[1] సైన్య సమూహాలు గల నగరమా! నీ సైన్య సమూహాలను సమకూర్చు. శత్రువులు మనలను ముట్టడించారు. వారు ఇస్రాయేల్ ప్రజల పరిపాలకుణ్ణి బెత్తంతో చెంపమీద కొడతారు.
[2] “బేత్‌లెహేం ఎఫ్రాతా! యూదావారి కుటుంబాల మధ్య నీవు చిన్న గ్రామం. అయినా నాకోసం ఇస్రాయేల్‌ప్రజలను పరిపాలించబోయేవాడు నీలోనుంచి వస్తాడు. ఆయన పూర్వ కాలంనుంచి, అనాది కాలంనుంచి గమనంలో ఉండేవాడు.
[3] అందుచేత ప్రసవవేదన పడబోయే ఆమె శిశువును కనేవరకు ఆయన ఇస్రాయేల్ ప్రజలను ఇతరులకు అప్పగిస్తాడు. అప్పుడు ఆయన సోదరులలో మిగిలినవారు ఇస్రాయేల్‌ప్రజల మధ్యకు తిరిగి చేరుతారు.
[4] ఆయన యెహోవా బలంమూలంగా, తన దేవుడైన యెహోవా నామ మహత్తుచేత నిలుచుండి తన మందకు కాపరిగా ఉంటాడు. ఆయన మహాత్మ్యం భూమికొనలవరకు కనిపిస్తుంది. ఆయనే వారికి శాంతి అవుతాడు గనుక వారు నిర్భయంగా నివాసం చేస్తారు.
[5] అష్షూరువాడు దండెత్తి మన దేశంలోకి వచ్చి మన భవనాలలో చొరబడేటప్పుడు వాణ్ణి ఎదిరించడానికి మేము ఏడుగురు కాపరులనూ ఎనిమిదిమంది నాయకులనూ నియమిస్తాం.
[6] వారు ఖడ్గం చేతపట్టుకొని అష్షూరుదేశాన్ని దాని నగర ద్వారాలలో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు. అష్షూరువాళ్ళు దండెత్తి మన సరిహద్దులను దాటి మన దేశంలోకి వచ్చేటప్పుడు వాళ్ళ బారినుంచి ఆయన మనలను రక్షిస్తాడు.
[7] యాకోబు సంతానంలో మిగిలినవారు అనేక జనాలమధ్య నివసిస్తూ, యెహోవా కురిపించే మంచులాగా ఉంటారు. మనుషుల ప్రయత్నమూ ఆలోచనా లేకుండా గడ్డిమీద పడే వానలాగా ఉంటారు.
[8] యాకోబు సంతతిలో మిగిలినవారు జనాలమధ్య, అనేక దేశాలవారి మధ్య నివసిస్తారు, అడవి మృగాలలో సింహం ఎలాగుంటుందో అలాగే ఉంటారు. గొర్రెల మందలలో కొదమ సింహంలాగా మందలోకి చొచ్చి ఎవ్వడూ గొర్రెలను విడిపించలేనంతగా వాటిని త్రొక్కుతూ, చీలుస్తూ ఉన్న కొదమ సింహంలాగా ఉంటారు.
[9] మీ హస్తం మీ విరోధులమీద విజయం సాధిస్తుంది. మీ శత్రువులంతా నాశనమవుతారు.
[10] యెహోవా చెప్పేదేమంటే, “ఆ రోజులలో నేను మీ మధ్య ఉన్న గుర్రాలన్నిటినీ లేకుండా చేస్తాను. మీ రథాలను ధ్వంసం చేస్తాను.
[11] మీ దేశంలో ఉన్న పట్టణాలను నాశనం చేస్తాను. మీ కోటలన్నిటినీ పడకొట్టిస్తాను.
[12] మీ మధ్య మంత్రవిద్య లేకుండా నిర్మూలం చేస్తాను. అప్పటినుంచి మీ మధ్య శకునగాండ్లు ఉండరు.
[13] చెక్కిన విగ్రహాలూ దేవతాస్తంభాలూ మీ మధ్య లేకుండా నాశనం చేస్తాను. అప్పటినుంచి మీరు చేతులతో చేసినవాటికి మ్రొక్కరు.
[14] మీ మధ్య ఉన్న అషేరాదేవి చిహ్నాలను నిర్మూలిస్తాను. మీ పట్టణాలను ధ్వంసం చేస్తాను.
[15] నా మాట వినని ఇతర జనాలకు మహా కోపంతో ప్రతీకారం చేస్తాను.”