Skip to content
Opens in a new window

[1] అప్పుడు సొలొమోనురాజు యెహోవా ఒడంబడికపెట్టెను తెప్పించాలని కోరాడు. అది సీయోను అనే దావీదు నగరంలో ఉంది. గనుక ఇస్రాయేల్‌ప్రజల పెద్దలను – గోత్రాల నాయకులందరినీ ఇస్రాయేల్‌ప్రజల పూర్వీకుల వంశ ప్రధానులందరినీ సొలొమోను తనదగ్గరికి జెరుసలంకు పిలిపించాడు.

[2] ఈ ఇస్రాయేల్ మనుషులంతా ఎతనీం అనే ఏడో నెలలో జరిగే పండుగ సమయంలో సొలొమోనురాజు దగ్గర సమావేశం అయ్యారు.

[3] ఇస్రాయేల్ ప్రజల పెద్దలంతా వచ్చాక యాజులు యెహోవా ఒడంబడికపెట్టెను ఎత్తుకొని

[4] దానినీ సన్నిధిగుడారాన్నీ గుడారంలో ఉన్న ఆ పవిత్ర సామాన్నంతా తీసుకువచ్చారు. యాజులూ లేవీగోత్రికులూ కలిసి వాటిని తీసుకువచ్చారు.

[5] అప్పుడు సొలొమోనురాజు, అతని దగ్గర సమావేశం అయిన ఆ ఇస్రాయేల్‌వారంతా ఒడంబడిక పెట్టె ముందు నిలబడ్డారు. లెక్కించ వీలులేనన్ని గొర్రెలనూ, ఎద్దులనూ బలి చేశారు.

[6] ఆ తరువాత యాజులు యెహోవా ఒడంబడికపెట్టెను దాని స్థలానికి తీసుకువచ్చారు. గర్భగృహం అనే అతి పవిత్ర స్థలంలో కెరూబుల రెక్కల క్రింద ఉంచారు.

[7] కెరూబుల రెక్కలు ఒడంబడిక పెట్టె ఉన్న స్థలం వరకు చాపి ఉన్నాయి. ఆ రెక్కలు పెట్టెకూ దాని మోత కర్రలకూ పైగా ఉండి వాటిని కప్పివేశాయి.

[8] ఆ కర్రలు చాలా పొడవుగా ఉన్నాయి. గర్భగృహానికి ముందున్న పవిత్ర స్థలంలో నుంచి చూస్తే అవి కనబడ్డాయి గాని బయట నుంచి కనబడలేదు. ఈనాటికీ అవి అక్కడే ఉన్నాయి.

[9] ఒడంబడికపెట్టెలో రెండు రాతి పలకలు ఉన్నాయి గాని మరేమీ లేదు. ఇస్రాయేల్ ప్రజలు ఈజిప్ట్ నుంచి వచ్చినప్పుడు హోరేబు దగ్గర వారితో యెహోవా ఒడంబడిక చేసిన సమయంలో మోషే ఆ పలకలు ఆ పెట్టెలో ఉంచాడు.

[10] యాజులు పవిత్ర స్థలం నుంచి బయటికి వచ్చినప్పుడు యెహోవా మేఘంతో తన ఆలయం నిండిపోయింది.

[11] అలా యెహోవా ఆలయం యెహోవా మహిమాప్రకాశంతో నిండుకోవడంవల్ల, ఆ మేఘం కారణంగా యాజులు అక్కడ నిలబడి సేవ జరిగించలేకపోయారు.

[12] అప్పుడు సొలొమోను ఇలా అన్నాడు: “యెహోవా చీకటియైన మేఘంలో నివాసం చేస్తానన్నాడు.

[13] ప్రభూ, నీ కోసం నేను ఘనమైన ఆలయాన్ని కట్టించితీరాను, ఎల్లకాలం నీవు నివాసం చేసే స్థలంగా దానిని నిర్మించాను.”

[14] ఇస్రాయేల్ సమాజమంతా అక్కడ నిలబడి ఉన్నారు. రాజు వారివైపుకు మళ్ళుకొని వారిని దీవించాడు. అప్పుడతడు ఇలా అన్నాడు:

[15] “ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాకు స్తుతులు కలుగుతాయి గాక! ఆయన నా తండ్రి దావీదుతో చెప్పిన మాట నెరవేర్చాడు.

