[1] హబక్కూకుప్రవక్త చేసిన ప్రార్థన, భజన:
[2] యెహోవా! నిన్ను గురించిన వార్త నేను విన్నాను. అది నాకు భయభక్తులు కలిగిస్తూ ఉంది. యెహోవా! పూర్వం నీవు చేసిన క్రియలు ఈ సంవత్సరాల్లో మళ్ళీ చెయ్యి. ఈ సంవత్సరాల్లో వాటిని తెలియజెయ్యి. కోపంలో కరుణ మరచిపోకు.
[3] దేవుడు తేమానునుంచి బయలుదేరుతున్నాడు. పవిత్ర దేవుడు పారానుకొండ సీమనుంచి తరలి వస్తున్నాడు. (సెలా) ఆయన ప్రకాశం ఆకాశ మండలమంతటా కనబడుతూ ఉంది. లోకం ఆయన కీర్తితో నిండి ఉంది.
[4] ఆయన మహిమాప్రకాశం సూర్యకాంతిలాంటిది. ఆయన బలం ఆయన చేతిలో మరుగై ఉంది. ఆయన చేతిలో నుంచి కిరణాలు తళతళలాడుతూ ఉన్నాయి.
[5] ఆయనకు ముందుగా చీడ తెగులు నడుస్తూ ఉంది. ఆయన అడుగు జాడలలో విష జ్వరాలు వస్తూ ఉన్నాయి.
[6] ఆయన నిలబడితే భూమి కంపిస్తుంది. ఆయన చూస్తే జనాలు వణకుతాయి, ఆదికాల పర్వతాలు బ్రద్దలైపోతాయి, పురాతనమైన కొండలు అణగిపోతాయి. ఆయన విధానాలు శాశ్వతమైనవి.
[7] కూషానువాళ్ళ డేరాల మీదికి విపత్తు రావడం నేను చూశాను. మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గడగడ వణికాయి.
[8] యెహోవా! నీ గుర్రాలను కట్టుకొని జయసూచకమైన రథాలమీద ఎక్కి వస్తున్నావు. నీకు నదులమీద ఆగ్రహం వచ్చిందా? నీవు కోపగించేది ప్రవాహాలమీదేనా? నీ కోపం సముద్రంమీద ఉందా?
[9] నీ విల్లు వరలోనుంచి తీస్తున్నావు. నీ వాక్కుతోడని ప్రమాణ పూర్వకంగా నీ బాణాలు ఎక్కిస్తున్నావు. (సెలా) నదులతో భూమిని చీలుస్తున్నావు.
[10] నిన్ను చూచి పర్వతాలు అల్లాడిపోతున్నాయి. నీటిప్రవాహాలు వేగంగా పారుతున్నాయి. జలాగాధం ఘోషిస్తూ, తన చేతులు పైకెత్తుతున్నది.
[11] తళతళలాడే నీ ఈటెలను, మెరిసే నీ బాణాలను చూచి సూర్యమండలం, చంద్రబింబం తమ స్థానాలలో ఆగిపోతున్నాయి.
[12] నీవు తీవ్ర కోపంతో భూమిమీద సాగిపోతున్నావు. ఆగ్రహంతో జనాలను అణగద్రొక్కుతున్నావు.
[13] నీ ప్రజను రక్షించడానికి నీవు బయలుదేరుతున్నావు. నీ అభిషిక్తుణ్ణి కాపాడడానికి బయలు దేరుతున్నావు. దుర్మార్గుల ఇంటి యజమానిని నీవు చితగ్గొట్టివేస్తున్నావు. వాళ్ళ మెడను ఖండించి వాళ్ళను నిర్మూలం చేస్తున్నావు.
[14] దాక్కొన్న బాధితులను ఆతురతతో దిగమ్రింగేవిధంగా ఆ యోధులు మమ్ములను పారదోలడానికి తుఫానులాగా వస్తూ ఉంటే, వాళ్ళ నాయకుణ్ణి అతడి సొంత ఈటెతో పొడుస్తున్నావు.
[15] నీ గుర్రాలను సముద్రంమీద త్రొక్కిస్తున్నావు. ఉప్పొంగిపోతున్న మహా జలాలమీద త్రొక్కిస్తున్నావు.
[16] ఇది విని నేను అంతరంగంలో కలవరపడుతున్నాను. ఆ శబ్దానికి నాపెదవులు కదులుతున్నాయి. నా ఎముకలు కుళ్ళిపోతున్నట్టున్నాయి. నా కాళ్ళు వణకుతున్నాయి. అయితే మాపై పడబోయే వాళ్ళమీదికి విపత్తు వచ్చేవరకు నేను నెమ్మదిగా ఎదురు చూస్తూ ఉంటాను.
[17] అంజూరు చెట్లు వికసించకపోయినా, ద్రాక్షచెట్లు పండ్లు ఇవ్వకపోయినా, ఆలీవ్ చెట్ల పంట లేకపోయినా, పొలాలలో పైరు కోతకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, పశువులు కొట్టంలో లేకపోయినా,
[18] నేను యెహోవాను బట్టి ఆనందిస్తాను. నా రక్షకుడైన దేవుని మూలంగా సంతోషిస్తాను.
[19] యెహోవాప్రభువు నాకు బలం. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళలాగా చేస్తాడు. నేను ఎత్తు స్థలాలమీద నడవగలిగేలా చేస్తాడు. (ఇది గాయకుల నాయకుడికోసం తంతి వాద్యాలతో పాడతగ్గది.)