంటే నీవెందుకు ఊరుకొంటావు?
[14] నీవు మనుషులను ఏలిక లేని చేపలలాగా, ప్రాకేప్రాణుల్లాగా చేయడం ఎందుకు?
[15] వాడు గాలాలు వేసి మనుషులందరిని గుచ్చి లాగివేస్తాడు. తన వలలో వారిని చిక్కించుకొంటాడు. వలలో సమకూర్చి సంతోషంతో గంతులు వేస్తాడు.
[16] అందుకని తన వలకు బలులు అర్పిస్తాడు, తన వలకు ధూపం వేస్తాడు. వాటివల్ల వాడి రాబడి అధికం, వాడి ఆహారం శ్రేష్ఠం.
[17] వాడు ఎడతెరపి లేకుండా నిండిపోయిన తన వల ఖాళీ చేస్తూ ఉంటాడా? ఎన్నటికీ మానకుండా జనాలను హతమారుస్తూ ఉంటాడా?