[1] నా కావలి స్థలంలో ఉండిపోతాను, గోపురంమీద దృఢంగా నిలబడి ఉంటాను. యెహోవా నాతో ఏమి చెపుతాడో, నా వివాదం విషయం నేను ఏమి జవాబివ్వాలో ఎదురు చూస్తూ ఉంటాను.
[2] యెహోవా నీకు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు: ‘‘దర్శనంలో వెల్లడి అయిన విషయం పలకలమీద వ్రాయి. పరుగెత్తేవాడు కూడా అది చదవగలిగేలా స్పష్టంగా వ్రాయి.
[3] వెల్లడి అయిన విషయం నిర్ణయ కాలంలో జరుగుతుంది. దాని నెరవేర్పు త్వరగా వస్తుంది. అది తప్పక జరుగుతుంది. అది ఆలస్యంగా వచ్చినా దానికోసం ఎదురు చూస్తూ ఉండు. కానీ ఆలస్యం కాకుండా అది జరిగితీరుతుంది.
[4] ఇదిగో విను. వాడు గర్విష్ఠుడు, హృదయంలో నిజాయితీగలవాడు కాదు. నిర్దోషి తన నమ్మకంవల్లే జీవిస్తాడు.
[5] “ద్రాక్షమద్యం ఆ అహంభావిని మోసగించింది. వాడికి నెమ్మది లేదు. వాడు మృత్యులోకమంత అత్యాశ గలవాడు. మృత్యువులాగా వాడికి తృప్తి ఉండదు. వాడు అన్ని దేశాలవారిని వశపరచుకొంటాడు. అన్ని జనాలను పోగు చేసుకొంటాడు.
[6] అయితే వారంతా వాణ్ణి ఉద్దేశించి ఇలా సామెత, ఎగతాళిపాట ఎత్తుతారు: ‘తనది కానిదానిని పోగు చేసేవాడికి బాధ తప్పదు. తాకట్టు వస్తువులవల్ల ధనం సంపాదించినవాడికి బాధతప్పదు. అలాంటివాడు ఎన్నాళ్ళవరకు అలా చేయగలడు?
[7] నీ రుణస్తులు హఠాత్తుగా లేస్తారు. వారు నిలబడి నిన్ను వణికిస్తారు. నీవు వారికి ఎరలాగా ఉంటావు.
[8] అనేక దేశాలవారి ఆస్తిని నీవు దోచుకొన్నావు. రక్తపాతం జరిగించావు, దేశాలకూ పట్టణాలకూ వాటిలో ఉన్న నివాసులందరికీ దౌర్జన్యం చేశావు. గనుక మిగిలిన ప్రజలు నీ ఆస్తిని దోచుకొంటారు.
[9] “ఆపద రాకుండా చేసేందుకు నివాస స్థలాన్ని భద్రపరచుకోవడానికి కుటుంబంకోసం అన్యాయ లాభం చేకూర్చుకొన్న వాడికి బాధ తప్పదు.
[10] నీవు దురాలోచన చేసి అనేక దేశాలవారిని నాశనం చేయడం మూలాన నీ ఇంటివారిని అవమానానికి గురి చేశావు, నీమీదికి దోష శిక్షను తెచ్చిపెట్టుకొన్నావు.
[11] గోడల రాళ్ళు మొర పెట్టుకొంటాయి, ఇంటి వాసాలు జవాబిస్తాయి.
[12] “రక్తపాతంచేత నగరాన్ని నిర్మించేవాడికి, చెడుగు చేయడంచేత పట్టణాన్ని స్థాపించేవాడికి బాధ తప్పదు.
[13] ప్రజల ప్రయాస అంతా మంటలపాలవుతుందని జనాలు వట్టిదానికోసం కష్టపడి నీరసించిపోవాలని సేనలప్రభువు యెహోవా నిర్ణయించాడు గదా?
[14] అయితే సముద్రం నీళ్ళతో నిండి ఉన్నట్టు భూలోకం యెహోవా మహత్తు విషయమైన జ్ఞానంతో నిండి ఉంటుంది.
[15] “తన పొరుగువాళ్ళ దిగంబరత్వాన్ని చూడాలని వాళ్ళకు మత్తు ఎక్కేవరకు తిత్తులలోనుంచి ద్రాక్షమద్యం పోసేవాడికి బాధ తప్పదు.
[16] అలాంటి నీవు ఘనతకు బదులుగా అవమానానికే గురి అవుతావు. నీవే త్రాగి నీ మానాన్ని కనుపరచుకొంటావు. యెహోవా కుడిచేతిలో ఉన్న పాత్రలోనిది త్రాగడం నీ వంతవుతుంది. అపకీర్తి నీ ఘనతను కప్పుకొంటుంది.
[17] లెబానోనుకు చేసిన దౌర్జన్యం నీకు ముంచుకు వస్తుంది. జంతువులను నాశనం చేశావు - ఆ భయం నీమీదే పడుతుంది. నరహత్య చేశావు. ఆయాప్రాంతాలకు పట్టణాలకూ వాటి నివాసాలకూ బలాత్కారం చేశావు. గనుకనే నీకు అలా జరుగుతుంది.
[18] “ప్రతిమవల్ల ఏమి ప్రయోజనం? శిల్పి దాన్ని చెక్కుతాడు గదా? విగ్రహం మోసకరం. దానివల్ల ఏమి ప్రయోజనం? తాను చేసిన దానిమీద తానే నమ్మకం ఉంచడం వల్ల ఏమి ప్రయోజనం? అతడు చేసినది మూగబొమ్మ.
[19] కర్రను చూచి ‘మేలుకో’ అనీ మూగరాయిని చూచి ‘లే’ అనీ చెప్పేవాడికి బాధ తప్పదు. అది ఉపదేశం ఇవ్వగలదా? అది బంగారంతో వెండితో పూత పూసి ఉంది. దానికి ప్రాణం మాత్రం లేదు.
[20] కానీ యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు. ఆయన ఎదుట లోకమంతా మౌనం వహించాలి.”