Skip to content
Opens in a new window

[1] సొలొమోనురాజు ఇస్రాయేల్‌ప్రజలందరి మీద రాజయ్యాడు.

[2] అతని అధికారులు వీరు: సాదోకుయాజి కొడుకైన అజర్యా;

[3] షీషా కొడుకులు ఎలీహోరెపు, అహీయా కార్యదర్శులు; అహీలూదు కొడుకు యెహోషాపాతు లేఖికుడు;

[4] యెహోయాదా కొడుకు బెనాయా సేనాధిపతి; సాదోకు, అబ్యాతారు యాజులు;

[5] నాతాను కొడుకు అజర్యా ఉద్యోగస్థులందరికీ ఉన్నతాధికారి; నాతాను కొడుకైన జాబూదుయాజి రాజుకు సన్నిహితుడు;

[6] అహీషారు రాజభవనం మీద నిర్వాహకుడు; అబదా కొడుకు అదోనీరాం వెట్టిపనులు చేసేవారి పై అధికారి.

[7] సొలొమోను క్రింద, ఇస్రాయేల్ రాజ్యమంతటి మీద, పన్నెండుమంది పాలకులు ఉన్నారు. వారు రాజుకు అతని ఇంటివారికి ఆహారం సరఫరా చేసేవారు. సంవత్సరంలో నెలకు ఒకరి చొప్పున భోజనపదార్థాలు సరఫరా చేసేవారు.

[8] వారిపేర్లు ఇవి: ఎఫ్రాయిం కొండ ప్రదేశంలో బెన్‌హూరు;

[9] మాకసులో, షాల్బీంలో, బేత్‌షెమెషులో, పలోన్ బెథానానులో బెన్‌దాకరు;

[10] అరుబ్బోతులో బెన్‌హెపెదు (అతడు శోకో మీదా హెపెరు ప్రదేశమంతటి మీదా పాలకుడు);

[11] దోరు ప్రదేశమంతటి మీదా బెన్‌అబీనాదాబు (అతడి భార్య సొలొమోను కూతురు టాపాతు);

[12] అహీలూదు కొడుకు బానాతానాక్ మీదా మెగిద్దోమీదా బేత్‌షెయాను ప్రాంతమంతటి మీదా అధికారి (బేత్‌షెయాను సారెతాను దగ్గరగా యెజ్రేల్ దిగువగా ఉంది. అతడి ప్రాంతం బేత్‌షెయానునుంచి ఆబేల్‌మేహోలా వరకు, యొక్నేం అవతల ఉన్న స్థలంవరకు ఉంది.)

[13] బెన్‌గెబెరు రామోత్ గిలాదులో ఉండేవాడు. అతనిది గిలాదులో ఉన్న మనష్షే వంశస్థుడైన యాయీరు పట్టణాలు, బాషానులోని అర్గోబు ప్రదేశం. ఆ ప్రదేశంలో ప్రాకారాలూ కంచుద్వారం అడ్డగడియలూ ఉన్న అరవై పెద్ద పట్టణాలు ఉన్నాయి.

[14] ఇద్దో కొడుకు అహీనాదాబు ప్రాంతం మహనయీం.

[15] నఫ్తాలి ప్రదేశంలో అహీమాను ఉండేవాడు. అతడు సొలొమోను కూతురు బాశెమతును వివాహమాడాడు.

[16] ఆలోతు, ఆషేరు ప్రదేశంలో హూషై కొడుకు బానా ఉండేవాడు.

[17] ఇశ్శాకారు ప్రదేశంలో పరూయా కొడుకు యెహోషాపాతు ఉండేవాడు.

[18] బెన్యామీను ప్రదేశంలో ఏలా కొడుకు షిమీ ఉండేవాడు.

[19] గిలాదులో ఊరీ కొడుకు గెబెరు ఉండేవాడు. (పూర్వం ఆ ప్రదేశం అమోరీవాళ్ళ రాజు సీహోనుకూ బాషాను రాజు ఓగుకూ చెందిన ప్రదేశం.) అతడు ఒక్కడే ఆ ప్రదేశంలో పాలకుడు.

[20] యూదావారూ ఇస్రాయేల్‌వారూ సంఖ్యలో సముద్ర తీరాన ఉన్న ఇసుక రేణువుల్లాగా ఉన్నారు. వారు తింటూ త్రాగుతూ సంబరపడుతూ ఉన్నారు.