[16] ఆయన అన్నాడు, ‘ఈజిప్ట్ నుంచి నేను నా ప్రజను తీసుకువచ్చిన రోజునుంచి నా పేరుకు ఆలయాన్ని కట్టించుకోవడానికి ఇస్రాయేల్ గోత్రాలకు చెందిన పట్టణాలలో దేనినీ ఎన్నుకోలేదు. కానీ నేను నా ఇస్రాయేల్‌ప్రజను పరిపాలించేందుకు దావీదును ఎన్నుకొన్నాను’.

[17] ఇస్రాయేల్‌ప్రజల దేవుడైన యెహోవా పేరుకు ఆలయాన్ని కట్టించే ఆశ నా తండ్రి దావీదు హృదయంలో ఉంది.

[18] అయితే నా తండ్రి దావీదుతో యెహోవా ఇలా అన్నాడు: ‘నా పేరుకు ఆలయాన్ని కట్టించే ఆశ నీ హృదయంలో ఉంది. నీ హృదయాభిలాష మంచిదే.

[19] అయినా ఆ ఆలయాన్ని నీవు కట్టించకూడదు. నీకు జన్మించే నీ కొడుకు నా పేరుకు ఆలయాన్ని కట్టిస్తాడు.

[20] యెహోవా తన మాటప్రకారం చేశాడు. యెహోవా చెప్పినట్టే నేను నా తండ్రి దావీదు స్థానంలో ఇస్రాయేల్ రాజ్య సింహాసనం ఎక్కాను, ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా పేరుకు ఈ ఆలయాన్ని కట్టించాను.

[21] యెహోవా మన పూర్వీకులను ఈజిప్ట్ నుంచి తీసుకువచ్చినప్పుడు తాను వారితో చేసిన ఒడంబడిక ఉన్న పెట్టెకోసం ఆలయంలో స్థలం నిర్మించాను.”

[22] అప్పుడు సొలొమోను యెహోవా బలిపీఠం ముందు ఇస్రాయేల్ సమాజ సమక్షంలో నిలబడి, చేతులు ఆకాశాలవైపు ఎత్తి ఇలా పలికాడు:

[23] “యెహోవా! ఇస్రాయేల్ ప్రజల దేవా! పైన ఆకాశాలలో గానీ క్రింద భూమి మీద గానీ నీకు సాటియైన దేవుడు మరొకడు లేడు. నీ మార్గంలో మనసారా నడిచే నీ సేవకుల పట్ల దయ చూపుతూ నీ ఒడంబడికను నెరవేరుస్తూ ఉంటావు.

[24] నీవు నీ సేవకుడూ నా తండ్రీ అయిన దావీదుతో చెప్పిన మాటప్రకారం చేశావు. నీ నోటితో చెప్పినది ఈరోజు నీవు నెరవేర్చావు.

[25] యెహోవా! ఇస్రాయేల్ ప్రజల దేవా! నీ సేవకుడూ నా తండ్రీ అయిన దావీదుతో నీవు ఇలా చెప్పావు: ‘నీ కొడుకులు నీ మాదిరిగా నా ఎదుట నడుచుకొంటూ వారి ప్రవర్తన విషయం జాగ్రత్తగా ఉంటే, నీ సంతతివారు ఇస్రాయేల్ రాజ్య పరిపాలన ఎప్పుడూ చేస్తారు.’

[26] ఇస్రాయేల్ ప్రజల దేవా! నీ సేవకుడూ నా తండ్రీ అయిన దావీదుతో నీవు చెప్పిన మాట నెరవేర్చమని వేడుకొంటున్నాను.

[27] “అయితే దేవుడు భూమిమీద నిజంగా నివాసం చేస్తాడా? ఆకాశం, పై ఆకాశాలు నీకు సరిపోవు. నేను కట్టించిన ఈ ఆలయం ఎలా సరిపోతుంది?

[28] అయినా నీ దాసుడైన నేను చేసే ప్రార్థన, విన్నపం ఆలకించు. యెహోవా! నా దేవా! నీ దాసుడైన నేను ఈవేళ నీకు పెట్టే మొర, నా ప్రార్థన వినిపించుకో.

[29] నీవు ఈ ఆలయాన్ని గురించి ‘నాపేరు అక్కడ ఉంటుంది’ అన్నావు, గనుక రాత్రింబగళ్ళు నీ కనుదృష్టి ఈ ఆలయంపై ప్రసరించనియ్యి. నీ దాసుడు ఈ ఆలయంవైపు మళ్ళుకొని చేసే ప్రార్థన విను.

