Skip to content
Opens in a new window

[1] యరొబాం ధూపం వేయడానికి ఆ బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నాడు. అప్పుడే దేవుని మనిషి ఒకడు యూదా ప్రదేశం నుంచి వచ్చి బేతేల్ చేరాడు. యెహోవా మాట విని అతడు వచ్చాడు.

[2] యెహోవా నుంచి వచ్చిన వాక్కు ప్రకారం అతడు ఆ బలిపీఠానికి వ్యతిరేకంగా ఇలా పలికాడు: “బలిపీఠమా! బలిపీఠమా! యెహోవా ఈ విధంగా చెపుతున్నాడు – దావీదు రాజ వంశంలో మగ శిశువు జన్మిస్తాడు. అతనికి యోషీయా అనే పేరు పెడతారు. నీ మీద ధూపం వేసే ఎత్తయిన పూజాస్థలాల యాజులను అతడు నీ మీద వధిస్తాడు. మనుషుల ఎముకలను నీ మీద కాలుస్తాడు.”

[3] ఆ వేళే ఆ మనిషి ఒక సూచన ఇచ్చాడు. “ఇప్పుడు ఈ పీఠం బ్రద్దలవుతుంది, దాని మీద ఉన్న బూడిద ఒలికిపోతుంది. యెహోవా చెప్పిన సూచన ఇదే” అన్నాడు.

[4] బేతేల్‌లో ఉన్న ఆ బలిపీఠానికి వ్యతిరేకంగా దేవుని మనిషి పలికినది విని యరొబాంరాజు “అతణ్ణి పట్టుకోండి” అన్నాడు. బలిపీఠం మీద నుంచి అతడు చేయి చాపాడు. దేవుని మనిషివైపు చాపిన అతడి చేయి వెంటనే ఎండిపోయింది. తిరిగి దానిని వెనక్కు తీయడానికి అతడికి చేత కాలేదు.

[5] అంతేగాక, యెహోవా వాక్కు అనుసరించి దేవుని మనిషి వెల్లడి చేసిన సూచన ప్రకారం బలిపీఠం బ్రద్దలైంది, దాని నుంచి బూడిద ఒలికిపోయింది.

[6] అప్పుడు దేవుని మనిషితో రాజు, “నా చెయ్యి బాగయ్యేట్టు దయ చూపి నీ దేవుడు యెహోవాను అర్థించు, నా కోసం ప్రార్థించు” అన్నాడు. దేవుని మనిషి యెహోవాను వేడుకొన్నాడు. రాజు చెయ్యి పూర్తిగా నయమై మునుపటివలె అయింది.

[7] అప్పుడు రాజు దేవుని మనిషితో “నాతో నా ఇంటికి రా. అక్కడ సేద తీర్చుకో. నీకు బహుమానం ఇస్తాను” అన్నాడు.

[8] రాజుతో దేవుని మనిషి ఇలా చెప్పాడు: “మీ ఇంట్లో సగం నాకిచ్చినా నేను మీతో లోపలికి రాను. అంతేగాక, ఈ స్థలంలో నేను భోజనం చేయను. నీళ్ళు త్రాగను.

[9] ఎందుకంటే, యెహోవా నాకు ఇలా ఆజ్ఞాపించాడు – నీవు అక్కడ భోజనం చేయవద్దు. నీళ్ళు త్రాగవద్దు. వెళ్ళిన దారిన తిరిగి రావద్దు.”

[10] అందుకని అతడు బేతేల్‌కు వచ్చిన దారిన తిరిగి వెళ్ళలేదు. ఇంకో దారిన వెళ్ళాడు.

[11] బేతేల్‌లో ఒక ప్రవక్త కాపురం ఉండేవాడు. అతడు ముసలివాడు. అతడి కొడుకులు వచ్చి ఆ వేళ ఆ దేవుని మనిషి బేతేల్‌లో చేసినదంతా అతనికి తెలియజేశారు. ఆ మనిషి రాజుతో చెప్పిన మాటలు కూడా వారి తండ్రికి చెప్పారు.

[12] వారి తండ్రి “అతడు ఏ దారిన వెళ్ళాడు?” అని వారి నడిగాడు. యూదా నుంచి వచ్చిన ఆ దేవుని మనిషి వెళ్ళిన దారి అతడి కొడుకులు చూపించారు.

[13] “గాడిద మీద జీను వేయండి” అని అతడు కొడుకులతో చెప్పాడు. వాళ్ళు అతడి కోసం గాడిద మీద జీను వేశారు. అతడు గాడిదను ఎక్కి బయలుదేరాడు.

[14] ఆ ప్రవక్త దేవుని మనిషి వెంటపడి అతడు సిందూర వృక్షం క్రింద కూర్చుని ఉండడం చూచి అతణ్ణి అడిగాడు: “యూదా ప్రదేశం నుంచి వచ్చిన దేవుని మనిషివి నీవేనా?” ఆ మనిషి “నేనే” అన్నాడు.

[15] “నాతో ఇంటికి వచ్చి భోం చేసి వెళ్ళు” అని ఆ ప్రవక్త చెప్పాడు.

[16] అతడు ఇలా బదులు చెప్పాడు: “నేను తిరిగి మీతో కూడా వెళ్ళి మీ ఇంట ప్రవేశించలేను. మీతో కలిసి ఈ స్థలంలో భోజనం గానీ నీళ్ళు గానీ పుచ్చుకోలేను.

