Skip to content
Opens in a new window

[1] ఇది యోతాం, ఆహాజు, హిజ్కియా అనే యూదా దేశం రాజుల రోజులలో మోరెషతు పురవాసి మీకాకు యెహోవానుంచి వచ్చిన వాక్కు. ఇది షోమ్రోను, జెరుసలం గురించి దర్శనరీతిగా వచ్చింది.

[2] జనాల్లారా! మీరంతా ఆలకించండి! లోకమా! సర్వ భూనివాసులారా! చెవి ఒగ్గి వినండి! ప్రభువైన యెహోవా మీమీద సాక్ష్యం చెప్పబోతున్నాడు, ప్రభువు తన పవిత్రాలయంలో ఉండి మాట్లాడబోతున్నాడు.

[3] ఇదిగో! యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుతున్నాడు! ఆయన దిగి భూమిమీది ఎత్తయిన స్థలాలపై నడుస్తూ ఉన్నాడు!

[4] ఆయన పాదాలక్రింద పర్వతాలు నిప్పుకు కరిగిపోయే మైనంలాగా కరిగిపోతున్నాయి. లోయలు చీలిపోతున్నాయి. వాలుమీద పడ్డ నీళ్ళు పారే విధంగా అవి కరిగి పారుతున్నాయి.

[5] దీనంతటికీ కారణం యాకోబు వంశీయుల అపరాధాలు. యాకోబు వంశీయుల తిరుగుబాటుకు మూలం ఏది? షోమ్రోనులోనే గదా. యూదా దేశస్థుల ఎత్తయిన పూజాస్థలం ఉండేది ఎక్కడ? జెరుసలంలోనే గదా.

[6] “అందుచేత నేను షోమ్రోనును పొలంలో ఉన్న రాళ్ళ కుప్పలాగా చేస్తాను, ద్రాక్షతోటలను నాటేస్థలంగా చేస్తాను. దాని రాళ్ళు లోయలో పారబోస్తాను, దాని పునాదులు కనబడేలా చేస్తాను.

[7] షోమ్రోనులో ఉన్న చెక్కుడు బొమ్మలు చిన్నాభిన్నం అవుతాయి. దాని కానుకలు మంటలపాలవుతాయి. నేను దానిలో ఉన్న విగ్రహాలన్నిటినీ పాడు చేస్తాను. వేశ్యల సంపాదన చేత షోమ్రోను వాటిని పోగు చేసింది. అవి మళ్ళీ వేశ్యల సంపాదన అవుతాయి.”

[8] ఈ కారణంచేత నేను కేకలుపెట్టి విలపిస్తాను. చెప్పులూ బట్టలూ వేసుకోకుండా తిరుగుతాను. నక్కలలాగా అరుస్తాను. నిప్పుకోళ్ళలాగా మూలుగుతాను.

[9] షోమ్రోనుకు తగిలిన గాయాలు నయం కానివి. అవి యూదాదేశానికి కూడా తగిలాయి. అవి జెరుసలం వరకు - నా ప్రజాద్వారాలవరకు - వ్యాపించాయి.

[10] ఈ సంగతి గాతులో చెప్పకు. అక్కడ ఏమాత్రం ఏడ్వకు. బేత్‌లెయప్రలో ధూళిలో పడి పొర్లాలి.

[11] షాఫీరు పురవాసులారా, దిగంబరులై సిగ్గుపడుతూ వెళ్ళిపోండి. జయనాను కాపురస్థులు బయలుదేరలేక పోతున్నారు, బేత్‌ఎజెల్‌లో విలాపం వినబడుతూ ఉంది. అక్కడ మీకు ఆధారం లేకుండా పోయింది.

[12] మారోతు గ్రామ వాసులు తాము కోల్పోయిన క్షేమం కారణంగా బాధ అనుభవిస్తున్నారు. ఎందుకంటే, యెహోవా విపత్తు కలిగించాడు. అది జెరుసలం ద్వారాలవరకూ వచ్చింది.

[13] లాకీషు పట్టణస్థులారా! రథాలకు యుద్ధాశ్వాలను పూన్చండి. ఇస్రాయేల్ ప్రజ చేసిన తిరుగుబాట్లు మీ మధ్య కనిపించాయి. మీరు సీయోను కుమార్తె అపరాధానికి ప్రథమ కారణంగా ఉన్నారు.

[14] మీరు విడుదలకోసం మోరెషత్‌గాతుకు కానుకలిస్తారు. అక్‌జీబు ఊరు ఇస్రాయేల్ రాజులను మోసగిస్తుంది.

[15] మారేషా పురవాసులారా! మిమ్ములను వశపరచుకొనేవాణ్ణి మీమీదికి నేను రప్పిస్తాను. ఇస్రాయేల్ ప్రజల్లో ఉన్న ఘనుడు అదుల్లాంకు వెళ్ళిపోతాడు.

[16] మీ తలలు బోడి చేసుకోండి. ప్రియమైన పిల్లలు బందీలుగా దేశాంతరం వెళ్ళిపోతారు. రాబందులాగా మీ బోడితనం ఎక్కువ చేసుకోండి.

మీకా — Chapters