[30] నీ దాసుడు, నీ ఇస్రాయేల్‌ప్రజ ఈ ఆలయం వైపు తిరిగి ప్రార్థన చేసేటప్పుడెల్లా వారి విన్నపం ఆలకించు. నీ నివాస స్థలమైన పరలోకంలో నుంచి విను. విని, పాపాలు క్షమించు.

[31] “ఎవడైనా తన పొరుగువాడి విషయం పాపం చేస్తే దానిని గురించి ఒట్టుపెట్టుమని ఇతరులు ఆ వ్యక్తిని ఈ ఆలయంలోని నీ పీఠం ముందుకు తీసుకువచ్చి ప్రమాణం చేయించుకొంటే,

[32] నీవు పరలోకంనుంచి ఆలకించు. నీ దాసులైన వారికి తీర్పు తీర్చు. పాపం చేసినవాణ్ణి దోషిగా నిర్ణయించి, వాడి నెత్తిమీదికి శిక్ష రప్పించు. న్యాయవంతుణ్ణి నిర్దోషిగా నిర్ణయించి అతడి నిర్దోషత్వం ప్రకారం అతడికి ప్రతిఫలం ప్రసాదించు.

[33] “నీ ఇస్రాయేల్‌ప్రజ నీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు వారి శత్రువుల చేతులలో ఓడిపోయినప్పుడు, వారు నీవైపు తిరిగి, నీ పేరును ఒప్పుకొని, ఈ ఆలయంలో నీకు ప్రార్థన, విన్నపాలు చేస్తే

[34] నీవు పరలోకం నుంచి విను. నీ ఇస్రాయేల్‌ప్రజ చేసే పాపం క్షమించి వారి పూర్వీకులకు నీవు ఇచ్చిన ఈ దేశానికి వారిని మళ్ళీ చేర్చు.

[35] “వారు నీకు వ్యతిరేకంగా పాపం చేసినందుచేత నీవు ఆకాశం మూసుకొని వాన కురిపించకపోయినప్పుడు వారు ఈ స్థలంవైపు తిరిగి, నీకు ప్రార్థన చేస్తే నీవు వారిమీద పెట్టిన బాధ కారణంగా వారు వారి పాపం విసర్జించి నీ పేరును ఒప్పుకొంటే,

[36] నీవు పరలోకంనుంచి ఆలకించు; నీ దాసుల పాపం, నీ ఇస్రాయేల్ ప్రజ పాపం క్షమించు; వారు నడవవలసిన మంచి విధానాన్ని వారికి నేర్పించు; నీవు నీ ప్రజకు వారసత్వంగా ఇచ్చిన దేశం మీద మళ్ళీ వాన కురిపించు.

[37] “ఈ దేశంలో కరవు వస్తే, తెగులు గానీ పంటలకు చీడలు గానీ మిడతలు గానీ పురుగులు గానీ వచ్చిపడితే, వారి శత్రువులు వారి పట్టణాలలో వారిని ముట్టడి వేస్తే – ఎలాంటి దెబ్బ గానీ రోగం గానీ వచ్చినా,

[38] నీ ఇస్రాయేల్ ప్రజలో ఎవరైనా ప్రార్థన, విన్నపం చేస్తే నీవు ఆలకించు. అలాంటి వ్యక్తి తన అంతరంగంలో ఉన్న వ్యాధి తెలుసుకొని ఈ ఆలయంవైపు తన చేతులు చాపి ప్రార్థన చేస్తే,

[39] నీ నివాసస్థలమైన పరలోకంనుంచి అతడి ప్రార్థన విని క్షమాపణ ప్రసాదించి ప్రతి వ్యక్తి ప్రవర్తనప్రకారం ప్రతిఫలమియ్యి. ప్రతి వ్యక్తి హృదయం నీకు తెలుసు గదా. మనుషులందరి హృదయాలలో ఏమి ఉన్నదో నీకు మాత్రమే తెలుసు.

[40] ఈ విధంగా నీవు మా పూర్వీకులకిచ్చిన ఈ దేశంలో వారు బ్రతికి ఉన్నంత వరకూ నీవంటే భయభక్తులు కలిగి బ్రతికేలా చెయ్యి.

[41] “ఇస్రాయేల్‌వారు గాక, దూర దేశంలోని పరాయివాళ్ళు నీ గొప్ప పేరును గురించీ నీ బలమైన హస్తాన్ని, చాపిన చేతిని గురించీ వింటారు.

