Skip to content
Opens in a new window

[1] గిలాదు ప్రదేశం లోని తిష్బి గ్రామంవాడైన ఏలీయా అహాబుతో ఇలా అన్నాడు: “నేను ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవా సన్నిధానంలో నిలుచున్నాను. ఆయన జీవం మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్పేంతవరకు ఈ సంవత్సరాలలో మంచు గానీ వర్షం గానీ ఏమీ పడదు.”

[2] తరువాత యెహోవా నుంచి ఏలీయాకు వాక్కు వచ్చింది:

[3] “ఈ స్థలం వదలిపెట్టి తూర్పువైపుకు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగుకో. ఆ వాగు యొర్దానుకు ఎదురుగా ఉంది.

[4] ఆ వాగు నీళ్ళు నీవు త్రాగాలి. నీకు కాకులు ఆహారం అక్కడికి తెస్తాయి. వాటికి నేను అలా ఆదేశించాను.”

[5] యెహోవా చెప్పినట్టే ఏలీయా చేశాడు. అతడు వెళ్ళి యొర్దానుకు తూర్పుగా ఉన్న కెరీతు వాగు ఒడ్డున ఉండిపోయాడు.

[6] ప్రతిరోజూ ఉదయాన సాయంకాలాన కాకులు అతనికి మాంసం, రొట్టెలు తెచ్చేవి. అతడు ఆ వాగు నీళ్ళు త్రాగేవాడు.

[7] కొంతకాలానికి దేశంలో వర్షం లేక ఆ వాగు ఎండిపోయింది.

[8] అప్పుడు యెహోవా నుంచి వాక్కు అతనికి వచ్చింది:

[9] “నీవు లేచి సీదోనుకు చెందిన సారెపతుకు వెళ్లి అక్కడ ఉండు. నిన్ను ఒక విధవరాలు పోషించాలని ఆమెకు నేను ఆదేశించాను.”

[10] అతడు లేచి సారెపతు వెళ్ళాడు. ఊరిద్వారం చేరగానే ఒక విధవరాలు కనిపించింది. ఆమె కట్టె పుల్లలు ఏరుతూ ఉంది. ఏలీయా ఆమెను పిలిచి,

[11] “దయ చూపి త్రాగడానికి కొంచెం నీళ్ళు చెంబులో నాకు తీసుకురండి” అన్నాడు. ఆమె నీళ్ళు తేబోతూ ఉంటే అతడు మళ్ళీ ఆమెను పిలిచి “మీ చేతితో ఒక రొట్టెముక్క కూడా నాకు తీసుకురండి” అన్నాడు.

[12] అందుకామె ఇలా జవాబిచ్చింది: “మీ దేవుడు యెహోవా జీవంతోడు ఒట్టుపెట్టి చెప్తున్నాను – నా దగ్గర కాల్చిన రొట్టె ఒక్కటి కూడా లేదు. కుండలో పట్టెడు పిండి, జాడీలో కొంచెం నూనె మాత్రం ఉన్నాయి. చావబోయే ముందు ఇంటికి వెళ్ళి నాకూ నా అబ్బాయికీ రొట్టె చేద్దామని నేను కట్టెపుల్లలు ఏరుతున్నాను.”

[13] ఏలీయా ఆమెతో ఇలా అన్నాడు: “నిర్భయంగా ఉండండి. వెళ్ళి మీరు చెప్పినట్టే చేయండి. అయితే ముందు నాకోసం చిన్న రొట్టె చేసి తీసుకురండి, ఆ తరువాత మీకూ మీ అబ్బాయికీ రొట్టెలు చేసుకోండి.

[14] ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా ఇలా చెప్తున్నాడు – దేశం మీద యెహోవా వర్షం కురిపించేవరకు ఆ కుండలో పిండి తగ్గిపోదు, జాడీలో నూనె అయిపోదు.”

[15] ఆమె వెళ్ళి ఏలీయా చెప్పినట్టు చేసింది. అతడు, ఆమె, ఆమె కుటుంబం తిన్నారు. చాలా రోజులకు ఇలా వారికి తినడానికి తిండి ఉంది.

[16] కుండలో పిండి తరిగిపోలేదు, జాడీలో నూనె అయిపోలేదు. ఏలీయా ద్వారా యెహోవా చెప్పిన మాట నెరవేరింది.

[17] కొంతకాలం తరువాత ఆ గృహిణి కొడుకుకు జబ్బు చేసింది. ఆ జబ్బు తీవ్రమై అతడు ప్రాణం విడిచాడు.

[18] ఆమె ఏలీయాతో “దేవుని మనుషులైన మీరు నా దగ్గరికి రావడం దేనికి? నా అపరాధాలు జ్ఞాపకం చేసి నా కొడుకును చంపడానికి వచ్చారా?” అంది.

[19] అతడు “మీ కొడుకును ఇలా ఇవ్వండి” అంటూ ఆమె కౌగిట్లో నుంచి ఆ అబ్బాయిని అందుకొన్నాడు. తాను ఉంటున్న మేడ గదికి అతణ్ణి తీసుకువెళ్ళి తన పడక మీద పడుకోబెట్టాడు.

[20] అప్పుడతడు యెహోవాకు ఇలా మొరపెట్టాడు: “యెహోవా, నా దేవా, నాకు బస ఇచ్చిన ఈ విధవరాలి మీదికి విపత్తు రప్పించి ఆమె కొడుకును చనిపోయేలా చేశావా?”

[21] అప్పుడు ఏలీయా ఆ అబ్బాయిమీద మూడు సార్లు పార చాచుకొన్నాడు, “యెహోవా, నా దేవా! ఈ పిల్లవాడికి ప్రాణం తిరిగి రానిమ్మని వేడుకొంటున్నాను” అంటూ ప్రార్థించాడు.

[22] ఏలీయా చేసిన ప్రార్థన యెహోవా విన్నాడు. పిల్లవాడికి ప్రాణం తిరిగి వచ్చింది. అతడు బ్రతికాడు.

[23] ఏలీయా పిల్లవాణ్ణి ఎత్తుకొని ఆ గదినుంచి ఇంట్లోకి తీసుకువచ్చి అతణ్ణి తల్లి చేతికి అందజేస్తూ “ఇడుగో, మీ కొడుకు బ్రతికేవున్నాడు” అన్నాడు.

[24] ఆ స్త్రీ ఏలీయాతో “మీరు దేవుని మనుషులే. మీ నోట ఉన్న యెహోవా వాక్కు సత్యమే. ఇది నాకు ఇప్పుడు తెలిసింది” అంది.

1 రాజులు — Chapters