[21] సొలొమోను యూఫ్రటీసు నదినుంచి ఫిలిష్తీయవాళ్ళ దేశంవరకు, ఈజిప్ట్ సరిహద్దువరకు ఉన్న అన్ని రాజ్యాలను పరిపాలించాడు. ఆ రాజ్యాలవారు సొలొమోనుకు కప్పం చెల్లిస్తూ అతడు బ్రతికి ఉన్నంత కాలం అణిగి మణిగి ఉన్నారు.

[22] సొలొమోను భవనానికి ఒక్కొక్క రోజుకు సరిపోయే ఆహారమెంతంటే ఆరు వందల తూముల మెత్తని గోధుమ పిండి, వెయ్యిన్ని రెండువందల తూముల ముతక పిండి,

[23] పది బలిసిన ఎడ్లు, మందలో మేపే ఎడ్లు మరో ఇరవై, వంద గొర్రెలు, మేకలు. ఇవేగాక, లేళ్ళు, దుప్పులు, మగ జింకలు, కొవ్విన పక్షులు కూడా ఉన్నాయి.

[24] సొలొమోను అధికారం యూఫ్రటీసు నదికి పడమరగా, తిప్సానుంచి గాజావరకు ఉంది. ఆ నదికి పడమరగా ఉన్న రాజులందరూ అతని అధికారం క్రింద ఉన్నారు. అంతటా అందరూ అతనితో సమాధానంగా ఉన్నారు.

[25] సొలొమోను పరిపాలన కాలమంతా యూదావారూ ఇస్రాయేల్‌వారూ దాను పట్టణం నుంచి బేర్‌షెబా పట్టణం వరకు నిర్భయంగా ఉండిపోయారు. ఒక్కొక్కరికి సొంత ద్రాక్షచెట్లూ అంజూరుచెట్లూ ఉన్నాయి.

[26] సొలొమోనుకు రథాలకోసం నలభై వేల గుర్రాలూ శాలలూ ఉన్నాయి. రౌతులకోసం పన్నెండు వేల గుర్రాలు కూడా ఉన్నాయి.

[27] ఆ పన్నెండుమంది పాలకులలో ఒక్కొక్కరు తన నెలలో సొలొమోను రాజుకూ అతడి బల్ల దగ్గర భోజనం చేసే వారందరికీ భోజన పదార్థాలు సరఫరా చేశారు. ఎవరికీ కొదువ కాలేదు.

[28] అంతేగాక, ఆ పాలకులు గుర్రాలు, రౌతుల గుర్రాలు ఉన్నచోట్లకు వాటికి ఎండుగడ్డి, యవలు తెప్పించారు.

[29] సొలొమోనుకు దేవుడు మహా గొప్ప జ్ఞానాన్నీ వివేచనాశక్తినీ ప్రసాదించాడు. ఇసుక రేణువులున్న సముద్ర తీరమంత విశాల హృదయాన్ని ఇచ్చాడు.

[30] సొలొమోను జ్ఞానం తూర్పు దేశాలవాళ్ళందరి జ్ఞానంకంటే, ఈజిప్ట్‌లోని జ్ఞానమంతటికంటే మెరుగైనది.

[31] మనుషులందరికంటే సొలొమోను ఎక్కువ జ్ఞానం గలవాడు. ఎజ్రాహివాడైన ఏతాను కంటే, మహోలు కొడుకులు హేమాను, కల్కోల్, దర్దల కంటే జ్ఞానవంతుడు. అతని పేరుప్రతిష్ఠలు చుట్టూరా ఉన్న అన్ని దేశాలలో వ్యాపించాయి.

[32] అతడు మూడు వేల సామెతలు పలికాడు. అతని కీర్తనలు వెయ్యిన్ని అయిదు.

[33] అతడు అన్ని రకాల చెట్లను గురించి – లెబానోనులో పెరిగే దేవదారుల నుంచి గోడలో మొలిచే హిస్సోపు చెట్ల మొక్కలవరకు – మాట్లాడాడు. జంతువులు, పక్షులు, ప్రాకే ప్రాణులు, చేపలను గురించి కూడా మాట్లాడాడు.

[34] అతని జ్ఞానాన్ని గురించి విన్న భూరాజులందరిలోనుంచీ అన్ని జాతులలోనుంచీ మనుషులు అతని జ్ఞాన వాక్కులు విందామని సొలొమోను దగ్గరికి వచ్చారు.

1 రాజులు — Chapters