[42] అలాంటివారెవరైనా నీ పేరుప్రతిష్ఠలను బట్టి వాళ్ళ దేశం నుంచి వచ్చి ఈ ఆలయంవైపు తిరిగి నీకు ప్రార్థన చేస్తే, నీవు నీ నివాసస్థలమైన పరలోకంనుంచి ఆలకించు;

[43] ఆ విదేశీయులు నిన్ను అడిగేదంతా వారికి ప్రసాదించు. ఆ విధంగా లోకంలో అన్ని జాతులవారు నీ పేరుప్రతిష్ఠలు తెలుసుకొని నీ ఇస్రాయేల్ ప్రజలాగా నీ విషయం భయభక్తులతో ఉంటారు. నేను కట్టించిన ఈ ఆలయమే నీ పేరు పెట్టబడ్డ ఆలయమని తెలుసుకొంటారు.

[44] “వారి శత్రువులతో యుద్ధం చేయడానికి నీవు నీ ప్రజను ఎక్కడికైనా పంపించినప్పుడు నీవు ఎన్నుకొన్న నగరం వైపూ నీ పేరుకు నేను కట్టించిన ఈ ఆలయం వైపూ వారు మళ్ళుకొని యెహోవాకు ప్రార్థన చేస్తే,

[45] వారి ప్రార్థన, విన్నపాలు పరలోకంనుంచి ఆలకించు. వారి పక్షం వహించు.

[46] “నీ ప్రజ నీకు వ్యతిరేకంగా పాపం చేసేటప్పుడు – పాపం చేయనివాడెవడూ లేడు గదా – నీవు వారిమీద కోపపడి వారిని శత్రువుల వశం చేసినందుచేత వారు శత్రువుల దేశానికి బందీలుగా వెళ్ళిన తరువాత, ఆ దేశం దూరంగా ఉన్నా,

[47] అప్పుడు బందీలుగా వెళ్ళిన ఆ దేశంలో వారు తలంచుకొని పశ్చాత్తాపపడి ‘మేము పాపం చేశాం, మూర్ఖంగా ప్రవర్తించాం, దుర్మార్గులమయ్యాం’ అంటూ తాము బందీలుగా వెళ్ళిన ఆ దేశంలో నీకు విన్నపం చేస్తే నీవు ఆలకించు.

[48] తమకు బందీలుగా కొనిపోయిన వారి శత్రువుల దేశంలో ఉండి వారు హృదయపూర్వకంగా మనసారా నీవైపు తిరిగి, నీవు వారి పూర్వీకులకిచ్చిన ఈ దేశంవైపూ నీవు ఎన్నుకొన్న నగరంవైపూ నీ పేరుకు నేను కట్టించిన ఈ ఆలయం వైపూ చూస్తూ నీకు ప్రార్థన చేస్తే,

[49] నీవు నీ నివాస స్థలమైన పరలోకం నుంచి వారి ప్రార్థన, విన్నపాలు ఆలకించు, వారి పక్షం వహించు.

[50] నీకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ ప్రజను క్షమించు. నీ విషయం వారు చేసిన తప్పిదాలన్నిటినీ క్షమించి వారిని బందీలుగా తీసుకుపోయినవాళ్ళకు వారిమీద జాలి కలిగించు.

[51] వారు నీ ప్రజ. నీ సొత్తు. నీవు వారిని ఈజిప్ట్ నుంచి – ఆ ఇనుప కొలిమి మధ్యలోనుంచి – బయటికి తీసుకువచ్చావు.

[52] కాబట్టి నీ కనుదృష్టి మామీద ఉంచి నీ దాసుడైన నేనూ నీ ఇస్రాయేల్ ప్రజ చేసే విన్నపం ఆలకించు. వారు నీకు మొర పెట్టేటప్పుడెల్లా ఆలకించు.

[53] ప్రభూ! యెహోవా! ఈ ప్రజ నీ సొత్తుగా ఉండడానికి ప్రపంచంలో అన్ని జాతులవారిలోనూ నీవు నీకోసం వారిని ప్రత్యేకించుకొన్నావు గదా! నీవు మా పూర్వీకులను ఈజిప్ట్ నుంచి తీసుకువచ్చినప్పుడు నీవు నీ సేవకుడైన మోషేచేత అలా మాట్లాడించావు గదా!”

