[1] పడకలమీద పడుకొని వంచన విధానాలు కల్పించే వాళ్ళకూ దురాలోచనలు చేసేవాళ్ళకూ బాధ తప్పదు. వాటిప్రకారం చేయడానికి వాళ్ళు శక్తిమంతులు గనుక ప్రొద్దు పొడవగానే అలా చేస్తారు.
[2] వాళ్ళు భూములనూ ఇండ్లనూ ఆశించి ఆక్రమించుకొంటారు. ఇతరుల ఇండ్లనూ వారసత్వాన్నీ అన్యాయంగా పట్టుకొంటారు.
[3] అందుచేత యెహోవా చెప్పేదేమంటే, “నేను ఈ వంశస్థుల మీదికి విపత్తు రప్పించదలుస్తున్నాను. దాని క్రిందనుంచి మీ మెడలను వదలించుకోలేరు. ఆ ఆపద కాలం వచ్చేటప్పుడు మీరు గర్వంగా నడవలేరు.
[4] ఆ కాలంలో మనుషులు మీ విషయం తిట్టుకవిత చెపుతారు. శోకరసం ఉట్టిపడే ఈ పాటతో ఎత్తిపొడుస్తారు: ‘మేము పూర్తిగా పాడైపోయాం! నా ప్రజల భూభాగాన్ని ఆయన ఇతర జనాలకు ఇచ్చాడు. అది నాకు లేకుండా చేశాడు. మా పొలాలు ద్రోహులకు పంచియిచ్చాడు.”
[5] అందుచేత చీట్లు వేసి మీకు భూమి పంచిపెట్టడానికి యెహోవా సమాజంలో ఎవరూ ఉండరు.
[6] “మీరు ఏమీ ప్రకటించకూడదు. దీన్ని గురించి ప్రకటించకూడదు. మేము నిందలపాలు కాబోము” అని వాళ్ళు ప్రకటన చేస్తారు.
[7] “యాకోబు వంశీయులారా! ‘యెహోవా సహనం తగ్గిపోయిందా? ఆయన ఇలాంటి పనులు చేస్తాడా?’ అని చెప్పడం యుక్తమా? యథార్థంగా ప్రవర్తించేవారికి నా మాటలు క్షేమం కలిగిస్తాయి గదా.
[8] అయితే ఇటీవల నా ప్రజలు శత్రువులుగా నామీదికి లేచారు. యుద్ధరంగం నుంచి తిరిగి వచ్చి నిర్భయంగా దారిన పోతూ ఉంటే, వారు వేసుకొన్న పైవస్త్రాలను మీరు లాగివేస్తారు.
[9] నా ప్రజలలో స్త్రీలను వారికి హాయిగొలిపే ఇండ్ల నుంచి పారదోలుతారు. వారి సంతానం మధ్య నా ఘనతను ఎన్నటికీ ఉండకుండా చేస్తున్నారు.
[10] మీరు లేచి వెళ్ళిపోండి! ఇక్కడ మీకు విశ్రాంతి కలగదు. ఈ స్థలం అశుద్ధమై సమూల నాశనానికి గురి అవుతుంది.
[11] మోసగాడు, అబద్ధికుడు ఎవడైనా వచ్చి ‘ఎక్కువ ద్రాక్షరసం, మద్యం ఇస్తే నేను మీతో దైవావేశంతో పలుకుతాను’ అని అబద్ధం చెప్తాడనుకోండి. అలాంటివాడే ఈ ప్రజలకు తగిన ప్రవక్త!
[12] “యాకోబు వంశంవారలారా! తరువాత మిమ్ముల నందరినీ పోగు చేసితీరుతాను. ఇస్రాయేల్ ప్రజలలో మిగిలినవారిని సమకూర్చితీరుతాను. దొడ్డిలో ఉన్న గొర్రెలలాగా, మేత స్థలంలో ఉన్న మందలాగా వారిని సమకూరుస్తాను. ఈ స్థలాలలో అంతటా మనుషులు చేసే కలకలం వినబడుతూ ఉంటుంది.
[13] గోడలు పడగొట్టే వాడు వారికి ముందుగా వెళ్తాడు. వారు గుమ్మాన్ని పడగొట్టి దానిగుండా బయటికి వస్తారు. వారి రాజు వారికి ముందుగా నడుస్తాడు. యెహోవా తానే వారికి నాయకుడుగా ఉంటాడు.”