[17] ఎందుకంటే దేవుని నుంచి ఈ వాక్కు నాకు వచ్చింది: నీవు అక్కడ భోజనం చేయకూడదు. నీళ్ళు త్రాగకూడదు. నీవు వెళ్ళిన దారిన తిరిగి రావద్దు.”

[18] అతడు ఆ దేవుని మనిషితో “నీలాగే నేనూ ప్రవక్తనే. యెహోవా ఆజ్ఞననుసరించి ఒక దేవదూత నాతో ఇలా అన్నాడు – అతడు భోజనం చేసి నీళ్ళు త్రాగేట్టు అతణ్ణి తీసుకురా” అన్నాడు. అయితే అతడు అబద్ధమాడాడు.

[19] ఆ మనిషి అతడితోపాటు తిరిగి వెళ్ళి అతడి ఇంట్లో అన్నపానాలు పుచ్చుకొన్నాడు.

[20] వారు ఇంకా బల్ల దగ్గర కూర్చుని ఉండగానే ఆ మనిషిని తీసుకువచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా నుంచి వాక్కు వచ్చింది.

[21] అతడు యూదానుంచి వచ్చిన ఆ దేవుని మనిషితో ఇలా బిగ్గరగా చెప్పాడు: “యెహోవా ఈ విధంగా చెప్తున్నాడు – నీవు యెహోవా మాట మీద తిరగబడ్డావు. నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను శిరసావహించలేదు.

[22] భోజనం గానీ నీళ్ళు గానీ తీసుకోవద్దు అని ఆయన ఏ స్థలాన్ని గురించి ఆజ్ఞాపించాడో ఆ స్థలంలో నీవు భోజనం, నీళ్ళు తీసుకొన్నావు గనుక నీ శవం నీ పూర్వీకుల సమాధులకు చేరదు.”

[23] వారు భోజనం చేసి నీళ్ళు త్రాగిన తరువాత అతడు వెనక్కు తీసుకువచ్చిన ఆ ప్రవక్తకోసం గాడిద మీద జీను వేశాడు.

[24] ఆ ప్రవక్త ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. త్రోవలో ఒక సింహం ఎదురై అతణ్ణి చంపింది. అతడి శవం త్రోవలోనే పడి ఉంది. దాని దగ్గర గాడిద నిలుచుంది. సింహం కూడా శవం దగ్గర నిలబడి ఉంది.

[25] బాటసారులు కొందరు అక్కడ చేరి శవం దారిలో పడి ఉండడం, శవం దగ్గర సింహం నిలబడి ఉండడం చూశారు. వారు వెళ్ళి ఆ ముసలి ప్రవక్త కాపురం ఉంటున్న పట్టణంలో ఆ సంగతి చెప్పారు.

[26] మార్గం నుంచి అతణ్ణి వెనక్కు తీసుకువచ్చిన ఆ ముసలి ప్రవక్త ఆ వార్త విని, “అతడు యెహోవా మాట మీద తిరగబడిన దేవుని మనిషి. యెహోవా అతణ్ణి సింహానికి ఇచ్చాడు. యెహోవా అతనికి చెప్పిన వాక్కు ప్రకారం ఆ సింహం అతణ్ణి చీల్చి చంపింది” అన్నాడు.

[27] అప్పుడతడు తన కొడుకులను పిలిచి “నా కోసం గాడిద మీద జీను వేయండి” అన్నాడు. వారు అలా చేశారు.

[28] అతడు వెళ్ళి దారిలో శవం పడి ఉండడం, శవం దగ్గర గాడిద, సింహం నిలబడి ఉండడం చూశాడు. సింహం శవాన్ని తిన్నది కాదు, గాడిదను చీల్చింది కాదు.

[29] ఆ ముసలి ప్రవక్త ఆ దేవుని మనిషి యొక్క శవాన్ని ఎత్తి గాడిద మీద వేసుకొన్నాడు, రోదనం చేయడానికీ శవాన్ని పాతిపెట్టడానికీ దానిని తన పట్టణానికి తీసుకువచ్చాడు,

[30] తన సొంత సమాధిలో శవాన్ని ఉంచాడు. వారు “అయ్యో, సోదరా!” అంటూ శోకించారు.

[31] శవాన్ని సమాధి చేసిన తరువాత అతడు కొడుకులతో ఇలా అన్నాడు: “నేను చనిపోయినప్పుడు ఆ దేవుని మనిషిని ఉంచిన సమాధిలోనే నన్ను పాతి పెట్టండి. నా ఎముకలను అతడి ఎముకల దగ్గరే పెట్టండి.

[32] ఎందుకంటే బేతేల్‌లో ఉన్న బలిపీఠానికి వ్యతిరేకంగా, షోమ్రోను ప్రదేశ పట్టణాలలో ఉన్న ఎత్తయిన స్థలాల గుళ్ళన్నిటికీ వ్యతిరేకంగా యెహోవా వాక్కు ప్రకారం అతడు ప్రకటించినది తప్పక జరుగుతుంది.”

[33] ఆ తరువాత కూడా యరొబాం తన దుర్మార్గాలు విడిచి పెట్టలేదు. మరో సారి ఎత్తయిన పూజా స్థలాలకు సామాన్యులను యాజులుగా నియమించాడు. ఇష్టమున్న వారందరినీ ఆ స్థలాలకు యాజులుగా ప్రతిష్ఠ చేశాడు.

[34] యరొబాం యొక్క రాజ వంశాన్ని నిర్మూలించి భూమిమీద లేకుండా నాశనం చేసిన పాపం ఇదే.

1 రాజులు — Chapters