[54] సొలొమోను ఆకాశం వైపు చేతులెత్తి యెహోవా బలిపీఠం ముందు మోకరించి యెహోవాకు ఈ ప్రార్థన, ఈ విన్నపం చేయడం ముగించాక

[55] అతడు నిలబడి స్వరమెత్తి ఇస్రాయేల్ సర్వసమాజాన్ని ఇలా దీవించాడు:

[56] “యెహోవాకు స్తుతులు కలుగుతాయి గాక! తాను చెప్పిన మాటప్రకారం ఆయన తన ఇస్రాయేల్‌ప్రజకు ప్రశాంతి ప్రసాదించి ఉన్నాడు. తన సేవకుడైన మోషేచేత ఆయన మాట్లాడించిన హితవాక్కులలో ఒక్కటి కూడా తప్పలేదు.

[57] మన పూర్వీకులతో ఉన్నట్టు మన దేవుడు యెహోవా మనతో కూడా ఉంటాడు గాక! మనలను వదలక ఉంటాడు గాక!

[58] ఆయన విధానాలన్నిటినీ అనుసరించి నడిచేలా ఆయన మన పూర్వీకులకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలూ శాసనాలూ న్యాయనిర్ణయాలూ పాటించేలా ఆయన మన హృదయాలను తనవైపు త్రిప్పుకొంటాడు గాక!

[59] యెహోవా సన్నిధానంలో నేను చేసిన ఈ ప్రార్థనా పదాలు మన దేవుడైన యెహోవా ఎదుట రాత్రింబగళ్ళూ ఉంటాయి గాక! ఆయన తన దాసుడైన నాపట్ల, తన ఇస్రాయేల్‌ప్రజ పట్ల, ఒక్కొక్కరి అనుదిన అవసరంప్రకారం న్యాయం జరిగిస్తాడు గాక!

[60] అప్పుడు ప్రపంచంలో అన్ని జాతులవారు యెహోవాయే దేవుడనీ ఆయన తప్ప మరి ఏ దేవుడూ లేడనీ తెలుసుకొంటారు.

[61] గనుక ఈ రోజు ఉన్నట్టు మన దేవుడు యెహోవా విషయం మీ భక్తిలో లోపం లేకుండా ఆయన శాసనాలను అనుసరిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటారు గాక!”

[62] అప్పుడు రాజూ అతడితోపాటు ఉన్న ఇస్రాయేల్ వారంతా యెహోవా సన్నిధానంలో బలులు అర్పించారు.

[63] సొలొమోను ఇరవై రెండు వేల ఎద్దులనూ లక్ష ఇరవై వేల గొర్రెమేకలనూ శాంతిబలులుగా యెహోవాకు అర్పించాడు. ఈ విధంగా రాజూ ఇస్రాయేల్‌వారంతా యెహోవా ఆలయాన్ని ప్రతిష్ఠించారు.

[64] యెహోవా సమక్షంలో ఉన్న కంచు బలిపీఠం ఆ హోమబలులూ నైవేద్యాలూ శాంతిబలుల క్రొవ్వునూ పట్టలేనంత చిన్నగా ఉంది. కనుక ఆ రోజు యెహోవా ఆలయానికి ముందున్న ఆవరణం మధ్యభాగాన్ని పవిత్రం చేశాడు. అక్కడే ఆ హోమబలులూ నైవేద్యాలూ శాంతిబలుల క్రొవ్వూ అర్పించాడు.

[65] ఆ సమయంలో సొలొమోను అతడితోపాటు ఇస్రాయేల్‌వారంతా ఒక విందు చేశారు. హమాతు త్రోవనుంచి ఈజిప్ట్ వాగువరకు ఉన్న ప్రాంతాల నుంచి వారు గొప్ప సమూహంగా సమావేశం అయ్యారు. యెహోవా దేవుని సన్నిధానంలో ఏడు రోజులు మహోత్సవం చేశారు; తరువాత ఇంకా ఏడు రోజులు చేశారు – మొత్తం పద్నాలుగు రోజులు.

[66] ఎనిమిదో రోజు రాజు ప్రజలకు సెలవిచ్చాడు. వారు రాజును కీర్తించి యెహోవా తన సేవకుడైన దావీదుకూ తన ఇస్రాయేల్ ప్రజకూ చేసిన అన్ని మేలుల కారణంగా ఆనందభరితులై సంబరపడుతూ వారి వారి గుడారాలకు వెళ్ళిపోయారు.

1 రాజులు — Chapters