[1] ఇది యోనా దృష్టికి ఎంతమాత్రం మంచి అనిపించలేదు. అతడు కోపంతో మండిపడ్డాడు.
[2] “యెహోవా! నేను నా దేశంలో ఇంకా ఉన్నప్పుడు ఇలా జరుగుతుందని నేను చెప్పాను గదా! అందుకనే తర్‌షీషుకు పారిపోవడానికి త్వరపడ్డాను. నీవు దయాదాక్షిణ్యం గల దేవుడివనీ త్వరగా కోపగించేవాడివి కావనీ కరుణామయుడివనీ విపత్తు కలిగించడానికి వెనక్కు తీసేవాడివనీ నాకు తెలుసు.
[3] ఇప్పుడు నాకు బతికేకంటే చావే మేలనిపిస్తుంది. యెహోవా! నా ప్రాణం తియ్యి!” అంటూ యెహోవాను ప్రార్ధించాడు.
[4] అందుకు యెహోవా “నీవిలా మండిపడడం మంచిదా?” అని అడిగాడు.
[5] తరువాత యోనా నగరం బయటికి వెళ్ళి దానికి తూర్పుగా ఒక చోట కూర్చున్నాడు. అక్కడ ఒక పందిరి వేసికొని దాని నీడలో కూర్చుని నగరానికి ఏమి సంభవిస్తుందో చూద్దామని అక్కడే ఉండిపోయాడు.
[6] యోనాకు కలిగిన బాధను పోగొట్టడానికి ఒక సొర చెట్టు పెరిగి అతడి తలకు పైగా నీడ ఇచ్చేలా యెహోవా దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. సొరచెట్టును చూచి యోనా ఎంతో సంతోషించాడు.
[7] మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగును సిద్ధం చేసి ఉంచాడు. అది ఆ చెట్టును తొలిచింది. చెట్టు వాడిపోయింది.
[8] ప్రొద్దు పొడిచినప్పుడు దేవుడు చాలా వేడిగల తూర్పు గాలిని సిద్ధం చేశాడు. యోనా తలకు ఎండ దెబ్బ తగిలింది. అతడు నీరసించిపోతూ, చావాలని కోరుతూ, “నాకు బతకడం కంటే చావడమే మేలనిపిస్తుంది” అన్నాడు.
[9] యెహోవా “ఆ సొరచెట్టు విషయం నీవు కోపంతో మండిపడడం మంచిదా?” అని యోనాను అడిగాడు. యోనా “మంచిదే! ప్రాణం పోయేటంతగా మండి పడుతున్నాను” అన్నాడు.
[10] అందుకు యెహోవా ఇలా అన్నాడు: “నీవు ఆ సొరచెట్టును పెంచలేదు. అది నీ కష్టఫలం కాదు. ఒక్క రాత్రిలో మొలిచి పెరిగింది, ఒక్క రాత్రిలో వాడిపోయి చచ్చింది. అయినా దాని విషయం నీకు శ్రద్ధాసక్తులున్నాయి.
[11] నీనెవెలో కుడి యెడమలు తెలియని లక్ష ఇరవై వేల మందికంటే ఎక్కువమంది ఉన్నారు. చాలా పశువులు కూడా ఉన్నాయి. ఆ మహా నగరం విషయం నాకు శ్రద్ధాసక్తులు ఉండకూడదా?”